– కేసీఆర్ మాటలే స్ఫూర్తిగా రెండున్నరేళ్లుగా విస్తృత పర్యటనలు
– నిరంతరం జనంతోనే ఉన్నా.. ప్రజా సమస్యలపై పోరాడుతున్నా..
– విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలే ప్రధాన అజెండా
– జీఓ 46, జీఓ 29, గ్రూప్–1 వివాదాలపై ప్రభుత్వాన్ని నిలదీశాం
– నిరుద్యోగ సమస్యకు నిర్దిష్ట జాబ్ క్యాలెండర్ అవసరం
– కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
– రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం వస్తుందన్న నమ్మకం ఉంది
– నేటి జెన్ జీ తరానికి సరైన నాయకుడు కేటీఆర్
– బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి
– తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్
అక్షరశక్తి, వరంగల్ : * ఎన్నికల్లో గెలవడం.. ఓడిపోవడం.. ఇదంతా పొలిటికల్ జర్నీలో సహజంగా జరిగేదే.. కానీ, మనం జనంలో, జనంతో ఉండాలి. పోరాడుతూ ముందుకు వెళ్లాలి.. గో హెడ్ రాకేష్.. అని మా అధినేత కేసీఆర్ చెప్పిన మాటలే నాకు స్ఫూర్తి. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన నేను, చట్టసభలో అడుగుపెట్టకపోవచ్చు. కానీ.. జనసభలో ఉన్నాను. జనంతో ఉన్నాను. గత రెండున్నరేళ్లుగా విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఇలా అనేకవర్గాల గొంతుకగా పోరాడుతూనే ఉన్నాను. వారి సమస్యలపై ఉద్యమిస్తూనే ఉన్నా. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలోని 34 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నా. విద్యార్థి నిరుద్యోగ, ఉద్యోగ ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం నిరంతరం ఫైట్ చేస్తున్నాను* అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన తన రాజకీయ ప్రస్థానంతోపాటు సమకాలీన అంశాలను వివరించారు. శిఖర సమాన నేత కేసీఆర్ అని, జెన్ జీ తరానికి సరైన నాయకుడు కేటీఆర్ అని అన్నారు. తనపై పార్టీ అధిష్ఠానం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నానని చెప్పారు.
15 రోజుల ముందే రంగంలోకి..
* బీఆర్ఎస్ పార్టీలో చేరిన కొద్దిరోజులకే పార్టీ అధిష్ఠానం నాపై ఎంతో నమ్మకంతో గత ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. అయితే.. అప్పుడు పెద్దగా సమయం లేదు. కేవలం 15రోజుల ముందే ఎన్నికల బరిలోకి దిగాల్సి వచ్చింది. అయినా.. పార్టీ పెద్దలు, ఉమ్మడి జిల్లాల నేతల సహకారం, సమన్వయంతో ముందుకు వెళ్లిన. విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. అన్ని విభాగాల పట్టభద్రులు ఎంతో ఆదరించారు. మద్దతు తెలిపారు. కొద్దిపాటి తేడాతో ఆ ఎన్నికల్లో ఓడిపోయాను. ఓట్ల లెక్కింపులో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడి, గెలిచింది. ఓడిపోయిన నేను ఎక్కడా నిరాశ చెందలేదు. ఒకరోజు కేసీఆర్‌గారు పిలిచి మాట్లాడారు. పోరాడుతూ ముందుకు వెళ్లాలని చెప్పారు. చట్టసభలోకి వెళ్లలేకపోయానని బాధపడలేదు. కానీ.. జనసభలో పనిచేయడానికి అవకాశం వచ్చిందని అనుకున్నా* అని రాకేష్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్ మాటలే స్ఫూర్తిగా ఆనాటి నుంచి తాను ఉమ్మడి వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నానని అన్నారు.
రెండున్నరేళ్లుగా నిరంతర పోరాటం
ఈ రెండురేళ్లుగా నిరంతరం విద్యార్థి నిరుద్యోలు, ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్నానని ఏనుగుల రాకేష్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమిస్తున్నానని అన్నారు. *జీవో 46, జీవో 29, గ్రూప్-1 నోటిఫికేషన్ వివాదాలపై, నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. నిలదీసాం. కాంగ్రెస్‌ప్రభుత్వ మోసపూరిత తనాన్ని బట్టబయలుచేసి, ప్రజలముందు నిలబెట్టాం. ఈ క్రమంలో అనేకమార్లు నిర్బంధాలకు గురయ్యా. అయినా.. వెనకడుగు వేయలేదు. పోరాడినం. అనేక అంశాల్లో గెలిచాం. అంతేగాకుండా, ఉద్యోగులకు సంబంధించిన అత్యంత కీలకమైన సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను అమలు చేయాలని ప్రభుత్వంపై పోరాడుతూనే ఉన్నాను. సమస్యలపై గళం విప్పుతూనే ఉన్నా. ఈ క్రమంలో నిరుద్యోగ బాకీ కార్డు ఉద్యమం చేపట్టాం. జలవిహార్‌లో భారీ సభ నిర్వహించాం. యువసంగ్రామం సభ చేపట్టాం. ఇలా.. హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమిస్తూనే ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో కాళ్లకు చక్రాలు కట్టుకొని తిరిగిన. ఆయా ప్రాంతాల్లోని విద్యార్థినిరుద్యోగులు, ఉద్యోగ ఉపాధ్యాయులు, ప్రైవేట్ ఎంప్లాయీస్‌ను కలిసిన. దగ్గర నుంచి వారి సమస్యలను చూసిన. ఈ రెండున్నరేళ్లలో ఎంతో అనుభవం, పరిణత సాధించిన* అని రాకేష్‌రెడ్డి చెప్పారు.
నిరుద్యోగం తీవ్రమైన సామాజిక సమస్య
* నిరుద్యోగం ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా నేడున్నది. యూపీఎస్‌సీలాగా నిర్దిష్టమైన జాబ్‌క్యాలెండర్ విడుదల వ్యవస్థ మన రాష్ట్రంలో లేదు. దీనివల్ల నిరుద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. జాబ్ నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. దీని కోసం ఏళ్లకొద్దీ పట్టణాల్లో అద్దెరూముల్లో ఉంటూ కోచింగ్‌లు తీసుకుంటూ నిరుద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మన హన్మకొండలోని సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి చూడండి. అక్కడ అందరూ రూ.5 రూపాయల భోజనం తింటున్నారు. జాబ్‌క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఉండవు. ఏండ్లకొద్దీ ఎదురుచూసి.. ఎదురుచూసి.. మెజార్టీ నిరుద్యోగులు తమ వయస్సును కోల్పోతున్నారు. ఉద్యోగం రాదు. చేతిలో పని ఉండదు. ఊరికెళ్దామంటే సెంట్‌భూమి ఉండదు. కళ్లముందు తల్లిదండ్రుల కష్టాలు.. ఏం చేస్తున్నావంటూ బంధువుల ప్రశ్నలు.. ఏం చేయాలో.. దిక్కుతెలియని, దారితోచని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. పెళ్లీలు కూడా కావడం లేదు. ఈ క్రమంలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై.. అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలా ఖమ్మం జిల్లాలో ముదిగొండ ప్రాంతానికి చెందిన వేణు ఆత్మహత్య నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన రాసిన సూసైడ్ లెటర్ చదివితే.. గుండెతరుక్కుపోతుంది. దీనికంతటికీ కారణం.. నిర్దిష్టంగా జాబ్ క్యాలెండర్ లేకపోవడం, నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం. ఈ దారుణమైన స్థితిని మనం మార్చాలి* అని రాకేష్‌రెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కార్పొరేషన్
* ఇక్కడ మనం మరో దారుణమైన స్థితిని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను చర్చించాలి. మన రాష్ట్రంలో సుమారు 8లక్షల మంది ఉద్యోగులు ఉంటే.. అందుకే సుమారు 5లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై విస్తృతంగా అధ్యయనం చేసిన. వారి కష్టాలను దగ్గరి నుంచి చూసిన. వీళ్లకు పర్మినెంట్ ఉద్యోగులతో సమానమైన వేతనాలు ఇవ్వరు. వీళ్లకు ఇచ్చేదే కొద్దిపాటి జీతం. అదికూడా నెలనెలా జీతాలు రావు. రెండు నెలలు, మూడు నెలలు.. ఒక్కోసారి ఐదారు నెలలకు ఒకసారి జీతాలు వస్తాయి. ఇది ఎంత దారుణమైన విషయం. వాళ్ల కుటుంబాలు ఎలా బతకాలి. పిల్లలను ఎలా చదివించాలి. సమాజంలో గౌరవంగా ఎలా జీవించాలి.. ఇవన్నీ కూడా మన గుండెల్ని పిండేసే అంశాలు. ఒకటో తారిఖునే జీతాలు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. జాలి చూపెడుతోంది. కానీ.. ఒకటో తేదీన జీతాలు పొందడం అనేక వాళ్ల హక్కు. జీవించే హక్కును కాపాడాలి. అందుకే.. వీళ్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి భద్రత కల్పించాలి. ఒక హక్కుగా వాళ్లకు నెలనెలా జీతాలు ఇవ్వాలి* అని రాకేష్ అన్నారు. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం పని చేస్తానని చెప్పారు.
శిఖరసమాన నేత కేసీఆర్
* శిఖర సమాన నేత కేసీఆర్. ఆయన విజన్ చాలా గొప్పది. ఏ సమస్యల నుంచి, ఏ బాధల నుంచి తెలంగాణ విముక్తి పొందాలని మనం కోరుకున్నామో, ఏ ఆత్మగౌరవం కోసం మనం కొట్లాడామో.. వాటన్నింటి కోసం స్వరాష్ట్రంలో తీర్చేందుకు ఒక అద్భుతమైన కార్యాచరణతో ముందుకు నడిపించిన మహానేత కేసీఆర్. ఆయనొక మహాముని. ఉద్యమ సమయంలో ఆయన తిరగని ఊరులేదు.. ఆయన పలకరించని పల్లెలేదు.. ఆయన తొక్కని గడపలేదు.. అన్నివర్గాల ప్రజల కష్టాలను అత్యంత దగ్గర నుంచి చూశారు. అందుకే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అద్భుతమైన పాలన అందించారు. పదేండ్ల పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేశారు. మిషన్ కాకతీయతో చెరువులు బాగుచేయించారు. ప్రాజెక్టులు కట్టారు. సాగునీరు అందించారు. మండుటెండలోనూ చెరువులు నిండుకుండలా కళకళలాడాయి. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా పెట్టారు. దళితుల కోసం దళితబంధు అమలు చేసిండ్లు. కార్మికుల కోసం అనేక పథకాలు పెట్టారు. అన్నివిభాగాల్లోనూ ఉద్యోగాలు భర్తీ చేశారు. విద్యారంగాన్ని బలోపేతం చేశారు. వృత్తులను ప్రోత్సహించారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్.. ఇలా మొత్తంగా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతికేలా రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన గొప్ప దార్శనికుడు కేసీఆర్ * అని రాకేష్ కొనియాడారు. కేసీఆర్ ఒక మునిలా తపస్సు చేసి, తెలంగాణను వెంటాడిన అనేక సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపారని అన్నారు.
జెన్ జీ తరానికి సరైన నాయకుడు కేటీఆర్..
జెన్ జీ తరానికి సరైన నాయకుడు కేటీఆర్ అని ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు. జెన్ జీ తరం సమస్యలు, వాటి పరిష్కారం కోసం ఎంతో ముందు చూపుతో కేటీఆర్ పనిచేశారని అన్నారు. టీ హబ్, టీఎస్ఐపాస్, ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయడం.. ఇలా ఒక పదేండ్ల క్రితమే జెన్ జీ తరం కోసం ఆలోచించి, పనిచేశారని అన్నారు. * నిజానికి కేటీఆర్ ఒక విలక్షణమైన నాయకుడు. ఇప్పటి జనరేషన్‌కు సరైన నాయకుడు. రాజకీయాలను ఒక కొత్తకోణంలో చూడాలని, నేటి తరానికి చేరువ చేయాలని, ప్రజల్లోకి వెళ్లాలని నిరంతరం ఆలోచించే నాయకుడు * అని రాకేష్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో నేటి తరాన్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారని అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జెన్ జీ తరానికి ఉపయోగపడే కార్యాచరణతో కేటీఆర్ ముందుకు వెళ్లారని పేర్కొన్నారు. ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్టులను తీసుకొచ్చి, హైదరాబాద్‌ను ఐటీ హబ్ కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారని అన్నారు.
ఉద్యోగాలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవే..
* ఏ ఆకాంక్షలతోనైతే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో.. వాటిని నెరవేర్చడానికి స్వరాష్ట్రంలో వాటిని నిజం చేసి, చూపింది పదేండ్ల బీఆర్ఎస్ పాలన. ప్రధానంగా అన్ని విభాగాల్లోనూ ఉద్యోగాలు భర్తీ చేసింది. పోలీస్ ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు, ఇలా ఇతర విభాగాల ఉద్యోగాలు భర్తీ చేసి, నిరుద్యోగుల కలల్నినిజం చేసింది. సింగరేణిలో కారుణ్యాలు చేపట్టి, అనేక ఏండ్ల సమస్యను తీర్చింది. అయితే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విడుదల అయిన అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు ఎన్నికల కోడ్ లాంటి కారణాలతో ఆగిపోయాయి. వాటిని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేస్తూ, తామే ఉద్యోగాలు ఇచ్చామని అబద్ధాలు చెబుతోంది. కానీ.. ఈ మూడేండ్ల కాలంలో కాంగ్రెస్‌ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు ఏమీ లేవు. మేం పోరాడితే.. ఇటీవల కొన్ని పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. అదికూడా అతి తక్కువ సంఖ్యలో ఇస్తోంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేస్తోంది. అబద్ధాల మీద ప్రభుత్వం నడుపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి* అని రాకేష్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వారధిగా ఉంటా..
గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, విద్యార్థి నిరుద్యోగ, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలపై పోరాడుతున్నానని రాకేష్‌రెడ్డి అన్నాను. రామకోటి రాసినదాని కన్నా ఎక్కువగా ఈ రెండురేళ్లలో విద్యార్థి నిరుద్యోగ, ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను ప్రస్తావించానని చెప్పారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా అధిష్ఠానం తనకు మరోసారి అవకాశం ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. అన్నివర్గాల ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయిందని, రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ విషయం తేలిపోతుందని, రాబోయే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వారధిగా నిలుస్తానని అన్నారు.
బిట్స్‌పిలానిలో డ్యుయెల్‌డిగ్రీ..
* మాది గ్రేటర్ వరంగల్ పరిధి హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామం. వ్యవసాయ కుటుంబమే. అమ్మానాన్న ఏనుగుల కోమల- గోపాల్‌రెడ్డి. 10వ తరగతి వరకు వరంగల్ పబ్లిక్ స్కూల్‌లో, ఇంటర్ గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీ చదివిన. అప్పుడు ఇంటర్‌లో స్టేట్ 9వ ర్యాంకు సాధించా. దీంతో నాకు బిట్స్ పిలానిలో అడ్మిషన్ వచ్చింది. ఇక్కడ ఐదేళ్ల డ్యుయెల్‌డిగ్రీ పూర్తి చేసిన. బిట్స్ పిలానిలో స్టూడెంట్ లీడర్‌గా పనిచేసిన. ఏడేండ్ల పాటు బెంగళూరు, యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌గా ఉద్యోగం చేసిన. విద్యార్థి దశ నుంచే జాతీయ భావాలతో ఉన్న నేను 2013లో బీజేపీలో చేరిన. ఆ తర్వాత పదేండ్లపాటు వరంగల్లో బీజేపీ బలోపేతంలో కీలకంగా పనిచేసిన. ప్రధానంగా ఇక్కడ ఉన్న మురికివాడల ప్రజల సమస్యల పరిష్కారం కోసం కష్టపడిన. ప్రధానంగా వరదల సమయంలో ఇంటింటికీ వెళ్లి నావంతు సాయం అందించాను అని ఏనుగుల రాకేష్‌రెడ్డి వివరించారు. అయితే.. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కొన్ని అనివార్యకారణాల వల్ల తాను బీఆర్ఎస్‌లో చేరానని ఆయన చెప్పారు.
ఆర్థిక అంశాలపై ప్రత్యేక దృష్టి
* నా సబ్జెక్ట్ ఎకానమీ కాబట్టి ఆర్థిక పరమైన అంశాలు, సామాజిక అంశాలపై నాకు ఎప్పటి నుంచో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. తెలంగాణ సమాజం, ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేస్తూ, ప్రముఖ దినపత్రిక ఈనాడులో సెంటర్ పేజీ వ్యాసాలు రాశాను. ఆ వ్యాసాలన్నింటినీ సమగ్రంగా సంకలనం చేసి “ప్రగతి రథ చక్రాలు” అనే పుస్తకాన్ని రచించాను. దానికి స్వయంగా ఈనాడు సంస్థల అధిపతి రామోజీ రావు ముందుమాట రాయడం మర్చిపోలేనిది. విదేశాల నుండి వచ్చిత తర్వాత ప్రతిష్టాత్మకమైన RC Reddy IAS Study Circle వంటి IAS కోచింగ్ సంస్థల ఆహ్వానం మేరకు గెస్ట్ లెక్చరర్‌గా పాల్గొని, విద్యార్థులతో ఆర్థిక, సామాజిక, సమకాలీన అంశాలపై స్పెషల్ క్లాసులు తీసుకున్నాను. అదే సమయంలో ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎకనామీ పై సరైన పుస్తకం లేదని వారు అడిగితే తెలంగాణలో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే లక్షలాది మంది విద్యార్థులకు ఉపయోగపడాలన్న సంకల్పంతో ఇంగ్లీషులో, తెలుగులో నాడు మొట్టమొదటి ” Telangana Economy” పుస్తకాన్ని రచించాను. అలాగే, “నవశకానికి నాంది” వంటి పుస్తకాలు రచించాను అని రాకేష్‌రెడ్డి వివరించారు.

