*రాజకీయాలు పూలపాన్పు కాదు
*వ్యాపారం రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చింది
*పరకాల ప్రతీ గడప సమస్యలు తెలుసు
*ప్రజలు, కార్యకర్తలే నా బలం
*టెక్స్ట్ టైల్ పార్కు తేవడం ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఆనందం ఇచ్చింది.
*కార్యకర్తల కోసం మళ్లీ ఎమ్మెల్యే అవుతా
అక్షరశక్తి,ప్రధాన ప్రతినిధి: రాజకీయాల్లో పూల పాన్పు, ముళ్ళ బాట రెండూ ఉంటాయి. వ్యాపార రంగంలో క్లాస్ వన్ గా నిలిచినా, అనేక అవమానాలు, ఆటుపోట్లు ఎదుర్కొని రాజకీయాల్లో రాణించానని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. వ్యాపారంతో నాయకుల పరిచయాలు సంపాదించి, పరకాలలో ప్రతీ గడపలో అడుగుపెట్టి, ప్రజా ప్రతినిధిగా ప్రజాభిమానం సంపాదించి…చెరిగిపోని చల్లా మార్క్ సొంతం చేసుకున్నారు. తన వ్యాపార, రాజకీయ రంగాల ప్రస్థానాన్ని, తొలి అడుగుల నేపథ్యాన్ని చల్లా ధర్మారెడ్డి డిజిటల్ మీడియా వేదికగా జరిగిన చిట్ చాట్ లో తన అంతరంగ ఆలోచనలను పంచుకున్నారు.
*ప్రగతిసింగారం నుంచి ప్రస్థానం…
శాయంపేట మండలం ప్రగతి సింగారం గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన సమ్మక్క–మల్లారెడ్డి దంపతులకు ముగ్గురు కుమారులు కాగా, తాను పెద్దవాడినని ధర్మారెడ్డి చెప్పారు. రెండో తమ్ముడు మరణించాడని, 1986లో మేనమామ కుమార్తె జ్యోతితో వివాహం జరిగిందన్నారు. తండ్రి తనను వ్యవసాయంలోనే కొనసాగించాలని భావించినా.. తనకు మాత్రం కొత్తగా ఏదైనా చేయాలనే ఆసక్తి ఉండేదన్నారు. డిగ్రీ చదువుకుంటున్న సమయంలోనే స్నేహితుడి సహకారంతో ఫినలెక్స్ కంపెనీలో ‘మార్కెటింగ్ మేనేజర్ గా పనిచేశానని తెలిపారు. అప్పట్లో వ్యవసాయ బావులు, పొలాలకు పైప్లైన్లు వేసే కార్యక్రమాలు విస్తృతంగా సాగుతుండటంతో ఆ రంగంపై మంచి అవగాహన ఏర్పడిందన్నారు.
నంది పైప్స్‌తో వ్యాపారంలోకి
1993లో సొంతంగా నంది పైప్స్, లూబీ ఎలక్ట్రికల్స్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నా. 1994లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్వజలధార, గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించే పథకాలను ప్రవేశపెట్టడంతో పైపులు, మోటార్లకు భారీ డిమాండ్ ఏర్పడిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 80 శాతం ఆర్డర్లు తానే తీసుకున్నానని తెలిపారు. పైపులు, మోటార్ల సరఫరా చేస్తూ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడ్డాయని చెప్పారు. అప్పటి నుంచే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో సాన్నిహిత్యం ఉందన్నారు. తన అమ్మకాల ప్రతిభను గుర్తించిన నంది పైప్స్ సంస్థ 1997లో మారుతి కారును బహుమతిగా ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు.
*కాంట్రాక్టర్ గా కొత్త ప్రయాణం….
1999లో ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్లే మెటీరియల్ కొనుగోలు చేయాలనే విధానం రావడంతో తన వ్యాపారంపై ప్రభావం పడిందన్నారు. సరఫరా చేసిన మెటీరియల్‌కు బిల్లులు సకాలంలో రాకపోవడం, కొందరు డబ్బులు ఎగ్గొట్టడంతో నష్టాలు ఎదురయ్యాయని చెప్పారు. అయితే నేను ఇతరులకు సరఫరా చేస్తే బిల్లుల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని, స్వయంగా కాంట్రాక్టర్‌గా మారితేనే పరిస్థితి మారుతుందని నిర్ణయించుకున్నానన్నారు. 1999లో కాంట్రాక్టర్‌గా అడుగుపెట్టి.. 2002 నాటికి స్పెషల్ గ్రేడ్ కాంట్రాక్టర్‌గా ఎదిగానని చెప్పారు. చల్లా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించి 2003 నుంచి పెద్ద ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు.
*కూతురు స్కూల్ అడ్మిషన్.. గ్రీన్వుడ్ ఆవిర్భావం
తన కుమార్తెను స్కూల్లో చేర్పించేందుకు వెళ్లిన సందర్భమే విద్యారంగంలోకి తీసుకొచ్చిందన్నారు. స్కూల్ లో సౌకర్యాలు లేకపోవడం, అప్పటి ప్రిన్సిపాల్ కొత్త పాఠశాల ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, ఒక భాగస్వామి ఉంటే బాగుంటుందని చెప్పడంతో 2003లో గ్రీన్వుడ్ స్కూల్ ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రారంభం నుంచే పాఠశాలకు మంచి ఆదరణ లభించిందని, ఇప్పటి వరకు 23 బ్యాచ్‌లు పదో తరగతి పూర్తి చేసుకున్నాయని చెప్పారు.
*అవమానం పెంచిన కసి.. రాజకీయాల్లోకి ఎంట్రీ
2008లో శాయంపేట, ప్రగతిసింగారం మధ్య చలివాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ఆ పనులకు సంబంధించిన బిల్లుల విషయంలో అప్పటి ప్రజాప్రతినిధి తనను ఇబ్బంది పెట్టారని, ఒకసారి వారి ఇంటికి వెళ్లినప్పుడు ఎదురైన అవమానం తన జీవితాన్ని రాజకీయాల వైపు మళ్లించిందన్నారు. “నన్ను అవమానించిన కుటుంబంపైనే ఎన్నికల్లో పోటీ చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా” అని తెలిపారు. 2009లో పరకాల నుంచి పోటీ చేయాలనే నిర్ణయాన్ని ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేం నరేందర్‌రెడ్డితో పాటు చంద్రబాబునాయుడికి వివరించినట్లు చెప్పారు. ఆ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ నాయకుడు తనను చులకనగా మాట్లాడినా.. పరకాల నుంచే పోటీ చేయాలనే నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదన్నారు.
ఎమ్మెల్సీ అవకాశం వచ్చినా వద్దన్నా..
2009లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం వచ్చినప్పటికీ.. తన లక్ష్యం ప్రత్యక్ష ఎన్నికలేనని చెప్పి తిరస్కరించినట్లు తెలిపారు. అదే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ–టీఆర్ఎస్ పొత్తులో భాగంగా పరకాల సీటు టీఆర్ఎస్కు వెళ్లిందన్నారు. టీఆర్ఎస్ తరఫున పోటీ చేయాలని కోరినా అంగీకరించలేదని చెప్పారు.
*బీ ఫాం కోసం సినిమా తరహా డ్రామా….
2009 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే రోజు జరిగిన పరిణామాలు ఇప్పటికీ మర్చిపోలేనివని చెప్పారు. చివరి నిమిషంలో పార్టీ నుంచి బీఫాం వస్తుందని సమాచారం రావడంతో డ్రైవర్‌ను పార్టీ కార్యాలయానికి పంపానన్నారు. బీఫాంలతో కారు బయలుదేరిన సమయంలో ఫాతిమా బ్రిడ్జి వద్ద కొందరు పార్టీ నాయకులు కారును అడ్డుకుని బీఫాంలను తీసుకున్నారని తెలిపారు. తనకు రావాల్సిన బీఫాం మరొకరికి వెళ్లిందని, మళ్లీ ఫాంలను సరిచేసుకుని వచ్చేలోపే నామినేషన్ కేంద్రం గేట్లు మూసివేశారని చెప్పారు. పోలీసులు తనను బలవంతంగా గేటు బయటికి తీసుకెళ్లగానే మా డ్రైవర్ గోడ దూకి లోపలికి వచ్చారని, నిమిషాల తేడాతో నామినేషన్ దాఖలు చేసే అవకాశం కోల్పోయానన్నారు. ఆ ఘటన మొత్తం సినిమా క్లైమాక్స్‌ను తలపించిందని వ్యాఖ్యానించారు.
*2012లో తొలి ఎన్నికల పోరు…
2012 ఉప ఎన్నికల్లో పరకాల నుంచి టికెట్ దక్కిందని, పోటీ చేసి 33 వేల ఓట్లు సాధించినట్లు తెలిపారు. పార్టీకి చెందిన కొందరే తనకు ప్రతికూల పరిస్థితులు కల్పించడంతో ఓడిపోయానని అన్నారు. ఈ విషయం చంద్రబాబునాయుడికి తెలియడంతో సంబంధిత నాయకులను మందలించారని చెప్పారు. ఆ సమయంలోనే పరకాల నియోజకవర్గంతో పాటు శాయంపేటలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు మొత్తం 263 కంప్యూటర్లను అందజేసినట్లు తెలిపారు.
*యువగర్జనకు పరకాలకు స్పెషల్ ట్రైన్
నందమూరి బాలకృష్ణ రాజకీయ ప్రవేశ సమయంలో గుంటూరులో నిర్వహించిన యువగర్జన సభకు పరకాల నియోజకవర్గం నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసిందన్నారు. జిల్లా నాయకుడిని తనకు ఒక బోగీ ఇవ్వాలని కోరగా.. ఇంకా తనకు పదవి లేదని, ఇవ్వలేమని చెప్పారని తెలిపారు. దీంతో సభ ఇన్ చార్జ్ ఎర్రం నాయుడు వద్దకు వెళ్లి ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడానికి ఎంత ఖర్చవుతుందని తెలుసుకుని.. ఆ మొత్తాన్ని చెల్లించి వరంగల్ నుంచి పరకాల నియోజకవర్గ కార్యకర్తల కోసం ప్రత్యేక రైలు వేయించుకున్నట్లు చెప్పారు. రైలు నిండా కార్యకర్తలను తీసుకెళ్లడమే కాకుండా వారికి భోజనం, తాగునీటి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం అప్పట్లో రాజకీయంగా పెద్ద హల్చల్ సృష్టించిందన్నారు.
*ఇంటింటికీ మీ చల్లాతో ప్రజా సమస్యలు తెలిసాయి
2013 నవంబర్ 22న ‘ఇంటింటికీ మీ చల్లా’ కార్యక్రమాన్ని ప్రారంభించి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టివచ్చానని తెలిపారు. ఒక్కో గ్రామంలో మూడు రోజుల పాటు ఉండి, ఉదయం–సాయంత్రం ప్రజలతో మమేకమయ్యానన్నారు. ఈ పర్యటన దాదాపు ఏడాది పాటు సాగిందని చెప్పారు. ప్రతీ ఇంటి పరిస్థితి, గ్రామాల్లోని మౌలిక సమస్యలు, రోడ్లు, కరెంటు, తాగునీరు, పేదరికం వంటి అంశాలను స్వయంగా తెలుసుకున్నానన్నారు. ఒక గ్రామంలో ఆకలితో పస్తులు పడుకున్న డిగ్రీ విద్యార్థినిని చూసిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఈ పాదయాత్ర ద్వారా గ్రామాల అవసరాలపై స్పష్టమైన అవగాహన వచ్చిందని, తర్వాత చేపట్టిన అభివృద్ధి పనులకు అదే ప్రణాళికగా మారిందన్నారు.
రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఎన్నో దాడులు ఎదుర్కొన్నాను. 2011–12 మధ్య నందిరాం నాయక్ తండాలో ప్రభ బండ్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన సమయంలో ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారని తెలిపారు. కొబ్బరికాయ కొట్టేందుకు వంగిన సమయంలోనే దాడి జరగడంతో తాను, కార్యకర్తలు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశామని చెప్పారు. కొందరితో కలిసి మొక్కజొన్న చేనులో దాక్కున్నట్లు తెలిపారు. ఘటనపై సమాచారం అందడంతో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారని, అప్పట్లో ఈ ఘటన నియోజకవర్గంలో సంచలనం సృష్టించిందన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి వచ్చి తనకు అండగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. 2009లో కూడా తన వెంట వచ్చిన ఆరు కార్లను ధ్వంసం చేశారని తెలిపారు. రాజకీయాల్లో మంచి, చెడు రెండూ ఉంటాయని ముందే నిర్ణయించుకుని వచ్చానన్నారు.
*తెలంగాణ కోసం పోరాటం….
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పరకాల నియోజకవర్గంలో ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నడిపానని చెప్పారు. టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడానన్నారు. నిరాహార దీక్షలకు టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేయడమే కాకుండా 41 రోజుల పాటు ఉద్యమ కార్యక్రమాలను కొనసాగించినట్లు తెలిపారు.
2014లో గెలుపు.. టీఆర్ఎస్లోకి చేరిక
2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పరకాల అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించానన్నారు. తనపై ఉన్న అభిమానంతో కార్యకర్తలు కష్టపడి గెలిపించారని తెలిపారు. ఆ తర్వాత వారి అభీష్టం మేరకు టీఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు.
*పదేళ్లలో రూ.2,500 కోట్ల అభివృద్ధి..
ఎమ్మెల్యేగా పదేళ్ల కాలంలో పరకాల నియోజకవర్గానికి సుమారు రూ.2,500 కోట్ల అభివృద్ధి పనులు తీసుకొచ్చినట్లు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. ‘ఇంటింటికీ మీ చల్లా’ పర్యటనలో గుర్తించిన సమస్యల్లో దాదాపు 90 శాతం పరిష్కరించానన్నారు. ప్రతీ ఎమ్మెల్యేకు రూ.5 కోట్ల నిధులు వచ్చే రోజుల్లోనూ ప్రత్యేకంగా పట్టుబట్టి రూ.35 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి పనులు చేపట్టినట్లు చెప్పారు.
తన హయాంలో చేపట్టిన ప్రధాన పనులు ఇవే..
* 2016లో పరకాల రెవెన్యూ డివిజన్ పునరుద్ధరణ
* కొనాయిమాకుల ప్రాజెక్టు పనులు
* కొత్త మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు
* పరకాల ప్రజల చిరకాల కోరిక అయిన 100 పడకల ఆస్పత్రి
* డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు
* బాలురు, బాలికలతో పాటు ఆరు రెసిడెన్షియల్ విద్యాసంస్థలు
* 46 గ్రామాల్లో మహిళా భవనాలు
* 57 గ్రామ పంచాయతీలకు సొంత భవనాలు
* పరకాల పట్టణ సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్
* దామెర చెరువులో బోటింగ్
* పాత మార్కెట్ అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం
* కంఠాత్మకూరు బ్రిడ్జికి నిధులు
* పల్లె దవాఖానలు, విద్యుత్ సబ్స్టేషన్లు
*టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు ఆనందాన్నిచ్చింది..
వరంగల్‌కు ఒకప్పుడు అజంజాహి మిల్ ఎంతటి గుర్తింపు తెచ్చిందో, ఆ స్థాయి ఉపాధి అవకాశాలు కల్పించేలా తన నియోజకవర్గానికి టెక్స్టైల్ పార్క్ తీసుకురావడం తనకు అత్యంత ఆనందాన్ని ఇచ్చిన విషయమని చల్లా ధర్మారెడ్డి చెప్పారు. “అజంజాహి మిల్ తర్వాత వరంగల్ ప్రాంతానికి అదే స్థాయిలో ఉపాధి కల్పించే పరిశ్రమ రావాలనేది నా ఆలోచన. దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ పరకాల నియోజకవర్గానికి రావడం సంతోషంగా ఉంది” అని అన్నారు.
పుట్టిన ఊరికి ప్రత్యేక అభివృద్ధి
తాను పుట్టిన ప్రగతిసింగారం గ్రామాన్ని అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టానన్నారు. గ్రామ పంచాయతీని మోడల్‌గా తీర్చిదిద్దడంతో పాటు సొంత స్థలంలో రామాలయం నిర్మించినట్లు చెప్పారు. ప్రభుత్వ స్థలంతో పాటు ఎకరం భూమిని కొనుగోలు చేసి కమ్యూనిటీ హాల్, గ్రామ ప్రజల కోసం ఫంక్షన్ హాల్ నిర్మించినట్లు తెలిపారు. స్కూల్, లైబ్రరీ, ఆస్పత్రి ఏర్పాటు చేశానన్నారు.
*భూ కబ్జాల ఆరోపణలు రాజకీయమే..
తనపై వస్తున్న భూ కబ్జా ఆరోపణలను చల్లా ధర్మారెడ్డి ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. “ఏ ఒక్క రైతు భూమిని నేను అక్రమంగా తీసుకోలేదు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల జోలికే వెళ్లలేదు. నేను కొనుగోలు చేసినవన్నీ పట్టా భూములే.. అవి కూడా న్యాయబద్ధంగానే కొనుగోలు చేశా” అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ముళ్లకంప, పూలపాన్పు రెండూ ఉంటాయని, కష్టాలు సహజమని అన్నారు. తాను ఎప్పుడూ వ్యక్తిగత దూషణలకు వెళ్లలేదని, రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కొంటానన్నారు.
*కేసీఆర్ తో ప్రత్యేక అనుబంధం…
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని చల్లా ధర్మారెడ్డి చెప్పారు. మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తి కేసీఆర్ అని, ఆయన మంచి విజన్ ఉన్న నాయకుడని చెప్పారు. తనపై కేసీఆర్‌కు ప్రత్యేక అభిమానం ఉండేదని, ఆ అనుబంధంతోనే పరకాల నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకురాగలిగానని చెప్పారు. తాను ఎవరిపైనా చాడీలు చెప్పనని, వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉంటానని అన్నారు. అందుకే కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌రావు తనను అభిమానిస్తారని పేర్కొన్నారు.
*వచ్చే ఎన్నికల్లో సత్తా చూపిస్తా…
వాస్తవానికి గత ఎన్నికల్లో గెలిస్తే రాజకీయాలకు విరామం ఇవ్వాలని భావించానని చల్లా ధర్మారెడ్డి తెలిపారు. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో కనిపిస్తున్న కక్షపూరిత వాతావరణం, తనను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితిని చూసి మరోసారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను గుర్తించానని, వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగుతానన్నారు. నియోజకవర్గంలోని 109 గ్రామ పంచాయతీల్లో తనకు బలమైన పట్టు ఉందని, పునర్వ్యవస్థీకరణ జరిగినా, నియోజకవర్గాల సరిహద్దులు మారినా, ఎక్కడి నుంచి పోటీ చేయాలో నిర్ణయించుకుని వచ్చే ఎన్నికల్లో తప్పకుండా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. “ఈసారి నా కోసం కాదు.. నన్ను నమ్ముకున్న కార్యకర్తల కోసం గెలవాలి. ప్రజలు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అని చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

