20.7 C
Hyderabad
Homeతాజా వార్తలుబీఆర్‌ఎస్‌ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం!

బీఆర్‌ఎస్‌ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం!

📰 Generate e-Paper Clip

– కాళోజీ కళాక్షేత్రంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందన

– కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు బ్రేక్‌

– కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే కేటాయించాలని కలెక్టర్‌కు ఆదేశం

– కుడా కార్యాలయాన్ని పాత భవనంలోనే కొనసాగించాలి: జోరిక రమేష్‌

– కళాకారులకు అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

– ప్రజాసంఘాలు, కళాకారులతో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక

అక్షరశక్తి, హనుమకొండ: కాళోజీ కళాక్షేత్రంలోకి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ నాయకుల ఆందోళన, విమర్శల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారకంగా నిర్మించిన కళాక్షేత్రాన్ని కళా, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలకే కేటాయించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ను ఆదేశించారు. అందులోకి ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని స్పష్టం చేశారు. కాళోజీ ఫౌండేషన్‌ సభ్యులతో చర్చించి అక్కడ నిర్వహించాల్సిన కార్యక్రమాలను ఖరారు చేయాలని సూచించారు. కళాక్షేత్రంలోకి కుడా కార్యాలయాన్ని తరలించడాన్ని బీఆర్‌ఎస్‌ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, భవనాన్ని కళాకారులకే అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఆదేశాలు వెలువడటంతో వారి ఆందోళనకు ప్రాధాన్యం ఏర్పడింది.

బాలసముద్రంలోని బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కుడా మాజీ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ కళాకారుల కోసం నిర్మించిన భవనాన్ని ఇతర అవసరాలకు వినియోగించడం సరికాదన్నారు. కాళోజీ ఫౌండేషన్‌ విజ్ఞప్తి మేరకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించి, సుమారు రూ.100 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో కళాక్షేత్రాన్ని నిర్మించారని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని, ప్రస్తుత ప్రభుత్వం కళాకారులకు అవసరమైన మినీ హాల్‌, సమావేశ గదులను కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. సుమారు రూ.5 కోట్లతో అన్ని సౌకర్యాలతో నిర్మించిన పాత కుడా కార్యాలయాన్ని ఖాళీ చేసి కళాక్షేత్రంలోకి మారాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.

కళాక్షేత్రం లక్ష్యాన్ని నీరుగార్చొద్దు: జోరిక రమేష్‌

మాజీ కార్పొరేటర్‌ జోరిక రమేష్‌ మాట్లాడుతూ.. కాళోజీ కళాక్షేత్రాన్ని కళాకారులు, కవులు, విద్యార్థులు, ప్రజలకు ఉపయోగపడేలా నిర్మించారని, దాని అసలు లక్ష్యాన్ని పక్కనపెట్టి ఇతర అవసరాలకు వినియోగించడం దురదృష్టకరమన్నారు. 2014 నవంబర్‌ 9న కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కళాక్షేత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. ఓరుగల్లు సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో 1,500 మందికి పైగా కూర్చునే సామర్థ్యమున్న ఇండోర్‌ ఆడిటోరియాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారని తెలిపారు. దక్షిణ భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు పొందేలా తీర్చిదిద్దిన భవనాన్ని నేటికీ కళాకారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.

కాళోజీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా సరైన ఏర్పాట్లు చేయడం లేదని, కనీసం గేట్లు తెరవడం, లైట్లు వెలిగించడం వంటి కనీస సదుపాయాల విషయంలోనూ నిర్లక్ష్యం కనిపిస్తోందని రమేష్‌ విమర్శించారు. సామాన్య, మధ్యతరగతి కళాకారులు కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అందుబాటు ధరల్లో వేదిక కల్పించాల్సింది పోయి భారీ అద్దెలు నిర్ణయించడం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వడం లేదని చెబుతూనే, ప్రభుత్వ పథకాల పేరుతో కాంగ్రెస్‌ మంత్రులు, నాయకులు అక్కడ రాజకీయ ప్రసంగాలు చేయడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు. హనుమకొండ తహసీల్దార్‌ కార్యాలయానికి శాశ్వత భవనం నిర్మించకుండా కార్యాలయాలను ఒకచోటు నుంచి మరోచోటుకు మారుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. ఇండోర్‌ స్టేడియం, సర్క్యూట్‌ గెస్ట్‌హౌస్‌, జడ్పీ క్యాంపు కార్యాలయం వంటి చోట్ల కార్యాలయాల మార్పుల వెనుక ప్రభుత్వ ఉద్దేశమేమిటని ప్రశ్నించారు.

కుడా భూములను ప్రైవేటు వ్యక్తులకు, తమకు అనుకూలమైన వారికి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని జోరిక రమేష్‌ ఆరోపించారు. షాదీఖానా కోసం కేటాయించిన స్థలాల విషయంలోనూ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. కుడా కార్యాలయాన్ని వెంటనే పాత భవనంలోకి తరలించి, కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తిగా కవులు, కళాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలకే కేటాయించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ప్రజాసంఘాలు, కళాకారులు, ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజల ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించే ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.