23.7 C
Hyderabad
Homeతాజా వార్తలుఎంజీఎం వద్ద ఉద్రిక్తత

ఎంజీఎం వద్ద ఉద్రిక్తత

📰 Generate e-Paper Clip

– ఎంజీఎంలోకి వెళ్ల‌కుండా దాస్యంను అడ్డుకున్న‌పోలీసులు
– నిర్బంధాలను ఛేదించిన వినయ్‌భాస్కర్‌..
– పోలీసులతో తోపులాట.. మాజీ ఎమ్మెల్యేకు గాయాలు..
– కాలు, చేతి నుంచి రక్తస్రావం
– నాకు ఎంజీఎంలోనే చికిత్స చేయండి..
– పోలీసుల తీరుపై దాస్యం ఆగ్రహం

అక్ష‌ర‌శ‌క్తి, వరంగల్‌, సెప్టెంబర్ 22: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రిలో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు, మౌలిక వసతుల కొరత, రోగుల ఇబ్బందులను పరిశీలించేందుకు వెళ్లిన ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్‌, వరంగల్‌ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్‌ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో వినయ్‌భాస్కర్‌ గాయపడినట్లు ఆయన వర్గాలు తెలిపాయి. కాలు, చేతి నుంచి రక్తస్రావం అయినట్లు పేర్కొన్నారు. ఎంజీఎం ఆరోగ్యశ్రీ వార్డులో ఇటీవల పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో ముగ్గురు సహా పలువురికి గాయాలైన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆస్పత్రి భవనం భద్రత, నిర్వహణపై ప్రశ్నలు తలెత్తాయి.

అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

ఎంజీఎంలో రోగులను పరామర్శించి, ఆస్పత్రిలోని పరిస్థితులను తెలుసుకునేందుకు వినయ్‌భాస్కర్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అయితే ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద పోలీసులు ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వినయ్‌భాస్కర్‌ను ఆస్పత్రిలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఎంజీఎం ప్రధాన గేటు పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్‌ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగాయి. అనంతరం తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వినయ్‌భాస్కర్‌ గాయపడ్డారు. అనంతరం ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కడుపులో తన్నారు..

తనపై పోలీసులు దాడి చేశారని వినయ్‌భాస్కర్‌ ఆరోపించారు. పోలీసుల తోపులాటలో తాను గాయపడ్డానని, కడుపులో తన్నారని, చేయికి గాయమైందని కన్నీటి పర్యంతమైనట్లు ఆయన వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వ కనుసన్నల్లోనే పోలీసులు తనపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తనను ప్రభుత్వ ఆస్పత్రి అయిన ఎంజీఎంలో కాకుండా ప్రైవేటు ఆస్పత్రికి తరలించడంపైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ‘నాకు ఎంజీఎంలోనే చికిత్స అందించండి.. ప్రైవేటు ఆస్పత్రికి వద్దు’ అని ఆయన కోరినట్లు పేర్కొన్నారు.

పేదలకు కనీస వైద్యం కరువు

ఎంజీఎంలో పేద ప్రజలకు కనీస వైద్య సదుపాయాలు అందడం లేదని వినయ్‌భాస్కర్‌ విమర్శించారు. రోగులకు సరిపడా బెడ్లు లేకపోవడం, ఆస్పత్రి భవనాల పైకప్పులు పెచ్చులూడిపడటం, అంబులెన్స్‌ల కొరత వంటి సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడి రోగులు గాయపడిన ఘటన మరవకముందే మరో వార్డులోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడటం ఆస్పత్రి నిర్వహణ తీరుపై ఆందోళన కలిగిస్తోందన్నారు. రోగులకు వైద్యం అందించాల్సిన ఆస్పత్రిలోనే వారి భద్రతకు భరోసా లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఎంజీఎం వంటి కీలక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధి వెళ్లడాన్ని అడ్డుకోవడం సరికాదని వినయ్‌భాస్కర్‌ అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులతో అడ్డుకోవడం నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజా పాలన అని చెప్పుకుంటున్న ప్రభుత్వం పేదల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు.

పోలీసుల తీరుపై మహిళల ఆగ్రహం

వినయ్‌భాస్కర్‌ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉన్న కొందరు మహిళలు కూడా పోలీసులను నిలదీసినట్లు ఆయన వర్గాలు తెలిపాయి. ఎంజీఎంలో కనీస వసతులు లేక తాము ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను తెలుసుకునేందుకు వచ్చిన వినయ్‌భాస్కర్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని వారు ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. రోగులకు సరైన వైద్యం, కనీస సౌకర్యాలు కల్పించాలని మహిళలు డిమాండ్‌ చేసినట్లు తెలిపారు.

 

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.