ఆదివారం సాయంత్రం కేడీసీ మైదానంలో సభ
ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించనున్న కేటీఆర్
వివిధ పార్టీల నేతలు, మేధావుల చేరికకు రంగం సిద్ధం..
20 వేల మందికిపైగా జనసమీకరణపై గులాబీ శ్రేణుల ధీమా
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి: దాస్యం వినయ్ భాస్కర్
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటేలా సభ: బోయినపల్లి వినోద్‌కుమార్
అక్షరశక్తి, హనుమకొండ: వరంగల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి కేడీసీ కళాశాల మైదానం వేదిక కానుంది. ఏకశిలా విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డిని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించనున్న నేపథ్యంలో హన్మకొండ కేడీసీ కళాశాల మైదానంలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న జన చైతన్య సభపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. విద్యారంగంలో గుర్తింపు పొందిన గౌరు తిరుపతిరెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరితే వరంగల్ ప్రాంతంలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఆయనతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, మేధావులు, విద్యావేత్తలు కూడా పార్టీలో చేరనున్నట్లు నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ జనసమీకరణకు సిద్ధమయ్యాయి.
20 వేల మందికి మించి జనసమీకరణ!
సభ ఏర్పాట్లను ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, మాజీ చైర్మన్లు, మాజీ కార్పొరేటర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తొలుత సభకు సుమారు 20 వేల మంది వస్తారని అంచనా వేసినప్పటికీ, ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే అంతకుమించిన స్థాయిలో జనసమీకరణ జరిగే అవకాశం ఉందన్నారు. కేటీఆర్ ప్రసంగాన్ని వినేందుకు వేలాదిగా ప్రజలు తరలిరానున్నారని, సభా ప్రాంగణం కూడా సరిపోని పరిస్థితి ఏర్పడవచ్చని అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు బీఆర్‌ఎస్‌లో చేరనున్నారని తెలిపారు. గౌరు తిరుపతిరెడ్డి వంటి విద్యారంగ ప్రముఖుడి చేరికతో పార్టీకి కొత్త వర్గాల మద్దతు లభించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
గత మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని వినయ్ భాస్కర్ విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ పదేళ్ల పాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్ష ప్రజల్లో ఉందని పేర్కొన్నారు.
ప్రజల్లో రాజకీయ చైతన్యం కోసమే సభ
మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే అభయహస్తం హామీలను అమలు చేస్తామని అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారని, మూడేళ్లు గడుస్తున్నా హామీల అమలులో ఆశించిన పురోగతి లేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బదులు రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ప్రస్తుతం అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని, గత ప్రభుత్వ పథకాలను రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి పూర్వవైభవం రావాలంటే కేసీఆర్ నాయకత్వం అవసరమని, ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడమే ఈ సభ ఉద్దేశమని తెలిపారు. కార్మికులు, కర్షకులు, యువత, మేధావులు, విద్యావేత్తలు, పత్రికా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.
కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నాయకులు, ఎమ్మెల్యేలే అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకునే పరిస్థితి కూడా లేదని ఆరోపించారు. కాంగ్రెస్‌కు చెందిన పలువురు నాయకులు, మేధావులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, పట్టణ ప్రాంతాల్లోనూ తాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు గత ప్రభుత్వ పథకాలనైనా కొనసాగించాలని సూచించారు. కేటీఆర్ సభకు నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు, వివిధ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ఉద్యమ ప్రస్థానానికి సాక్షిగా వరంగల్
మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో వరంగల్ నగరానికి ప్రత్యేక స్థానం ఉందని గుర్తుచేశారు. 2001 ఏప్రిల్ 27న గులాబీ జెండా ఆవిష్కరణ అనంతరం కరీంనగర్‌లో నిర్వహించిన సభతో ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైందని, ఆ తర్వాత వరంగల్‌లో జరిగిన సభలు ఉద్యమానికి నూతన ఊపునిచ్చాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఢిల్లీలో కేసీఆర్‌తో కలిసి పార్లమెంట్‌లో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎదురైన రాజకీయ ఆటుపోట్ల నేపథ్యంలో వరంగల్‌కు వచ్చి స్థానిక నాయకులు, మేధావులు, పత్రికా ప్రతినిధులతో చర్చించేవారమని చెప్పారు. వారి అభిప్రాయాలు, మద్దతు కేసీఆర్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేవని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి వరంగల్ ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని, అదే చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంగణంలో కేటీఆర్ సభ జరగడం విశేషమని అన్నారు. ఈ సభలో నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.
చేరికలతో పార్టీ బలోపేతంపై ఆశలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లోనే కాకుండా ఆ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలలోనూ అసంతృప్తి ఉందని బీఆర్‌ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయని, ప్రభుత్వ విధానాలపై సొంత పార్టీ నేతలే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. తాము ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేయడం లేదని, కాంగ్రెస్‌లోని అంతర్గత పరిణామాలే ఆ పార్టీకి సమస్యగా మారాయని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. గౌరు తిరుపతిరెడ్డి చేరికతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పార్టీలోకి వస్తే వరంగల్ ప్రాంతంలో బీఆర్‌ఎస్ సంస్థాగత బలం పెరుగుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, కేడీసీ మైదానంలో జరిగే జన చైతన్య సభతో ఆ దిశగా కార్యాచరణకు శ్రీకారం చుడతామని తెలిపారు.

