24.9 C
Hyderabad
Homeతెలంగాణఎమ్మెల్యే మౌన‌మెందుకు?

ఎమ్మెల్యే మౌన‌మెందుకు?

📰 Generate e-Paper Clip

– కాజీపేట వైఎస్సార్ న‌గ‌ర్ భూ వివాదంపై ఎమ్మెల్యే నాయిని మౌనం
– 2005లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలోనే గుడిసెల ఏర్పాటు
– వైఎస్సార్ న‌గ‌ర్ పేరుతో కాల‌నీ.. వంద‌కుపైగా కుటంబాల నివాసం
– ఇంటినంబ‌ర్లు, ఆధార్‌కార్డులు, లేబ‌ర్‌కార్డులు ఇక్క‌డి అడ్ర‌స్‌తోనే
– స్వ‌యంగా మైస‌మ్మ‌త‌ల్లి గ‌డిని నిర్మించుకున్న పేద‌లు
– గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారం చేసిన నాయిని
– ఆల‌యంలోనూ ప్ర‌త్యేక పూజ‌లు
– ఆరేడు నెల‌లుగా వైఎస్సార్‌న‌గ‌ర్‌పై కుట్ర‌లు
– వంద‌ల కోట్ల విలువైన భూమిని కొట్టేసే ప్ర‌య‌త్నం
– న‌కిలీ ఓన‌ర్‌ను సృష్టించి, అండ‌గా ఉంటున్న కాంగ్రెస్ నేత‌లు?
– ఖాళీ చేయించే బాధ్య‌త‌కు భారీ మొత్తంలోనే ఒప్పందం!
– రౌడీమూక‌ల‌ను రంగంలోకి దించిన వైనం
– ఇంత జ‌రుగుతున్నా నాయిని మౌనంపై అనేక ప్ర‌శ్న‌లు
– కాంగ్రెస్ పార్టీకి తీవ్ర‌న‌ష్టం త‌ప్ప‌దంటూ ప్ర‌జ‌ల్లో చ‌ర్చ‌

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ 64వ డివిజ‌న్ కాజీపేట వైఎస్సార్ న‌గ‌ర్‌లో పేద‌ల గుడిసెల‌ను కూల్చివేసే కుట్ర‌లు జ‌రుగుతున్నా.. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి ఎందుకు మౌనం వ‌హిస్తున్నారు? నాడు వైఎస్సార్ ప్ర‌భుత్వ హ‌యాంలో కాంగ్రెస్ నాయ‌కులు స్వ‌యంగా పేద‌ల కోసం గుడిసెలు వేయిస్తే.. ఇప్పుడు వాటిని తొల‌గించే కుట్ర‌లో ఇదే పార్టీ నేత‌లే భాగ‌స్వాముల‌వుతున్నార‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వ‌స్తున్నా.. ఎందుకు మాట‌కూడా మాట్లాడ‌డం లేదు? గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్వ‌యంగా వైఎస్సార్ న‌గ‌ర్‌లో తిరిగి, ఓట్లు అభ్య‌ర్థించిన నాయిని.. ఇప్పుడెందుకు అటువైపు క‌న్నెత్తిచూడ‌డం లేదు? వైఎస్సార్‌న‌గ‌ర్ భూమిని కొట్టేసే కుట్ర‌లో స్వ‌యంగా పార్టీ కోసం ప‌నిచేసిన‌ శ్రేణులే బ‌లైపోయే ప్ర‌మాదం ఉన్నా.. ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు..? గుడిసెల‌ను ఖాళీ చేయించేందుకు ఓ నాయ‌కుడు బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నా.. రౌడీమూక‌ల‌ను పేద‌ల‌పైకి పంపిస్తున్నా.. త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు ఉండ‌డంలో ఆంత‌ర్య‌మేమిటి..? ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు గ్రేట‌ర్ ప్ర‌జ‌ల మెద‌ళ్ల‌ను తొలుస్తున్నాయి. పేద‌ల‌కు అన్యాయం జ‌రుగుతున్న స‌మ‌యంలో అండ‌గా నిల‌బ‌డాల్సిన స్థానిక ఎమ్మెల్యే మౌనంగా ఉంటే.. ఇక వారికి దిక్కెవ్వ‌రు? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

నాడు కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో వైఎస్సార్ న‌గ‌ర్ ఏర్పాటు

కాజీపేట చౌర‌స్తాకు స‌మీపంలోని భూమిలో సుమారు రెండు ద‌శాబ్దాలుగా పేద‌లు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. నాడు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముఖ్య‌మంత్రి వైఎస్సార్ హ‌యాంలోనే కాంగ్రెస్‌లు నేత‌లు ఈ భూమిలో పేద‌ల కోసం గుడిసెలు వేయించారు. సరిగ్గా 2005, ఫిబ్ర‌వ‌రి 5వ తేదీనాడు వైఎస్సార్ న‌గ‌ర్ పేరుతో కాల‌నీ ప్రారంభ‌మైంది. దీనిని ప్ర‌భుత్వ భూమిగానే పేర్కొంటూ స్వ‌యంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లే గుడిసెలు వేయించారు. నాడు కాంగ్రెస్ నేత‌లు, అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వ పెద్ద‌లు స్వ‌యంగా వైఎస్సార్‌న‌గ‌ర్‌ను సంద‌ర్శించారు. పేద‌ల‌ను ఆదుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి జై కొట్టామ‌ని, దాదాపు ప్ర‌తీ ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్‌పార్టీవైపే నిల‌బ‌డ్డామ‌ని పేద‌లు చెబ‌తున్నారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అంటే సుమారు 23ఏళ్లుగా ఈ భూమి త‌మ‌దేనంటూ ఎవ‌రూ రాలేదని, అటువైపు క‌న్నెత్తి చూడ‌లేదని, బీఆర్ఎస్ ప‌దేళ్ల పాల‌న‌లోనూ ఎలాంటి వివాదమూ త‌లెత్త‌లేదని గుడిసెవాసులు చెబుతున్నారు.

అన్నీ ఇక్క‌డి నుంచే…

వైఎస్సార్ న‌గ‌ర్‌లో సుమారు 100కుపైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అంద‌రికీ వైఎస్సార్‌న‌గ‌ర్ పేరుతోనే ఇంటినంబ‌ర్లు, ఆధార్‌కార్డులు, వెహికిల్ లైసెన్సులు, లేబ‌ర్‌కార్డులు, ఎన్నిక‌ల గుర్తింపు కార్డులు ఉన్నాయి. అధికారులు విద్యుత్ సౌక‌ర్యం కూడా క‌ల్పించారు. అంతేగాకుండా, కాల‌నీలో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు కూడా అధికారులు ప్ర‌య‌త్నాలు కూడా చేశారు. వైఎస్సార్ న‌గ‌ర్‌లో మైస‌మ్మ‌త‌ల్లి ఆల‌యాన్ని స్వ‌యంగా పేద‌లే నిర్మించుకొని నిత్యం పూజ‌లు చేస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో స్వ‌యంగా నాయిని రాజేంద‌ర్‌రెడ్డి ఈ గుడిలో పూజ‌లు చేశారు. స్థానిక కాంగ్రెస్ శ్రేణుల‌తో క‌లిసి ప్ర‌చారం చేశారు. వైఎస్సార్ హ‌యాంలో త‌మ‌కు గుడిసెలు ద‌క్కాయ‌న్న విశ్వాసంతో కాంగ్రెస్ కోసం నిరంత‌రం ప‌నిచేశారు. ప్ర‌తీ ఎన్నిక‌ల్లో పార్టీకి జైకొట్టారు. స్వ‌యంగా బూత్ క‌న్వీన‌ర్ కూడా ఇక్క‌డి నుంచే ఉన్నారు.

ఆరేడు నెల‌లుగా కుట్ర‌లు

ఇలా ఎలాంటి వివాదం లేకుండా 20ఏళ్ల‌కుపైగా ఇక్క‌డ జీవిస్తున్న పేద‌ల‌ను గ‌త ఆరేడు నెల‌లుగా రోడ్డున ప‌డేసే కుట్ర‌లు జ‌రుగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్న‌డూలేని వైఎస్సార్ న‌గ‌ర్ భూమికి ఇప్పుడు ఒక్క‌సారిగా ఓ న‌కిలీ య‌జ‌మాని పుట్టుకొచ్చిన‌ట్లు స‌మాచారం. ఆ న‌కిలీ ఓన‌ర్ కోసం ఓ కాంగ్రెస్ నేత గ‌ట్టిప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. వైఎస్సార్ న‌గ‌ర్ నుంచి పేద‌ల‌ను వెల్ల‌గొట్టి, గుడిసెల‌ను తొల‌గించే బాధ్య‌త‌ను స‌ద‌రు కాంగ్రెస్ నేత తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారీ మొత్తంలోనే డీల్ కుదిరిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇందు కోసం స‌ద‌రు కాంగ్రెస్ నేత ప‌లు వ్యూహాలు కూడా ర‌చిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇత‌ర ప్రాంతాల్లో డ‌బుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇప్పిస్తామ‌ని, ఇక్క‌డ మీరు గుడిసెలు కూల‌గొట్టుకొని వెళ్లిపోవాల‌ని, అప్పుడు మాత్రమే ఇండ్లు, ప‌ట్టాలు ఇప్పిస్తామ‌ని మాయ‌మాట‌లు చెప్ప‌డ‌మేకాదు.. గుడిసెవాసుల మ‌ధ్య ఐక్య‌త‌ను దెబ్బ‌తీసేందుకు, లొల్లిపెట్టించేందుకు కుట్ర‌లు ప‌న్నుతున్న‌ట్లు స‌మాచారం.

పార్టీకి న‌ష్టం త‌ప్ప‌దా….

నాడు కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో స్వ‌యంగా కాంగ్రెస్ నాయ‌కులే వైఎస్సార్‌న‌గ‌ర్ ఏర్పాటు చేస్తే.. ఇప్పుడే ఇదే పార్టీ నాయ‌కులు వంద‌ల కోట్ల విలువ‌చేసే వైఎస్సార్ న‌గ‌ర్ భూమిని కొట్టేసే కుట్ర‌లో భాగ‌స్వాముల‌వుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. పోలీస్‌స్టేష‌న్ ఎదురుగానే ఉన్న వైఎస్సార్ న‌గ‌ర్‌లో రౌడీమూక‌లు తిరుగుతూ గుడిసెవాసుల‌ను బెదిరిస్తున్నారు. ఖాళీ చేయాలని దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. అయినా.. పోలీసులు ప‌ట్టించుకోవ‌డంలేద‌ని, క‌నీసం స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్‌రెడ్డి కూడా మౌనంగా ఉంటున్నార‌ని గుడిసెవాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో వైఎస్సార్ న‌గ‌ర్ నుంచి కార్య‌క‌ర్త‌లు ఫోన్ చేస్తే మాట్లాడిన నాయిని.. ఇప్పుడు క‌నీసం త‌మ బాధ‌ను వినిపించుకోవ‌డంలేద‌ని గుడిసెవాసులు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే..ఈ ప‌రిణామ‌లు కాంగ్రెస్ పార్టీకి తీవ్ర న‌ష్టం చేస్తాయనే వాద‌న కూడా వినిపిస్తోంది. వ‌చ్చే కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కోక‌త‌ప్ప‌ద‌నే చ‌ర్చ స్థానికుల్లో జ‌రుగుతోంది.

latest articles

explore more

App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.