28.2 C
Hyderabad
Homeతెలంగాణఆ అవ‌మాన‌మే ఎమ్మెల్యేను చేసింది!

ఆ అవ‌మాన‌మే ఎమ్మెల్యేను చేసింది!

* ఉమ్మడి కుటుంబంలో విలువలతో పెరిగాను
* మంచి వ్యాపార‌వేత్త‌గా ఎద‌గాల‌ని అనుకున్నా..
* కార్యకర్తలు, యూనియన్లే నా బలం
* కొందరికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది
* మళ్లీ ఎమ్మెల్యే అవుతా
* డిజిటల్ మీడియాతో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చిట్‌చాట్

అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి:

అన్నీ అనుకున్నట్టు జరగవు. తానొకటి తలిస్తే…దైవం ఒకటి ఇచ్చింది. మొదటగా రాజకీయ నాయకుడు కావాలనే ఆలోచన లేదు. తాను మంచి వ్యాపారవేత్తగా ఎదగాలి… అన్నయ్య ఎమ్మెల్యే కావాలని, ఆయనకు తోడుగా ఉండాలని అనుకున్నాడు. కానీ జరిగింది వేరే అని మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్ విప్, బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఎదురైన ఓ అవమానకర ఘటన తన జీవితాన్ని మలుపు తిప్పిందని, ఎమ్మెల్యే కావాలనే కసిని రేపిందని చెప్పారు. ఓటమి నుంచి గెలుపు వరకు, తెలంగాణ ఉద్యమం నుంచి ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే వరకు సాగిన తన రాజకీయ ప్రస్థానాన్ని డిజిటల్ మీడియాతో శుక్రవారం జరిగిన చిట్‌చాట్‌లో ఆయన పంచుకున్నారు.

ఉమ్మడి కుటుంబం.. విలువలతో పెంపకం

తమది పెద్ద ఉమ్మడి కుటుంబమని, విలువలు, సంప్రదాయాలతో పెరిగామని వినయ్ భాస్కర్ తెలిపారు. తండ్రి విద్యుత్ శాఖలో ఉద్యోగం చేసేవారని, చిన్నతనంలో అన్నలు, అక్కలు, తమ్ముళ్లతో కలిసి వడ్డేపల్లిలోని ఇంట్లో ఉండేవారమన్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండే వాతావరణం తమకు జీవిత విలువలను నేర్పిందన్నారు. యువకుడిగా ఉన్న సమయంలో తాను మంచి వ్యాపారవేత్త కావాలని, తన అన్న దాస్యం ప్రణయ్ భాస్కర్ ఎమ్మెల్యే కావాలని అనుకునేవారని చెప్పారు. మొదట టెంట్ హౌస్ నిర్వహించడంతో పాటు పలు ఏజెన్సీలు తీసుకుని వ్యాపార రంగంలో అడుగులు వేశానన్నారు. అప్పట్లో ఇప్పటిలా ఆన్‌లైన్ షాపులు, ఇన్‌స్టా మార్ట్‌లు లేకపోవడంతో ఏజెన్సీ లైసెన్సులు తీసుకుని వ్యాపారం చేసేవాడినని తెలిపారు.

అన్నయ్య రాజకీయాల్లో.. తాను తెరవెనుక

తన అన్నయ్య ప్రణయ్ భాస్కర్ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారని, తాను మాత్రం ఆయనకు తెరవెనుక నుంచి సహకరించేవాడినని వినయ్ భాస్కర్ తెలిపారు. 1984లో ప్రణయ్ భాస్కర్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ప్రజలతో సంబంధాలను బలోపేతం చేసేందుకు పలు సంఘాలను ఏర్పాటు చేశామని చెప్పారు. 1994లో అన్నయ్య ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారని, అప్పటి నుంచి ఏర్పడిన సంఘాలు తమ కుటుంబానికి ఇప్పటికీ అండగా ఉన్నాయని తెలిపారు. అయితే అన్నయ్య అకాల మరణంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు. ఆ సమయంలో తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, కుటుంబం, వ్యాపారంపైనే దృష్టి పెట్టాలని భావించానన్నారు.

ఆ ఒక్క అవమానమే రాజకీయాల్లోకి తెచ్చింది

అన్నయ్య మరణం తర్వాత అమ్మ, నాన్న, వదిన, పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లిన సందర్భంలో తన జీవితంలో కీలకమైన ఘటన జరిగిందని వినయ్ భాస్కర్ తెలిపారు. అన్నయ్యకు కేటాయించిన ఎమ్మెల్యే క్వార్టర్‌కు వెళ్లగా, అప్పటికే గదికి సీల్ వేసి ఉందన్నారు. తండ్రికి తెలియకుండా కీలు తీసుకురావాలనే ఉద్దేశంతో క్వార్టర్ నిర్వహణ చూసే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ను కలిసిన సమయంలో ఆయన తమను అవమానించారని చెప్పారు. “మీరు ఓడిపోయారు కదా” అంటూ దారుణంగా మాట్లాడటంతో తాను తీవ్రంగా బాధపడ్డానన్నారు. ఆ ఘటన అనంతరం పోలీసులు తనను తీసుకెళ్లారని, అప్పట్లో టీడీపీలో మంత్రిగా ఉన్న చందూలాల్ కలుగజేసుకుని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించారని తెలిపారు. ఆ అవమానం తనలో తీవ్ర కసిని రేపిందని, “పదవి లేకుంటే ఇంత అవమానిస్తారా?” అనే ఆలోచన తనను వెంటాడిందన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాతే మళ్లీ వస్తానని అప్పుడే మనసులో నిర్ణయించుకున్నానని చెప్పారు.

*ఓటమి.. 35 వేల ఓట్లు

టీడీపీ టికెట్ దక్కని పరిస్థితుల్లో 1999లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 35 వేల ఓట్లు సాధించానని వినయ్ భాస్కర్ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తనకు మంచి ఓటు వాటా వచ్చిందన్నారు. 2004లో ఎలాగైనా ఎమ్మెల్యే కావాలని నిర్ణయించుకున్న సమయంలో టీడీపీ–బీజేపీ పొత్తు కారణంగా తన స్థానాన్ని త్యాగం చేయాలని చంద్రబాబు నాయుడు సూచించారని చెప్పారు. అయితే తన మనస్సాక్షి స్వతంత్రంగా పోటీ చేయాలని చెప్పిందన్నారు. తనతో పాటు మరో పది మంది కూడా తన బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. తర్వాత చంద్రబాబు నాయుడు పిలిపించి పోటీ నుంచి తప్పుకోవాలని కోరారని, “ప్రపంచం అంతా నన్ను చూస్తోంది.. నేను మాత్రం నిన్ను చూస్తున్నాను” అంటూ తనను ఒప్పించే ప్రయత్నం చేశారని చెప్పారు. అయినప్పటికీ తాను ససేమిరా ఒప్పుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ప్రచారానికి వెళ్లకుండా కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొన్నానని తెలిపారు. చివరకు కేవలం 1,400 ఓట్ల తేడాతో ఓడిపోయానన్నారు. తన ధైర్యానికి కారణం కార్యకర్తలు, ప్రజలేనని చెప్పారు.

*2005లో కేసీఆర్‌తో ఉద్య‌మ ప్రయాణం

తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో 2005లో కేసీఆర్ తనను హైదరాబాద్ పిలిపించారని వినయ్ భాస్కర్ తెలిపారు. తనతో కలిసి ప్రయాణం చేయాలని కేసీఆర్ కోరారని, అలా టీఆర్‌ఎస్‌తో తన రాజకీయ ప్రయాణం ప్రారంభమైందన్నారు. తొలుత కార్పొరేటర్‌గా పోటీ చేస్తే పట్టణ ప్రాంతంలో పట్టు సాధించవచ్చని కేసీఆర్ సూచించారని చెప్పారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, తెలంగాణ ఉద్యమంలో మడమ తిప్పని పోరాటం చేయడం ద్వారా ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నా అని అన్నారు.

పార్టీ కార్యాలయం ప్రారంభించిన రోజే టికెట్ ఖరారు

టీఆర్‌ఎస్ టౌన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేయూ జంక్షన్ సమీపంలో పార్టీ కార్యాలయం కోసం భవనాన్ని అద్దెకు తీసుకున్నానని తెలిపారు. కేసీఆర్ చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. కొందరు తనపై లేనిపోని విషయాలు చెప్పి కేసీఆర్‌ను కార్యాలయానికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను స్వయంగా వెళ్లి కేసీఆర్‌ను ఆహ్వానించగా, చివరకు ఆయన వచ్చి కార్యాలయాన్ని ప్రారంభించారని తెలిపారు. కార్యాలయం ఏర్పాటుకు తాను పడిన కష్టాన్ని, తనకు ఉన్న ప్రజాబలాన్ని కేసీఆర్ గుర్తించి అభినందించారని, అక్కడే తనకు పార్టీ టికెట్ ఖరారైందన్నారు.

*కార్మిక సంఘాలు…..మానవ సంబంధాలే బలం

2004 ఓటమి తర్వాత ప్రజలు, కార్మికులు, వివిధ సంఘాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకున్నానని వినయ్ భాస్కర్ తెలిపారు. 44 సంఘాలతో కార్మిక ఐక్య వేదిక ఏర్పాటు చేసి వారి సమస్యల్లో భాగస్వామిగా మారానన్నారు. “నేను ఆర్థిక సంబంధాలతో కాదు.. మానవ సంబంధాలతో గెలిచాను” అని ఆయన పేర్కొన్నారు. కార్మిక, సహకార సంఘాలంటే తనకు ప్రత్యేక అభిమానమని, వాటి కష్టసుఖాల్లో ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. ఈ సంబంధాలే తనకు ప్రధాన బలమని చెప్పారు.

కల్పలతతో విడదీయరాని అనుబంధం
వరంగల్ సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న కల్పలత సూపర్ బజార్‌తో చిన్ననాటి నుంచే తనకు ప్రత్యేక అనుబంధం ఉందని వినయ్ భాస్కర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కల్పలత సూపర్ బజార్లను మూసివేసేందుకు ప్రయత్నాలు జరిగినప్పుడు అడ్డుకున్నానన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కల్పలతపై ఉన్న అప్పును మాఫీ చేయించడంతో పాటు సభ్యత్వాలను పెంచి, అన్ని వర్గాలతో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు. పెట్రోల్ బంక్ ప్రారంభించి, వచ్చిన ఆదాయాన్ని వినియోగదారులకు చేరేలా లాటరీల ద్వారా బహుమతులు కూడా అందించామని తెలిపారు. అయితే ప్రస్తుతం కల్పలత సూపర్ బజార్‌లో అవినీతి జరిగిందని, దానికి తానే కారణమంటూ కొందరు బురదజల్లుతున్నారని ఆరోపించారు.

*ఉద్యమకారులకు అండగా.. గుప్తదానమే ఇష్టం
తన తల్లి ఎప్పుడూ చేసిన దానం గుప్తంగా ఉండాలని చెప్పేవారని, ఆ మాటను ఇప్పటికీ పాటిస్తున్నానని వినయ్ భాస్కర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తనతో కలిసి పోరాడి మరణించిన వారి కుటుంబాలకు, కేసులతో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి, గాయపడిన వారికి ఆర్థికంగా సహాయం చేశానన్నారు.
కనీసం రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు సాయం చేసిన సందర్భాలు ఉన్నాయని, రైల్వే కేసులతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యమకారులకు రూ.5 లక్షల చొప్పున సహాయం చేశానని తెలిపారు. తాను చేసిన సాయాన్ని ఇప్పటివరకు ఎవరికీ చెప్పుకోలేదన్నారు. “కుడిచేతితో చేసిన సాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు” అనేది తన తల్లి చెప్పిన మాట అని గుర్తుచేశారు.

ఐదు సూత్రాలే తన రాజకీయ జీవితం

తన రాజకీయ, సామాజిక జీవితంలో ఐదు అంశాలను కచ్చితంగా పాటిస్తానని వినయ్ భాస్కర్ తెలిపారు. కార్యకర్తలు, ప్రజలకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు అర్ధరాత్రి అయినా స్పందించడం, ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేయడం, పేద విద్యార్థుల స్కూల్ ఫీజులకు భరోసా ఇవ్వడం, చనిపోయిన వారి కుటుంబాలకు లేదా శుభకార్యాల్లో తన వంతు సహాయం చేయడం, సంఘాలను ఏర్పాటు చేసి వాటి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తన నైజమన్నారు. పేద, బలహీన వర్గాలే తన బలమని, అందుకే ఎంతోమంది తనను అభిమానంతో “దాస్యం అన్నా” అని పిలుస్తారని చెప్పారు.

*రాజకీయంగానే ఎదుర్కొంటా….

నేను ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలు చెయ్యలేదు. తన రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటానని, వారి వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల్లోకి వెళ్లడం తనకు ఇష్టం ఉండదని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలు చేయలేదన్నారు. కరోనా సమయంలో తాను అధికార పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయ భేదాలు చూడకుండా కాంగ్రెస్ నాయకులకు కూడా మందులు, ఇంజెక్షన్లు అందించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. తనపై కబ్జాల ఆరోపణలు చేయడంతో పాటు స్విస్ బ్యాంకులో రూ.2 వేల కోట్లు దాచుకున్నానంటూ ప్రచారం చేశారని, అవి నిరూపించాలని సవాల్ చేశారు. పార్టీలో తనపై బురదజల్లేందుకు పలువురు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.

కేటీఆర్‌తో అనుబంధం
కేటీఆర్‌తో ఉన్న అనుబంధం, ఆయనకు తనపై ఉన్న నమ్మకం తమ బంధాన్ని మరింత బలపరిచిందని వినయ్ భాస్కర్ తెలిపారు. తనను విమర్శించే వారు గతంలో తన స్థాయి, తన పోరాటాన్ని గుర్తుంచుకుని మాట్లాడాలని అన్నారు. విమర్శలకు తగిన సమయంలో గట్టిగా సమాధానం చెబుతానని పేర్కొన్నారు.

కుటుంబమే ఇప్పటికీ బలం
తమ కుటుంబం ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగానే కొనసాగుతోందని వినయ్ భాస్కర్ తెలిపారు. తన శ్రీమతి అన్ని విధాలుగా తనకు అండగా ఉంటారని చెప్పారు. కొన్ని సందర్భాల్లో ఆధ్యాత్మికంగా వెళ్లాలని అనిపించినా, ప్రస్తుతం కూడా మెడిటేషన్ చేస్తుంటానని, మనసు, శరీరాన్ని అదుపులో ఉంచుకోవడం అలవాటైందన్నారు.

2029లో మళ్లీ ఎమ్మెల్యేనే..

తాను సీరియస్ పొలిటికల్ లీడర్‌నని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. తన ఓటమికి గల కారణాలను ఇప్పటికే గుర్తించానని, వాటిని సరిదిద్దుకునే పనిలో ఉన్నానన్నారు. 2029లో విజయం సాధించిన తర్వాత తన “రిటర్న్ గిఫ్ట్” ఉంటుందని, అది చిల్లర రాజకీయాలతో కాకుండా తన పని తీరుతోనే వారికి సమాధానం ఉంటుందని పేర్కొన్నారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.