31.3 C
Hyderabad
Homeతెలంగాణపాతికేళ్ల తపనకు ప్రధాని ప్రశంసలు!

పాతికేళ్ల తపనకు ప్రధాని ప్రశంసలు!

📰 Generate e-Paper Clip

– ఓరుగల్లు వైభవాన్ని దేశ ప్రధానికి వివరించిన వరంగల్‌ బిడ్డ సూర్యకిరణ్‌

– భారత్ పర్వ్‌లో పేరిణి నృత్యానికి ప్రధాని మోదీ ప్రశంసలు

– స్వయంగా ప్రధానమంత్రికి తెలంగాణ‌ సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని వివరించిన వరంగల్‌ బిడ్డ

– పాతికేళ్లుగా పర్యాటక రంగానికే అంకితమైన జీవితం..

– ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయని పట్టుదల

– ఓరుగల్లు పర్యాటక శోభను ప్రపంచానికి చాటాలన్నదే లక్ష్యం..

– శ్రమకు దక్కిన జాతీయ స్థాయి గుర్తింపు

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ : పర్యాటకమే ఊపిరిగా.. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలే తన గమ్యంగా.. ముఖ్యంగా ఓరుగల్లు పర్యాటక వైభవాన్ని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో పాతికేళ్లుగా అలుపెరగని ప్రయాణం చేస్తున్న వరంగల్‌ బిడ్డకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ఆయనే పర్యాటక శాఖ అసిస్టెంట్‌ టూరిజం ప్రమోషన్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కుసుమ సూర్యకిరణ్‌. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ గుజరాత్‌లో నిర్వహిస్తున్న ‘భారత్‌ పర్వ్‌–2026’ వేదికగా తెలంగాణ పర్యాటక వైభవాన్ని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించే అవకాశం ఆయనకు దక్కింది. తెలంగాణ పేరిణి నృత్య ప్రదర్శనను ప్రధాని ఆసక్తిగా తిలకించి ప్రశంసించడం, కళాకారులు, పర్యాటక శాఖ అధికారులతో కలిసి ఫొటోలు దిగడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా నిశ్శబ్దంగా సాగిస్తున్న ఆయన కృషికి ఈ పరిణామం తగిన గుర్తింపుగా నిలిచింది.

పాతికేళ్ల ప్రస్థానం.. ఎన్నో ఆటుపోట్లు!

సుమారు 25 ఏళ్లుగా పర్యాటక రంగాన్నే జీవితంగా మలుచుకున్న సూర్యకిరణ్‌ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. పరిమిత జీతం.. ఆర్థిక ఇబ్బందులు.. వృత్తిపరమైన సవాళ్లు ఎన్నో ఎదురైనా తన లక్ష్యం నుంచి ఆయన ఎప్పుడూ పక్కకు తప్పుకోలేదు. తెలంగాణ పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రజలకు పరిచయం చేయడమే కాకుండా, ఓరుగల్లు చారిత్రక కట్టడాలు, శిల్పకళా సంపద, ప్రకృతి అందాలు, వారసత్వ ప్రదేశాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తున్నారు. వృత్తిని కేవలం ఉద్యోగంగా కాకుండా తెలంగాణ చరిత్రను, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసే బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. అందుకు ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయని ఆయన నిబద్ధతే నేటి గుర్తింపునకు పునాది.

ప్రధానికి తెలంగాణ వైభవం పరిచయం!

భారత్‌ పర్వ్‌ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ ప్రత్యేకతలను వివరించే క్రమంలో సూర్యకిరణ్‌ రాష్ట్ర చేనేత, చిత్రకళ, శిల్పకళా వైభవాన్ని పరిచయం చేశారు. పోచంపల్లి చేనేత కళలు, చేర్యాల చిత్రకళ, ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ విశిష్టతలను వివరించారు. రామప్ప ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన ప్రత్యేక సాంకేతికత, కాకతీయుల శిల్పకళా నైపుణ్యం, తెలంగాణ చారిత్రక వారసత్వ సంపద గురించి తెలియజేశారు. అయోధ్య రామమందిర నిర్మాణంలో తెలంగాణ కళలు, సంప్రదాయాలకు సంబంధించిన అంశాలను సైతం ప్రస్తావిస్తూ రాష్ట్ర సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రధానికి వివరించారు. దేశంలోని 29 రాష్ట్రాల పర్యాటక ప్రదర్శనశాలలు, ఆహార సంస్కృతులు, కళారూపాలు కొలువుదీరిన ఈ జాతీయ వేదికపై తెలంగాణ పేరిణి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలవడం విశేషం.

ఓరుగల్లు కీర్తికి జాతీయ వేదికపై వెలుగు!

ఒకవైపు పేరిణి నృత్య కళాకారులకు జాతీయ వేదికపై గుర్తింపు.. మరోవైపు తెలంగాణ పర్యాటక వైభవాన్ని ప్రధానికి వివరించే అవకాశం.. వెరసి సూర్యకిరణ్‌ పాతికేళ్ల శ్రమకు దక్కిన గౌరవంగా ఈ ఘట్టాన్ని పర్యాటక రంగ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఓరుగల్లు పేరు దేశవ్యాప్తంగా మార్మోగాలన్న ఆయన ఆకాంక్షకు ఈ అవకాశం మరింత బలాన్నిచ్చింది. రామప్ప, వేయిస్తంభాల గుడి, వరంగల్‌ కోట వంటి చారిత్రక కట్టడాలతోపాటు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పర్యాటక ప్రాంతాల విశిష్టతను ప్రపంచానికి చాటాలన్నదే ఆయన నిరంతర ప్రయత్నం. ఆర్థిక ఇబ్బందులు విజయానికి అడ్డంకులు కావని, నిబద్ధతతో చేసే పనికి ఏదో ఒక రోజు తగిన గుర్తింపు లభిస్తుందని సూర్యకిరణ్‌ ప్రయాణం నిరూపిస్తోంది. ఉద్యోగాన్ని బాధ్యతగా.. బాధ్యతను లక్ష్యంగా.. లక్ష్యాన్ని జీవిత ధ్యేయంగా మలుచుకున్న ఆయన ప్రస్థానం పర్యాటక రంగంలో పనిచేస్తున్న వారికి, యువతకు స్ఫూర్తిదాయకం.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.