వార్త ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలి
ప్రజాప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలి
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మొద్దు
టీడీఎంయూ లోగో ఆవిష్కరణలో వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
అక్షరశక్తి, వరంగల్ : జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వాస్తవాలను నిర్ధారించుకున్న తర్వాతే వార్తలను ప్రజల ముందుకు తీసుకురావాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత అన్నారు. వార్త కంటే వాస్తవం ముఖ్యం. సంచలనం కంటే ప్రజా ప్రయోజనం ముఖ్యమని అన్నారు. మంగళవారం తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ అధికారిక లోగోను కమిషనర్ శ్వేత ఆవిష్కరించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. జర్నలిస్టు చేతిలోని కలం సమాజంపై ఎంతో ప్రభావం చూపుతుందని అన్నారు. అదే సమయంలో నిర్ధారణ లేని సమాచారం ప్రచురిస్తే వ్యక్తుల గౌరవానికి, ప్రతిష్ఠకు నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పారు. అందువల్ల ఏదైనా వార్తను ప్రచురించే ముందు దాని వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఒక సమాచారం సంచలనాత్మకంగా ఉన్నంత మాత్రాన దాన్ని వెంటనే వార్తగా మార్చకూడదని అన్నారు.
ప్రజా ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకోవాలి
ప్రస్తుతం సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ఏ సమాచారం అయినా క్షణాల్లో వైరల్ అవుతోందని కమిషనర్ శ్వేత అన్నారు. అయితే వైరల్ అవుతున్న ప్రతి సమాచారం వాస్తవం కాదని గుర్తుంచుకోవాలని సూచించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకోకుండా ప్రచురించకూడదన్నారు. వైరల్ కావడం వేరు.. వాస్తవం కావడం వేరని అన్నారు. ఎక్కువ వ్యూస్, క్లిక్స్ కోసం సంచలనాత్మకంగా వార్తలను రూపొందించడం కంటే ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని అందించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, బాధితుల గళాన్ని వినిపించడం, అవినీతి, అక్రమాలను ఆధారాలతో వెలుగులోకి తీసుకురావడం జర్నలిజం లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వ శాఖలు లేదా సంబంధిత అధికారుల నుంచి అధికారిక సమాచారం తీసుకున్న తర్వాతే ఏదైనా విషయాన్ని నమ్మాలని అన్నారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు, బాధితులు, మహిళలు, పిల్లల విషయంలో వార్తలు రాసేటప్పుడు మరింత సంయమనం పాటించాలని సూచించారు. బాధితుల కష్టాలను సంచలనంగా మార్చకుండా వారి సమస్యలను సమాజం, అధికారుల దృష్టికి తీసుకెళ్లేలా జర్నలిజం ఉండాలని అన్నారు. కార్యక్రమంలో టీడీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు అరెల్లి కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన నాగరాజు, కోశాధికారి పల్లె వంశీ, ఉపాధ్యక్షుడు మోహన్, జాయింట్ సెక్రటరీ బూర నగేష్ గౌడ్, గౌరవ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, ఈసీ మెంబర్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

