* విద్యార్థి దశ నుంచి రాజకీయాలు
* న్యాయం కోసం కొట్లాటకు పోతే రౌడీ అన్నారు
* ఉద్యమాల ఓనమాలతో చదువు ఆగింది
* ఇంటర్ నుండి ఇంట్లో డబ్బులే అడగలేదు
* పావలా ఇడ్లీ తిన్న…వెయ్యి రూపాయల ఇడ్లీ తిన్న
* కాంగ్రెస్ పార్టీకి డ్రగ్ అడిక్ట్ లాగా అయ్యాను
* వేరే కండువా ఊహించను
* నా ఫ్యామిలీ కాంగ్రెస్ ఫ్యామిలీ
* ఇప్పుడు హ్యాపీ… ఇంకా ఏది వచ్చినా అది బోనస్
అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి: చదువులో ఎప్పుడూ వెనకే…కానీ స్నేహితుల కోసం అందరికంటే ముందు ఉండేవాడు. అన్యాయం జరిగితే చూస్తూ ఉండేవాడు మంచి వాడు ఐతే, కోట్లాడే వాడు రౌడీ అన్నా.. పద్దతి మార్చుకోలేదు. స్కూలింగ్, ఇంటర్ లోనే నాయకత్వ లక్షణాలు.. ఆపై ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే స్టూడెంట్ లీడర్ అయ్యాడు… ఇప్పుడు ఎమ్మెల్యే గా ఎదిగాడు నాయిని రాజేందర్ రెడ్డి. ఎన్నో పోరాటాల మలుపులు.. రాజకీయ మజిలీలు ఆయన చరిత్రలో ఉన్నాయి. లై పెట్టి, పోస్టర్ అతికించి, పదకొండు ఏళ్ళు ప్రతిపక్షంలో సవాళ్లను అధిగమిస్తూ ఎదిగాడు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా పశ్చిమ నియోజక వర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతున్నాడు. నా మెడలో వేరే కండువా ఊహించను అని చెప్తూ…కాంగ్రెస్ పార్టీకి డ్రగ్ అడిక్ట్ అయ్యానని అంటున్నాడు. శనివారం నాడు డిజిటల్ మీడియా ప్రతినిధులతో నాయిని తన అంతరంగాన్ని పంచుకున్నాడు.
మాటేడు నుంచి హన్మకొండకు..
మా అమ్మన్నాన్న జయమాల-నరేందర్‌రెడ్డి తొర్రూరు మండలం మాటేడులో ఉండేవారని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. అక్కడ తమ కుటుంబానికి ఇప్పటికీ భూములు ఉన్నాయని చెప్పారు. తన తండ్రికి పెళ్లైన తర్వాత హన్మకొండకు వచ్చారని, తాను మిషన్ ఆస్పత్రిలో పుట్టానన్నారు. మా అమ్మనాన్నకు ఇద్దరు సంతానం. నేను పెద్దోడిని, తమ్ముడు ఉన్నాడు. ‘మాది రాజకీయ కుటుంబం కాదు. ఇంతకుముందు మా కుటుంబంలో ఎవరూ పాలిటిక్స్‌లో లేరు.
స్కూల్‌లోనే పోరాటానికి బీజం..
సెయింట్ జాన్స్ స్కూల్‌లో తన విద్యాభ్యాసం ప్రారంభమైందని చెప్పారు. ఆ తర్వాత గౌతమ్ ప్రాక్టిసింగ్ స్కూల్‌లో ఇంగ్లిష్ మీడియంలో చదివించేందుకు తన తండ్రి చేర్పించారని తెలిపారు. ఏడు లేదంటే ఎనిమిదో తరగతిలో ఉన్న సమయంలో జరిగిన ఓ సంఘటన తనకు స్కూల్లో మంచి గుర్తింపు తెచ్చిందన్నారు. ఆగస్టు 15న పాఠశాలలో జెండా వందనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, అదే సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి త్రివర్ణ పతాకం వద్దని, బ్లాక్ జెండా పెడతామన్నారు. దీనికి ప్రిన్సిపాల్ అంగీకరించకపోవడంతో చిన్నపాటి పెనుగులాట జరిగిందన్నారు. ఈ క్రమంలో ప్రిన్సిపాల్ కిందపడగా తాను వెంటనే స్పందించి వారితో ఫైటింగ్‌కు వెళ్లానని చెప్పారు. ఆ ఘటన తర్వాత స్కూల్లో తన క్రేజ్ పెరిగిపోయిందని, తనకు మంచి ఇమేజ్ వచ్చిందని గుర్తుచేసుకున్నారు. ‘సార్లు నన్ను ప్రత్యేకంగా చూస్తుంటే నాకు భలే అనిపించేది’ అని నాయిని నవ్వుతూ చెప్పారు. అయితే చదువుపై మాత్రం చిన్నప్పటి నుంచే ఆసక్తి లేదన్నారు. స్కూల్ బంద్ కొట్టి సినిమాలకు వెళ్లేవాడినని చెప్పారు. తమకు సత్యనారాయణ అనే మంచి టీచర్ ఉండేవారని, తాము థియేటర్‌కు వెళ్లిన విషయం తెలుసుకొని అక్కడికే వచ్చి క్లాస్‌రూమ్‌కు తీసుకొచ్చేవారని గుర్తుచేశారు.
చదువు అబ్బలేదు..
నాకు చిన్నప్పటి నుంచి చదువు అబ్బలేదని నాయిని చెప్పారు. బలవంతంగా చదివినప్పటికీ కష్టంగా పాస్ అయ్యేవాడినన్నారు. ఒకసారి పరీక్షలో సున్నా మార్కులు రావడంతో తన తండ్రి తన తల్లి ముందు తిడుతూ.. ‘వీడు చదవడు.. బర్లు కాయడానికి పంపిస్తా’ అని అన్నారని గుర్తుచేశారు. తండ్రి నిజంగానే బర్లు కాయడానికి పంపిస్తారని భావించి తాను అందుకు సిద్ధమయ్యానని, అది చూసిన తండ్రి మళ్లీ తనను తిట్టారని చెప్పారు. డిగ్రీలో లెక్చరర్లు ఎంత కష్టపడ్డా తాను పాస్ కాలేదని, నేను.. వాళ్లు ఎంత ప్రయత్నించినా పాస్ కాకపోయానని నవ్వుతూ చెప్పారు. నాకు పుస్తకం అంటేనే పడకపోయేది’ అంటూ నాయిని రాజేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ఇంటర్‌లోనే రాజకీయ రగడ..
హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదవిన. తమ స్నేహితులు సీకేఎం కాలేజీలో ఎన్‌ఎస్‌యూఐ తరఫున బ్యానర్లు కట్టేందుకు వెళ్లగా వారిపై ఏబీవీపీ కార్యకర్తలు దాడి చేశారని చెప్పారు. వారిని బురదలో పడేసి తొక్కారని తెలిపారు. దీంతో మరుసటి రోజు తాను 18 మందితో కాలేజీకి వెళ్లానని, అక్కడ ఏబీవీపీకి చెందిన వారు 100 మందికి పైగా ఉన్నారని చెప్పారు. వెనక్కి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఘర్షణ జరిగిందన్నారు. ఆ ఘటన అప్పట్లో పత్రికల్లో సంచలనం సృష్టించిందని, తమపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. అప్పట్లో బస్వరాజు సారయ్య పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడి తమను కొట్టకుండా కాపాడారని గుర్తుచేశారు.
కిన్నెర హోటల్ మా అడ్డా..
పబ్లిక్ గార్డెన్ సమీపంలోని కిన్నెర హోటల్ వద్ద ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ కార్యకర్తల అడ్డాలు ఉండేవని నాయిని తెలిపారు. కోహినూర్ హోటల్ వద్ద టీడీపీ కార్యకర్తలు ఉండేవారని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా అప్పట్లో హన్మకొండలో ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీ కార్యాలయాలు పక్కపక్కనే ఉండేవని గుర్తుచేశారు. తాము కార్యాలయాల్లో బియ్యం బస్తాలు తెచ్చి పెట్టుకునేవాళ్లమని చెప్పారు. అప్పట్లో రామకృష్ణ పరమహంస అనే డీఎస్పీ రాత్రి సమయంలో కార్యాలయం వద్దకు నలుగురు పోలీసులను సెక్యూరిటీగా పంపేవారని తెలిపారు. ‘అప్పుడు యుద్ధ వాతావరణం లెక్క ఉండేది’ అని అన్నారు. 12వ డివిజన్ కార్పొరేటర్ పదవికి కాంగ్రెస్ నుంచి ఎర్ర ప్రకాశ్‌రెడ్డి, మరో పార్టీ నుంచి రావు అమరేందర్‌రెడ్డి పోటీ చేశారని చెప్పారు. ఆ ఎన్నికల ప్రచారంలోనూ ఫైటింగ్ జరిగిందని, అదే సమయంలో తనపై తొలిసారి రాజకీయ కేసు నమోదైందని తెలిపారు. ఆ కేసును కూడా బస్వరాజు సారయ్యే డీల్ చేశారని చెప్పారు.
డిగ్రీలోనే ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు..
1988లో ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీలో చేరానని నాయిని తెలిపారు. అందులో సీటు రావడం కూడా పెద్ద మిస్టరీ అని నవ్వుతూ చెప్పాడు. కాలేజీలో చేరిన మూడు నెలలకే తనపై దాడి జరిగిందన్నారు. అప్పట్లో వడ్డెపల్లి ప్రాంతానికి చెందిన వారంటే భయం ఉండేదని, తాను మాత్రం మామూలుగానే ఒక టీం మెయింటెయిన్ చేసేవాడినని చెప్పారు. అది కొందరికి నచ్చలేదన్నారు. తనపై దాడి చేస్తే రివెంజ్ తీర్చుకుంటానన్న విషయం వారికి కూడా తెలుసని చెప్పారు. రెండు మూడు రోజులు ఓపిక పట్టిన తర్వాత గ్రౌండ్‌లో దొరికిన వారిని దొరికినట్టుగా హాకీ స్టిక్స్‌తో కొట్టానని తెలిపారు. ఆ ఘటన తర్వాత డిగ్రీ ఫస్టియర్‌లోనే తనకు ఎన్‌ఎస్‌యూఐ కాలేజీ అధ్యక్ష పదవి ఇచ్చారని చెప్పారు. ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా విద్యార్థుల సమస్యలపై నిలదీసేవాడినని, దీంతో కాలేజీ నుంచి తనను బయటకు పంపేందుకు శతవిధాలా ప్రయత్నాలు జరిగాయని తెలిపారు.
యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడే రాజకీయ మలుపు..
తన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవేనని నాయిని రాజేందర్ రెడ్డి చెప్పారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పీవీ రంగారావు తనను ప్రోత్సహించారని తెలిపారు. దేవేందర్‌రెడ్డితో పోటీ ఉన్నప్పటికీ ఆయన వర్గాన్ని కాదని తనకు అవకాశం ఇచ్చారని చెప్పారు. విజయవాడలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమరభేరి సభ ఏర్పాటు చేసినప్పుడు తాను 102 వాహనాలను ఏర్పాటు చేశానన్నారు. అందులో 100 సుమోలు, రెండు బస్సులు ఉన్నాయని తెలిపారు. వాటికి తన ఫొటోతో ఫ్లెక్సీలు పెట్టించామని చెప్పారు. ఇక తన స్నేహితుడు గోల్డ్‌స్మిత్ విజయవాడలో ఉండేవాడని, అతనికి ఫోన్ చేసి భోజనాలు, వాటర్ ప్యాకెట్లు ఏర్పాటు చేయాలని, నాలుగు బ్యానర్లు కూడా చేయించి కట్టాలని చెప్పానన్నారు. అయితే తాను చెప్పినదానికంటే రెట్టింపు ఏర్పాట్లు చేశాడని తెలిపారు. జంబో పూలదండ, కటౌట్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. తన వెంట రమేశ్‌బాబు, వినోద్‌కుమార్, అజీజ్‌ఖాన్ వచ్చారని తెలిపారు. అయితే నా దోస్తు ఎంత బిల్లు పంపిస్తాడో అని భయపడ్డానని, కానీ ఏమీ పంపలేదన్నారు.
‘పని చేసే అధ్యక్షుడు’..
ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాకు తనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, పుల్లా భాస్కర్‌ను అధ్యక్షుడిగా ప్రకటించారని నాయిని చెప్పారు. అప్పటి జిల్లా ఇన్‌చార్జి తనను ‘పని చేసే అధ్యక్షుడు’ అని సరదాగా పిలిచేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. హయగ్రీవాచారి, తరాల దేవేందర్‌రెడ్డి తన రాజకీయ గురువులని, వారి నీడలోనే తాను రాజకీయంగా ఎదిగానని చెప్పారు. సిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లు పనిచేశానన్నారు. 2005లో లైబ్రరీ చైర్మన్‌గా పని చేశానని తెలిపారు. 2014లో పొన్నాల లక్ష్మయ్య పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తాను డీసీసీగా పనిచేశానన్నారు. కాకతీయ ఆటో యూనియన్, మెడికల్ అండ్ హెల్త్ తదితర సుమారు 20 సంఘాలకు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నానని తెలిపారు.
2004 నుంచే టికెట్ వేట..
అసెంబ్లీ టికెట్ కోసం 2004లోనే అడిగానని నాయిని చెప్పారు. అప్పట్లో టీఆర్‌ఎస్-కాంగ్రెస్ పొత్తులో వరంగల్ పశ్చిమ సీటు టీఆర్‌ఎస్‌కు వెళ్లడంతో సత్యనారాయణరెడ్డికి టికెట్ వచ్చిందన్నారు. 2009లో దయాసాగర్‌కు టికెట్ కేటాయించారని, 2014లో పార్టీ ఎర్రబెల్లి స్వర్ణకు అవకాశం ఇచ్చిందని చెప్పారు. 2018లో మహాకూటమి అభ్యర్థిగా రేవూరి ప్రకాశ్‌రెడ్డి బరిలో నిలిచారని తెలిపారు.
2009లో టికెట్ కన్ఫాం.. చివర్లో కోత..
2009లో రాహుల్‌గాంధీ యూత్ కాంగ్రెస్ కోటాలో తనకు టికెట్ ఖరారైందని నాయిని తెలిపారు. బక్క జడ్సన్ నా ఫోన్ నుంచి దరఖాస్తు చేయగా జితేందర్‌సింగ్ నుంచి ‘మీకు టికెట్ కన్ఫాం’ అంటూ మెసేజ్ వచ్చిందన్నారు. ఆ మెసేజ్ అర్థం కాక ఆ నంబర్‌కు ఫోన్ చేస్తే ఢిల్లీలోని నంబర్ అని తెలిసిందన్నారు. వెంటనే ఢిల్లీ వెళ్లి టికెట్ విషయాన్ని కన్ఫాం చేసుకున్నానని చెప్పారు. యూత్ కోటాలో తనతో పాటు ఏడుగురికి టికెట్లు కేటాయించినప్పటికీ ఢిల్లీలో జరిగిన మంతనాల తర్వాత తన టికెట్ తీసేశారని తెలిపారు. ‘ఇదేంటని అడిగితే వైఎస్ నా భుజంపై చేయి వేసి చెప్పకనే చెప్పారు’ అని నాయిని గుర్తుచేశారు.
2023లో టికెట్ కోసం మళ్లీ పోరాటం..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కుట్రలను ఛేదించి టికెట్ తెచ్చుకున్నానని నాయిని తెలిపారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వచ్చిన తర్వాత పీసీసీ అధ్యక్షుడయ్యారని, ఆయనను కలిసి టికెట్ ఇస్తే కష్టపడి పనిచేస్తానని చెప్పానన్నారు. ‘2009 నుంచి టికెట్ చేజారిపోతోంది. నేను కష్టపడి పనిచేసే సమయానికి వేరే వాళ్లు రావడం పరిపాటిగా మారింది. నాకు టికెట్ కన్ఫాం చేస్తే నా పనిలో నేను ఉంటానని చెప్పా’ అని తెలిపారు. సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత చెబుతానని రేవంత్‌రెడ్డి చెప్పారని, సర్వే రిపోర్టు రాగానే ముందుకు వెళ్లాలని సూచించారని చెప్పారు. ఫస్ట్ లిస్ట్‌లో తన పేరు రావాల్సి ఉన్నప్పటికీ కొందరు అడ్డుకున్నారని ఆరోపించారు. అధిష్ఠానం వద్ద తనపై ఏవేవో చెప్పారని, దీంతో రీ-సర్వేలు, స్పాట్ సర్వేలు నిర్వహించిన తర్వాత చివరకు తనకు టికెట్ ఇచ్చారని తెలిపారు.
సొంత పార్టీలోనూ తొక్కే ప్రయత్నం..
రాజకీయ జీవితంలో ప్రత్యర్థుల నుంచే కాకుండా సొంత పార్టీలోనూ తనను తొక్కే ప్రయత్నాలు జరిగాయని నాయిని అన్నారు. ‘వీడు వస్తే మాకు రాజకీయ భవిష్యత్ ఉండదు’ అని అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. సొంత పార్టీలోనే నన్ను తొక్కే ప్రయత్నాలు చేశారు. అయినా నేను వెనక్కి తగ్గలేదు’ అని చెప్పారు.
పార్టీ మారమని ప్రలోభాలు..
తనపై కేసులు పెట్టి వేధించిన సందర్భాల్లో పార్టీ మారితే కేసులన్నీ మాఫీ చేస్తామని చాలా ప్రలోభాలు పెట్టారని నాయిని తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేపీ, సొంత పార్టీ కాంగ్రెస్‌లోనూ కొట్లాటలు ఉన్నాయంటూ పార్టీ మారాలని రాత్రిళ్లు ఇంటికి వచ్చి మరీ కొందరు అడిగేవారని చెప్పారు. తనపై ఇప్పటికీ 54 కేసులు ఉన్నాయని, మర్డర్ కేసులోనూ ఇరికించారని తెలిపారు. కుటుంబంలో విషాదం జరిగిన సమయంలో కూడా కేసుల కారణంగా తప్పించుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ‘ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి.. నేను పార్టీ మారను అని చెప్పా. నా మెడలో కాంగ్రెస్ కండువా తప్ప మరో కండువాను నేను ఊహించుకోలేదు’ అని నాయిని స్పష్టం చేశారు. మర్డర్ కేసులో ఇరికించిన సమయంలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో మాదిరిగా పోలీసులకు చిక్కకుండా తిరిగానని, ఆ ఘటనలను ఎన్నటికీ మరిచిపోలేనన్నారు.
‘వేస్ట్ గాళ్ల వల్లే ఆ పార్టీ బతుకుతోంది’
పార్టీ మారమనే ఒత్తిళ్ల నేపథ్యంలో ఒక పెద్దమనిషి తన గురించి చేసిన వ్యాఖ్యను కూడా నాయిని గుర్తుచేశారు. ‘ఇలాంటి వేస్ట్ గాళ్ల వల్లనే ఆ పార్టీ ఇంకా బతుకుతోంది’ అని ఓ పెద్దమనిషి అన్నారని, అది తిట్టు లాంటి పొగడ్తగా భావించానని నాయిని చెప్పారు.
రాహుల్ నుంచి నేరుగా ఫోన్..
ఒక రోజు కారులో హైదరాబాద్‌కు వెళ్తుండగా రాహుల్‌గాంధీ నుంచి ఫోన్ వచ్చిందని నాయిని తెలిపారు. ఢిల్లీకి రావాలని పిలిచారని చెప్పారు. దేశవ్యాప్తంగా పది జిల్లాలను ఎంపిక చేస్తే తెలంగాణ నుంచి తనను ఒక్కరినే సమావేశానికి పంపించారని తెలిపారు. సమావేశంలో తనకు 45 నిమిషాల సమయం ఇచ్చారని, డీసీసీలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని అప్పుడే సూచించానని చెప్పారు. ప్రస్తుతం రాహుల్‌గాంధీ వాటిని అమలు చేస్తున్నారని తెలిపారు. మరోసారి రాహుల్‌గాంధీ, కొప్పుల రాజు ఆన్‌లైన్‌లో డీసీసీ సమావేశం నిర్వహించారని, అందులో మాట్లాడమన్న వారే మాట్లాడాలని నిబంధన ఉండేదన్నారు. అప్పుడు రాహుల్‌గాంధీ ‘నాయిని రాజేందర్‌రెడ్డి జీ మాట్లాడండి’ అని తనను పిలవడం ఎంతో గర్వంగా అనిపించిందన్నారు.
మానాన్నను డబ్బులు అడగడం మానేశా..
ఇంటర్‌లో ఉన్న సమయంలో చదువు అబ్బడం లేదని, బిజినెస్ చేసుకుంటానని డబ్బులు ఇవ్వాలని తండ్రిని అడిగానని నాయిని తెలిపారు. ఆయన డబ్బులు ఇవ్వనని చెప్పారని, అప్పటి నుంచి తండ్రిని డబ్బులు అడగడమే మానేశానన్నారు.
‘నాకు పిల్లనియ్యలే’..
తాను రఫ్‌గా ఉండేవాడినని నాయిని చెప్పారు. తనపై రెండు కేసులు నమోదవడంతో ‘నరేందర్‌రెడ్డి పెద్ద కొడుకుపై మర్డర్ కేసు అయిందట’ అంటూ ప్రచారం జరిగిందన్నారు. దీంతో చుట్టాలు పక్కాలు కూడా అదే విషయాన్ని మాట్లాడుకునేవారని చెప్పారు. అప్పట్లో పట్టింపులు ఎక్కువగా ఉండేవని, కేసులు ఉన్నాయనే కారణంతో తనకు పిల్లను ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదన్నారు.
అప్పటి రాజకీయాలు వేరు..
ప్రస్తుతం రాజకీయాల్లో విలువలు రోజురోజుకూ తగ్గిపోతున్నాయని నాయిని అన్నారు. అప్పట్లో రాజకీయ ప్రత్యర్థులను కూడా గౌరవించుకునే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయని చెప్పారు. దీనికి ఉదాహరణగా నర్సంపేట ఎమ్మెల్యేగా పనిచేసిన ఓంకార్ ఘటనను ప్రస్తావించారు. ఓంకార్‌పై ఫైర్ కావడంతో ఆయన్ను ఎంజీఎంకు తీసుకొచ్చారని, నర్సంపేట నుంచి ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారని తెలిపారు. అప్పటికే రాజకీయాల్లో హత్యలు కూడా జరిగేవని, హయగ్రీవాచారిని ప్రత్యర్థులు ‘హత్యలాచారి’ అని పిలిచేవారని చెప్పారు. అయినప్పటికీ హయగ్రీవాచారి ఎంజీఎంకు వెళ్లి ఓంకార్‌ను పరామర్శించారని గుర్తుచేశారు. అంతా మా మీద దాడి చేస్తారనుకున్నామని, కానీ అంత మంది ఆయనను చూసి దారి ఇవ్వడం గొప్పగా అనిపించిందని చెప్పారు. ‘అప్పుడు అలాంటి రాజకీయ వాతావరణం ఉండేది. ఇప్పుడు ఎవరో పోటీకి వస్తాడేమోనని ముందే శత్రువుగా చూస్తున్నారు’ అని నాయిని అన్నారు.
పావలా ఇడ్లీ నుంచి వెయ్యి రూపాయల ఇడ్లీ వరకు..
తన రాజకీయ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలన్నీ గొప్పవేనని నాయిని చెప్పారు. పోరాటంలో ఉన్న సమయంలో పావలా ఇడ్లీ తిన్నానని, ఇప్పుడు వెయ్యి రూపాయల ఇడ్లీ తినే స్థాయికి వచ్చానని అన్నారు. కానీ అప్పుడున్న రాజకీయ సంస్కారం ఇప్పుడు లేదు’ అని నాయిని చెప్పారు.
వరంగల్ బ్రాండ్ పెంచడమే లక్ష్యం..
తన నియోజకవర్గ పరిధికే పరిమితం కాకుండా వరంగల్ బ్రాండ్‌ను పెంచే పనులకు ముఖ్యమంత్రి వద్ద నిధులు అడిగానని నాయిని తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, మామునూరు ఎయిర్‌పోర్టు, రింగ్‌రోడ్డు వంటి పనులు చేపట్టాలని కోరానన్నారు. రూ.500 కోట్లతో వాటర్ సప్లై పైప్‌లైన్‌ను మెరుగుపరుస్తున్నామని, రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు ప్రారంభించామని తెలిపారు. ఐటీఐ కాలేజీకి రూ.25 కోట్లు తీసుకొచ్చానన్నారు. కాజీపేట బ్రిడ్జి పనులు తాను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాతే వేగం పుంజుకున్నాయని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కాజీపేట బస్టాండ్ కూడా మంజూరు చేయించానని తెలిపారు.
‘నాకు ఏది వచ్చినా బోనస్సే’
అసెంబ్లీలో కూర్చోవాలనే కోరిక ఉండేదని, అది నెరవేరిందని నాయిని చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని అడిగాను. ‘నాకు పని చేయడం అంటే ఇష్టం. అందుకే నేను పార్టీ పదవి అడిగాను. పెద్దలు ఏ పదవి ఇచ్చినా నాకు బోనస్సే’ అని నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.
బిడ్డకు టికెట్ ఇస్తే.. బరిలోకి
తన బిడ్డ గోదాదేవి మంచి డాక్టర్. ఆమె 2014లో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుందని నాయిని తెలిపారు. ప్రస్తుతం ఎస్‌ఐఆర్ ప్రక్రియలో కీలకంగా పనిచేస్తోందన్నారు. 240 మంది బీఎల్‌ఓలు, 240 బీఎల్‌ఏలను సమన్వయం చేసిందని చెప్పారు. ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి వరంగల్ పశ్చిమలో ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓట్లు కోల్పోకుండా పనిచేస్తోందన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే గోదాదేవి తప్పకుండా పోటీ చేస్తుందని తెలిపారు.
కార్పొరేషన్ రిజర్వేషన్లు మారొచ్చు..
డిసెంబర్ లేదా జనవరిలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఎమ్మెల్యే నాయిని చెప్పారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ రిజర్వేషన్లు మారే అవకాశం ఉందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నేపథ్యంలో మరోసారి రిజర్వేషన్లలో మార్పులు చేసే అవకాశం ఉందని, డివిజన్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
‘డక్కముక్కలు తింటేనే తెలుస్తుంది’
తాను హైస్పీడ్, టఫ్‌గా ఉంటానని నాయిని అన్నారు. ఒకసారి స్నేహితులతో కలిసి ఐదు బైక్‌లపై ఢిల్లీకి వెళ్లాలని ప్లాన్ చేశామని చెప్పారు. ఈ విషయాన్ని తల్లికి చెప్పినా ఆమె అడ్డుచెప్పలేదన్నారు. తర్వాత ఓ సందర్భంలో బైక్‌పై ఢిల్లీ వెళ్తానని చెప్పినా ఎందుకు అడ్డుచెప్పలేదని తల్లిని అడిగానన్నారు. అందుకు ఆమె.. ‘డక్కముక్కలు తింటూ పెరిగితేనే జీవితంలో అన్నీ తెలుస్తాయి’ అని చెప్పిందని నాయిని గుర్తుచేశారు.
ఫైటింగ్‌ల జీవితమే..
రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటి నుంచి నా ప్రయాణంమంతా దాడులు, ప్రతి దాడులు, కేసులు, పోరాటాలతోనే సాగిందని నాయిని రాజేందర్ రెడ్డి చెప్పారు. విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ కోసం ప్రత్యర్థులతో తలపడ్డాను. రాజకీయాల్లోనూ ఘర్షణలు, కేసులు ఎదుర్కొన్నా. సొంత పార్టీలోనే తొక్కే ప్రయత్నాలు జరిగాయి. పార్టీ మారితే కేసులు మాఫీ చేస్తామన్న ప్రలోభాలనూ లెక్కచేయలేదన్నారు. పోరాటమే తన రాజకీయ ప్రస్థానానికి పునాది అని చెప్పేలా ఆయన జీవితం సాగిందని చెప్పారు.

