31.3 C
Hyderabad
Homeతాజా వార్తలువైఎస్సార్‌ నగర్‌లో రౌడీమూకల వీరంగం

వైఎస్సార్‌ నగర్‌లో రౌడీమూకల వీరంగం

📰 Generate e-Paper Clip

– పేదల గుడిసెలే లక్ష్యంగా దాడులు!
– 22 ఏళ్లుగా నివాసముంటున్న గుడిసెవాసులు..
– ఖాళీ చేయాలంటూ రౌడీమూక‌ల‌ బెదిరింపులు
– అత్యంత విలువైన ప్రభుత్వ స్థలంపై ప్రైవేటు వ్యక్తుల కన్ను.. ఆక్రమణకు కుట్ర?
– గుడిసెలు కూల్చివేత.. బాధితుల్లో తీవ్ర భయాందోళనలు
– దాడులు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు..
– అధికార పార్టీ ఎమ్మెల్యే మౌనం!
– కాంగ్రెస్‌ హయాంలోనే గుడిసెలు వేసుకున్నాం..
– అదే ప్రభుత్వంలో ఇప్పుడు వెళ్లగొట్టే యత్నమా?

అక్ష‌ర‌శ‌క్తి, కాజీపేట : ఒకవైపు నిలువ నీడ కోసం నిరుపేదల ఆరాటం.. మరోవైపు విలువైన భూమిపై కన్నేసిన శక్తుల కబ్జా ప్రయత్నాలంటూ ఆరోపణలు.. ఇంకోవైపు గుడిసెల్లో నివసిస్తున్న పేదలపై రౌడీమూకల దాడులు, బెదిరింపులు! గ్రేటర్‌ వరంగల్‌ 62వ డివిజన్‌ పరిధిలోని కాజీపేట చౌరస్తాకు సమీపంలో ఉన్న వైఎస్సార్‌ నగర్‌లో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. రెండు దశాబ్దాలకుపైగా అక్కడే గుడిసెలు వేసుకుని, కూలీనాలీ చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న పేదలను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. స్థలం ఖాళీ చేయాలని హెచ్చరిస్తూ గుడిసెలను కూల్చివేస్తుండటంతో నిరుపేద కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. తమకు దిక్కెవరంటూ బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పేదల నివాసాలను కాపాడాల్సిన యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

22 ఏళ్ల బతుకు.. ఒక్కసారిగా ప్రశ్నార్థకం!

కాజీపేట చౌరస్తాకు సమీపంలోని వైఎస్సార్‌ నగర్‌లో సుమారు 22 ఏళ్లుగా నిరుపేద కుటుంబాలు నివసిస్తున్నాయి. నగరంలో చిన్నచిన్న కూలీ పనులు చేసుకుంటూ, ఇళ్లలో పనిచేస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నాయి. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలోనే తాము ఇక్కడ గుడిసెలు వేసుకుని నివాసం ఏర్పరచుకున్నామని స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి వైఎస్సార్‌ నగర్‌గా పేరు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని వివరిస్తున్నారు. ఇన్నేళ్లుగా తమకు సంబంధించిన ఇంటి నంబర్లు, ఆధార్‌ కార్డులు, లేబర్‌ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు సైతం ఇదే చిరునామాపై ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇన్నాళ్లూ తమ నివాసాలపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని వ్యక్తులు ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి స్థలాన్ని ఖాళీ చేయాలంటూ బెదిరించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.

ఏడు నెలలుగా భూమిపై కన్ను!

వైఎస్సార్‌ నగర్‌లోని అత్యంత విలువైన స్థలంపై సుమారు ఏడు నెలలుగా కొందరు ప్రైవేటు వ్యక్తులు కన్నేశారన్నది బాధితుల ప్రధాన ఆరోపణ. ఎలాగైనా ఆ స్థలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే ఉద్దేశంతో పేదలను అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులు నేరుగా ముందుకు రాకుండా రౌడీమూకలను రంగంలోకి దించుతున్నారని ఆరోపిస్తున్నారు. స్థలం తమదంటూ బెదిరింపులకు దిగడం, గుడిసెల్లో నివసిస్తున్న వారిపై దాడులు చేయడం, బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నించడం నిత్యకృత్యంగా మారిందని వాపోతున్నారు. గుడిసెలను కూల్చివేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఎదురు ప్రశ్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూమిపై హక్కులు ఎవరివి? దాని అసలు స్థితి ఏమిటి? ప్రైవేటు వ్యక్తులు ఏ ప్రాతిపదికన తమదంటూ వాదిస్తున్నారు? అన్న ప్రశ్నలకు అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది.

గుడిసెలు కూల్చివేత.. కన్నీటి పర్యంతం!

రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలు.. రోజంతా కష్టపడితే వచ్చే అరకొర సంపాదనతో పిల్లలను చదివించుకుంటూ, కుటుంబాలను పోషించుకుంటున్నాయి. అలాంటి వారి గుడిసెలను కూల్చివేస్తుండటంతో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు సైతం భయాందోళనలకు గురవుతున్నారు. రెండు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని, ఇదే తమకు జీవనాధారమని, తమను బలవంతంగా వెళ్లగొడితే ఎక్కడికి వెళ్లి బతకాలని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమకు మరో ఇల్లు లేదని, ఆస్తిపాస్తులు లేవని, కూలీ పనులు చేసుకుంటూ ఈ గుడిసెల్లోనే జీవితాలు వెళ్లదీస్తున్నామని చెబుతున్నారు. ఒక్కసారిగా గుడిసెలు నేలమట్టం చేస్తే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా, సంబంధిత అధికారుల సమక్షం లేకుండా ఎవరైనా బలవంతంగా నివాసాలను తొలగించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.

పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు!

వైఎస్సార్‌ నగర్‌లో గుడిసెవాసులపై దాడులు, బెదిరింపులు, కూల్చివేతలు జరుగుతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రౌడీమూకలు వచ్చి గుడిసెలను ధ్వంసం చేస్తున్నా, పేదలను బెదిరిస్తున్నా తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు రక్షణ కల్పించాల్సిన పోలీసు యంత్రాంగం మౌనంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. భూమిని ఆక్రమించుకోవాలనుకునే వ్యక్తులకు పరోక్షంగా సహకరిస్తున్నారా? అన్న ప్రశ్నలు సైతం బాధితుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక్కడి పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, దాడులకు పాల్పడుతున్న వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

అధికార పార్టీ అండ ఉందా? ఎమ్మెల్యే మౌనమెందుకు?

వైఎస్సార్‌ నగర్‌లో జరుగుతున్న పరిణామాల వెనుక అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరి అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. అధికార పార్టీ పేరు చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు పేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, తమ సమస్యను పరిష్కరించాల్సిన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ ఎమ్మెల్యే ఇప్పటివరకు తమ వద్దకు వచ్చి పరిస్థితులను పరిశీలించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదల గుడిసెలు కూలిపోతుంటే ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు, ఆపదలో ఉన్నప్పుడు ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు. అధికార పార్టీ నాయకత్వం తక్షణమే జోక్యం చేసుకుని బాధితులకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు.

గుడిసెలు వేయించింది కాంగ్రెస్‌ హయాంలోనే.. ఇప్పుడు కూల్చేది కూడా అదే హయాంలోనా?

2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తాము ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవనం ప్రారంభించామని బాధితులు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో తమ నివాసాలకు విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్‌ సౌకర్యం కల్పించిన అధికారులే ఇప్పుడు గుడిసెలను తొలగించే ప్రయత్నాల్లో భాగమవుతున్నారంటూ వారు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఒకప్పుడు తమ నివాసాలకు సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వ వ్యవస్థలే ఇప్పుడు తమను నిరాశ్రయులను చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ భూమి అని చెబుతున్న స్థలంలో రెండు దశాబ్దాలుగా నివసిస్తున్న తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. భూమి హక్కులపై వివాదం ఉంటే రెవెన్యూ అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు తేల్చాలని, అప్పటివరకు ఎలాంటి బలవంతపు కూల్చివేతలు, దాడులు జరగకుండా చూడాలని కోరుతున్నారు.

పేదలకు న్యాయం జరిగేదెప్పుడు?

వైఎస్సార్‌ నగర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తక్షణమే తెరదించాలని స్థానికులు కోరుతున్నారు. స్థలానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు, సర్వే వివరాలు, ప్రభుత్వ భూమి స్వరూపం, ఆక్రమణల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు. గుడిసెవాసుల నివాసాలకు రక్షణ కల్పించడంతోపాటు దాడులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇన్నేళ్లుగా అక్కడే నివసిస్తున్న నిరుపేద కుటుంబాల పునరావాసం, జీవన భద్రతపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. విలువైన భూముల కోసం పేదల బతుకులను బలిచేసే పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వైఎస్సార్‌ నగర్‌ బాధితులకు న్యాయం చేస్తారా? లేక గుడిసెలు నేలమట్టమవుతున్నా మౌన ప్రేక్షకులుగానే మిగిలిపోతారా? అన్నది వేచి చూడాలి.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.