విద్యుత్ సేవల్లోనూ సాంకేతికే వినియోగం
*పంపిణీ వ్యవస్థలో మనకు జాతీయ స్థాయి గుర్తింపు
*విపత్తులను ఎదుర్కోవడం విద్యుత్ శాఖకు కొత్తేమీ కాదు
*ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు
*లోడ్‌కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల సామర్థ్యం పెంపు
*రైతులకు అదనపు విద్యుత్
*ట్రాన్స్ఫార్మర్ మార్పిడికి ప్రత్యేక ఏర్పాట్లు
*మూడవ డిస్కంతో సబ్సిడి సేవలు
అక్షరశక్తి,ప్రధాన ప్రతినిధి: అన్ని రంగాల మాదిరిగా విద్యుత్ సేవల్లోనూ ఆర్టిఫిసియల్ ఇంటలిజెన్స్ , ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మెరుగైన సేవలు అందిస్తున్నామని, ప్రజలు, రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి స్పష్టం చేశారు.
తమ సిబ్బంది విద్యుత్ సేవల కోసం క్షేత్ర స్థాయిలో నిరంతర శ్రమిస్తున్నారు అని అన్నారు. రైతులకు నిరంతర విద్యుత్ అందించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఎల్ నినో వల్ల భూగర్భ జలాలు తగ్గినప్పటికీ, పంటల మార్పిడి విధానం అమలు చేసి భారం పడకుండా ప్రభుత్వం అనేక ప్రణాళికలు రచిస్తున్నదని అన్నారు. విద్యుత్ డిమాండు, ఎల్‌నినో ప్రభావం, విద్యుత్ సరఫరాలోని సవాళ్లు’ అనే అంశంపై డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులతో (టీడీఎంయూ) ప చిట్‌చాట్‌లో ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అనేక విషయాలు వెల్లడించారు.
డిమాండ్ అనుగుణంగా సప్లై
ఎల్ నినో వంటి అనేక విపత్తులు విద్యుత్ డిమాండ్ అసాధారణంగా పెరుగుతున్నప్పటికీ, దాన్ని ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉన్నామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. ప్రజలకు, రైతులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించేందుకు ముందస్తు ప్రణాళికతో పనిచేస్తున్నామని, విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు వినియోగదారుల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల సామర్థ్యం పెంచడం, వ్యవసాయ అవసరాలకు అదనపు విద్యుత్ సరఫరా, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించే ఏర్పాట్లు చేశామని వివరించారు. విద్యుత్ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం శ్రమిస్తూ సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
అసాధారణంగా పెరిగిన విద్యుత్ డిమాండ్
ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కపోత, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని వరుణ్‌రెడ్డి తెలిపారు. గృహ, వాణిజ్య రంగాల్లో ఏసీలు, కూలర్ల వినియోగం పెరగడంతోపాటు భూగర్భ జలాలు తగ్గడంతో వ్యవసాయ పంపుసెట్ల వినియోగం అధికమైందన్నారు. గోదావరి, కృష్ణా బేసిన్ల నుంచి నీటిని ఎత్తిపోసే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్వహణ కూడా విద్యుత్ డిమాండ్‌పై ప్రభావం చూపుతోందని వివరించారు. సాధారణంగా ఏటా విద్యుత్ డిమాండ్ 7 నుంచి 10 శాతం పెరుగుతుందని, ఈసారి మాత్రం అసాధారణ పెరుగుదల నమోదవుతోందని చెప్పారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో గత ఏడాది అక్టోబరులో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 3,762 మెగావాట్లుగా ఉండగా, ఈ ఏడాది అదే నెలలో 6,700 మెగావాట్లకు చేరిందని తెలిపారు. గత నెలలో దాదాపు 7,000 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైందన్నారు. గత ఏడాదితో పోలిస్తే అక్టోబరు నెలలో గరిష్ఠ డిమాండ్ సుమారు 67 శాతం పెరిగిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మార్చిలో 18,548 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదవగా, అక్టోబరులోనే 20,018 మెగావాట్ల రికార్డు డిమాండ్ నమోదైందని చెప్పారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.
4,500 ట్రాన్స్ఫార్మర్లతో సామర్థ్యం పెంపు
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకునేందుకు వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా దాదాపు 4,500 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు సీఎండీ తెలిపారు. పట్టణాలు, మున్సిపాలిటీలు, గ్రామాల్లోని సబ్స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడంతోపాటు కొత్త 33 కేవీ, 11 కేవీ విద్యుత్ లైన్లను ఏర్పాటు చేశామని వివరించారు. వచ్చే ఫిబ్రవరి నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందన్న అంచనాలతో అక్టోబరు, నవంబరు నుంచే తదుపరి దశ పనులు చేపట్టామని తెలిపారు. ఎక్కడెక్కడ విద్యుత్ లోడ్ పెరిగే అవకాశముందో ముందుగానే అంచనా వేసి ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు, కొత్త లైన్ల ఏర్పాటు, అవసరమైన చోట భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. పవర్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని, వాటి సరఫరా ప్రారంభమైందని వివరించారు. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సరఫరా కూడా కొనసాగుతోందని, లైన్ల పనులకు టెండర్లు ఖరారు చేశామని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల పనులను డిసెంబరు చివరి నాటికి లేదా జనవరి మధ్యలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
వ్యవసాయ విద్యుత్ డిమాండ్‌పై ప్రత్యేక దృష్టి
వ్యవసాయ రంగంలోనూ విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని వరుణ్‌రెడ్డి తెలిపారు. కొన్ని సబ్స్టేషన్ల పరిధిలో గత ఏడాదితో పోలిస్తే డిమాండ్ 70 నుంచి 80 శాతం వరకు పెరిగిందని, మరికొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 50 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. ఈ పరిస్థితిని ముందుగానే అంచనా వేసి ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే పొలాల్లో విద్యుత్ లైన్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు వంటి పనులు చేపట్టామని తెలిపారు. ముందస్తు ఏర్పాట్ల వల్ల పెరిగిన డిమాండ్‌ను విద్యుత్ వ్యవస్థ తట్టుకోగలుగుతోందన్నారు. రైతులకు అవసరమైన విద్యుత్ అందించేందుకు అన్ని జిల్లాల్లో మూడు నెలలకు సరిపడా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల నిల్వలు సిద్ధంగా ఉంచామని చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నప్పుడు వెంటనే స్పందించేందుకు అదనంగా దాదాపు 40 వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ను తీసుకెళ్లి దెబ్బతిన్నదాన్ని మార్చి, పాడైన దాన్ని తిరిగి తీసుకొస్తున్నామని, సాధ్యమైనంత వరకు 24 గంటల్లోపే మార్పిడి పూర్తి చేస్తున్నామని వివరించారు.
రైతులకు అదనపు విద్యుత్ సరఫరా
వరి పంటలకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ శాఖ, వ్యవసాయ శాఖ సంయుక్తంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాయని సీఎండీ తెలిపారు. వచ్చే 15, 30, 45, 60 రోజుల్లో పంట కోతకు వచ్చే ప్రాంతాలను గుర్తించి నవంబరు చివరి వరకు అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. పంట కోతకు మరో 15 నుంచి 20 రోజుల సమయం ఉన్న ప్రాంతాల్లో వరికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని గుర్తించి, ఆయా మండలాల్లో రాత్రి వేళల్లో అదనపు విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. రాత్రి 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక విడత, ఒంటి గంట నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు మరో విడతగా అదనపు సరఫరా చేస్తున్నామని తెలిపారు. రైతులతో చర్చించి, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అధికారులు ఉదయం ఆరు గంటలకంటే ముందే సబ్స్టేషన్లు, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ రైతులతో మాట్లాడుతున్నారని, తక్కువ వోల్టేజీ వంటి సమస్యలు తలెత్తితే ట్రాన్స్‌కో అధికారులతో సమన్వయం చేసుకుని పరిష్కరిస్తున్నామని వివరించారు.
ట్రాన్స్ఫార్మర్లపై అధిక లోడ్ పడకుండా చర్యలు
ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యానికి మించి మోటార్లు ఏర్పాటు చేయడం కూడా వైఫల్యాలకు కారణమవుతోందని వరుణ్‌రెడ్డి తెలిపారు. చెరువులు, కాలువల నుంచి నీటిని తోడేందుకు అదనపు మోటార్లు ఏర్పాటు చేయడం, బోరుబావులకు మరిన్ని మోటార్లు అమర్చడం, పాత బావులను తిరిగి వినియోగంలోకి తీసుకురావడం వల్ల విద్యుత్ లోడ్ పెరుగుతోందన్నారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచుతున్నామని చెప్పారు. తక్కువ వోల్టేజీ సమస్యలు ఎదురైనప్పుడు పవర్ ట్రాన్స్ఫార్మర్ల ట్యాప్స్ సర్దుబాటు చేయడం, కెపాసిటర్ బ్యాంకులు ఏర్పాటు చేయడం, అదనపు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఆరుతడి పంటల సాగుపై అవగాహన
నీటి వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు పంటల ఎంపికపై కూడా ఆలోచించాలని సీఎండీ సూచించారు. వరి వంటి అధిక నీటి అవసరమున్న పంటలతోపాటు, సాధ్యమైన చోట ఆరుతడి పంటలను ఎక్కువగా సాగు చేయడం రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల భూగర్భ జలాలు మరింతగా అడుగంటకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ సరఫరా నిర్వహణలో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, వాటిని అధిగమించేందుకు శాఖ అన్ని విధాలుగా సన్నద్ధమై ఉందని వరుణ్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు, రైతుల్లో విద్యుత్ వినియోగం, నీటి పొదుపుపై అవగాహన కల్పించడంతోపాటు, క్షేత్రస్థాయిలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ముందస్తు ప్రణాళిక, మౌలిక సదుపాయాల బలోపేతం, ట్రాన్స్ఫార్మర్ల నిల్వలు, రైతులతో సమన్వయం ద్వారా పెరుగుతున్న డిమాండ్‌ను ఎదుర్కొని ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ అందించేందుకు చర్యలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.
మూడవ డిస్కంతో సబ్సిడి సేవలు
చాలా మందికి మూడవ డిస్కంపై అనేక అపోహలు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే రాయితీ పథకాలు, వాటి అమలు కోసం ఈ డిస్కం పనిచేస్తుంది. దీని వల్ల సాధారణ గృహ వినియోగం, సబ్సిడి వంటి అన్ని రకాల సేవలు నిరంతరాయంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది.

