18.7 C
Hyderabad
Homeతాజా వార్తలుకాలం చెల్లినా.. కుర్చీ వదలరా!

కాలం చెల్లినా.. కుర్చీ వదలరా!

📰 Generate e-Paper Clip

– గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ ప్రెస్‌క్ల‌బ్ కార్య‌వ‌ర్గం అనైతిక కొన‌సాగింపు

– రెండేళ్ల పదవీకాలం ముగిసి మరో రెండేళ్లు గడిచినా పీఠాన్ని వ‌ద‌ల‌ని వైనం

– గడువు ముగిసిన కమిటీకి కొనసాగింపు అధికారం ఎక్కడిది?

– ఎన్నికల నిర్వహణను పక్కనపెట్టి బైలా సవరణ పేరుతో కాలయాపన

– సభ్యుల ప్రమేయం లేకుండానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు

– స్ట్రింగర్లు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్ల పోటీ అవకాశాలకు కోత పెట్టేలా నిబంధనలు?

– ఓటు హక్కులేని వ్యక్తులకు బైలా కమిటీలో చోటు కల్పించడంపై అభ్యంతరాలు

– కమిటీ రద్దు, ఎన్నికల నిర్వహణకు కలెక్టర్లకు రెండుసార్లు వినతులు

– ఆందోళ‌న‌కు సిద్ధ‌మ‌వుతున్న జ‌ర్న‌లిస్టులు

అక్షరశక్తి, వరంగల్‌: రెండేళ్ల పదవీకాలానికి ఎన్నికైన పాలకవర్గం.. నాలుగేళ్లయినా పదవిని వీడకపోవడమేంటి? గడువు ముగిసిన కమిటీకి బైలా కమిటీ ఏర్పాటు చేసే అధికారం ఎవరిచ్చారు? సభ్యుల ఆమోదం లేకుండా కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు ఎక్కడిది? ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యతను పక్కనపెట్టి బైలా సవరణ పేరుతో పీఠాన్ని పదిలం చేసుకునే ప్రయత్నాలెందుకు? స్ట్రింగర్లు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లను ఎన్నికల బరిలోకి రాకుండా అడ్డుకునే నిబంధనలెందుకు? ఓటు హక్కే లేని వ్యక్తులకు బైలా కమిటీలో స్థానం కల్పించడం వెనుక ఆంతర్యమేమిటి? జర్నలిస్టుల హక్కులు, ఐక్యతకు వేదికగా ఉండాల్సిన గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌లో ఇప్పుడు పదవులే పరమావధిగా మారాయా? రెండేళ్ల క్రితమే ముగిసిన పాలకవర్గ పదవీకాలం మరో రెండేళ్లు గడిచినా కొనసాగుతుండటం, బైలా రూపకల్పనలో ఏకపక్ష వైఖరి, సభ్యుల ప్రాతినిధ్యానికి కోత పెట్టే ప్రయత్నాలపై జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కమిటీ రద్దు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే రెండుసార్లు కలెక్టర్లకు వినతులు సమర్పించినా ఫలితం లేకపోవడంతో.. ఇక ప్రత్యక్ష ఆందోళనకు దిగేందుకు జర్నలిస్టులు సిద్ధమవుతున్నారు.

రెండేళ్ల పదవీకాలం.. నాలుగేళ్లుగా పీఠం!

2022 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో రెండేళ్ల పదవీకాలంతో ఏర్పాటైన గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌ పాలకవర్గం గడువు 2024 డిసెంబరుతో ముగిసింది. నిబంధనల ప్రకారం అప్పట్లోనే కొత్త ఎన్నికలకు ఏర్పాట్లు చేసి సభ్యుల తీర్పు మేరకు తదుపరి కమిటీకి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ గడువు ముగిసి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదు. బైలా రూపకల్పన, రిజిస్ట్రేషన్‌ పేరుతో మ‌ళ్లీ కాలయాపనకే దారితీస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిజిస్టర్డ్‌ బైలా లేదని కోర్టులో వాదనలు వినిపిస్తూనే, గత ఎన్నికలు కోర్టులో నిర్ణయించిన బైలా ప్రకారమే జరిగాయనే అంశాన్ని విస్మరిస్తున్నారన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, కాలం చెల్లిన కార్య‌వ‌ర్గానికి.. బైలా క‌మిటీ వేసే నైతిక హ‌క్కు ఎక్క‌డిద‌న్న ప్ర‌శ్న‌లు జ‌ర్న‌లిస్టువ‌ర్గాల్లో ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ప‌ద‌వీకాలం ముగిసి.. రెండేళ్లు అవుతున్నా.. అనైతికంగా కొన‌సాగుతూ.. బైలా క‌మిటీ వేసే హ‌క్కు ఎక్క‌డిద‌ని జ‌ర్న‌లిస్టులు ప్ర‌శ్నిస్తున్నారు. అంతేగాకుండా, బైలా క‌మిటీ స‌మావేశంలోనూ కార్య‌వ‌ర్గం అధ్య‌క్షుడు, కార్య‌ద‌ర్శి, కోశాధికారి కూడా పాల్గొంటున్న‌ట్లు తెలియ‌డంతో జ‌ర్న‌లిస్టులు మండిప‌డుతున్నారు.

బైలా పేరుతో హక్కులకు కోత?

కాలం చెల్లిన కార్య‌వ‌ర్గానికి ఎలాంటి అర్హ‌త‌లు లేకున్నా.. బైలా క‌మిటీ వేయ‌డ‌మేగాకుండా,
కొత్త బైలా రూపకల్పనలో కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. స్ట్రింగర్లు, ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లను అవ‌మాన‌ప‌ర్చేలా నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని, ఎన్నిక‌ల్లో వారికి పోటీ అవకాశాలు లేకుండా నిబంధనలు రూపొందిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వార్తా సేకరణలో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసే ఈ వర్గాలకు ప్రెస్‌క్లబ్‌లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉండగా, వారిని ఎన్నికల ప్రక్రియకు దూరం చేసే కుట్ర‌లెందుక‌నే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సభ్యులందరి అభిప్రాయాలు తీసుకోకుండా బైలా కమిటీని ఏర్పాటు చేయడం, క్లబ్‌లో సభ్యత్వం, ఓటు హక్కు లేని వ్యక్తులకు అందులో చోటు కల్పించడం పారదర్శకతపై అనుమానాలకు తావిస్తోంది. మాజీ అధ్యక్షులు, సీనియర్‌ జర్నలిస్టులు, యూనియ‌న్ నేత‌ల‌ సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా కాలం చెల్లిన కార్య‌వ‌ర్గం ఏకపక్షంగా వ్యవహరిస్తుంద‌నే అసంతృప్తి వ్యక్తమవుతోంది.

కలెక్టర్లకు వినతులు.. ఆందోళనకు సిద్ధం

ప్రస్తుత పాలకవర్గాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఇప్పటికే రెండుసార్లు వరంగల్‌, హనుమకొండ జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించినట్లు జర్నలిస్టు వర్గాలు పేర్కొంటున్నాయి. కమిటీ కొనసాగింపు, ఎన్నికల జాప్యం, సభ్యుల ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్న తీరును అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఎన్నికల నిర్వహణపై స్పష్టత రాకపోవడంతో జ‌ర్న‌లిస్టువ‌ర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ప్రెస్‌క్లబ్‌ ఏ ఒక్కరి సొంత వ్యవహారం కాదని, సభ్యులందరి భాగస్వామ్యంతో నడవాల్సిన సంస్థ అని జర్నలిస్టులు స్పష్టం చేస్తున్నారు. కాలపరిమితి ముగిసిన కమిటీని రద్దు చేసి, బైలా ముసాయిదాను సభ్యులందరికీ అందుబాటులో ఉంచి, అన్ని విభాగాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పదవీకాలం ముగిసిన పాలకవర్గం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? సభ్యుల ఓటు హక్కుకు విలువ ఎప్పుడు దక్కుతుంది? ఎన్నికల నిర్వహణకు అడుగులు ఎప్పుడు పడతాయి? అన్న ప్రశ్నలు ఇప్పుడు గ్రేటర్‌ వరంగల్‌ ప్రెస్‌క్లబ్‌లో చర్చనీయాంశంగా మారాయి.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.