Monday, June 17, 2024

క్యాన్స‌ర్‌ను జ‌యిద్దాం..

Must Read
  • మ‌హ‌మ్మారిని త‌రిమికొడ‌దాం..
  • ప్ర‌ముఖ రేడియేష‌న్ ఆంకాల‌జిస్టు డాక్ట‌ర్ ప్ర‌ఫుల్ కుమార్ మందారి
  • ఫిబ్ర‌వ‌రి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంద‌ర్భంగా అక్ష‌ర‌శ‌క్తి ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ

క్యాన్సర్..! ఈ పేరు వింటేనే భ‌యంతో వణికిపోతాం. ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాధుల బారిన పడి చనిపోతున్న వారిలో క్యాన్సర్‌ది రెండో స్థానం. బ్రెస్ట్, లంగ్స్, స్కిన్, త్రోట్, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్ ఇలా దాదాపు వందకుపైగా క్యాన్సర్‌ వ్యాధి రకాలను గుర్తించారు. ఏటా వీటి బారిన పడుతున్న వారి సంఖ్య దాదాపు 13 లక్షలకుపైనే. అయితే.. క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడం చాలావరకు మన చేతుల్లోనే ఉంది. జెన్యు మార్పులతో క్యాన్సర్ రావడం నిజమే అయినా వీటి పాత్ర కేవలం 5-10 శాతం మాత్రమే. మ‌ద్య‌పానం, ధూమ‌పానం వంటి అలవాట్లతో ముడిపడిన క్యాన్సర్లు 27 శాతంపైగా ఉన్నాయి. ఆహార నియమాల్లో జాగ్రత్త వహిస్తే క్యాన్సర్ దరిచేరకుండా కాపాడుకోవడం కష్టమేమీ కాదంటున్నారు వ‌రంగ‌ల్‌లోని ప్ర‌ముఖ ఒమేగా బ‌న్ను హాస్ప‌ట‌ల్ క‌న్స‌ల్టెంట్ రేడియేష‌న్ ఆంకాల‌జిస్టు డాక్ట‌ర్ ప్ర‌ఫుల్ కుమార్ మందారి. ఫిబ్ర‌వ‌రి 4న (ప్ర‌పంచ క్యాన్స‌ర్ దినోత్స‌వం) సంద‌ర్భంగా ఆయ‌న అక్ష‌ర‌శ‌క్తితో మాట్లాడారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి..? దానికి దోహదం చేస్తున్న వేంటి..? నివారణ మార్గాలేంటి అన్న అంశాల‌పై వివ‌రించారు. ఆయ‌న మాట‌ల్లోనే..

క్యాన్స‌ర్ అంటే..?

క‌ణజాలం అన‌వ‌స‌రంగా, ఆగ‌కుండా విప‌రీతంగా వృద్ధి చెంద‌డ‌మే క్యాన్స‌ర్‌. శరీరం మొత్తం కణజాలంతో నిండి ఉంటుంది. అయితే, శరీరంలో ఎక్కడైనా కణజాలం అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోవడం క్యాన్సర్‌కు దారితీస్తుంది. సాధారణంగా శరీరంలో కణాలు విభజన చెందుతూ ఉంటాయి. అవ‌స‌రం తీరాక విభ‌జ‌న ఆపేస్తాయి. అయితే, శరీరంలో ఈ ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. కణాల్లో ఉండే డీఎన్ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. డీఎన్ఏ వల్ల మన తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే మనకు కూడా వస్తాయి. అలాగే క్యాన్సర్ కూడా వ్యాప్తిచెందే అవకాశాలున్నాయి. ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయం తదితర కారణాల వల్ల కూడా డీఎన్‌ఏలో మార్పులు వస్తాయి. దీని వల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కణాల కంటే ఎక్కువ వృద్ధి చెందుతాయి. అవన్నీ కలిసి ట్యూమర్‌గా ఏర్పడతాయి. దీన్నే క్యాన్సర్ అంటారు.

అవ‌గాహ‌న త‌క్కువ‌..

మన దేశంలో క్యాన్సర్ వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి ఇప్పటికీ చాలామందికి అవగాహన లేదు. వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత గుర్తిస్తుండడంతో పరిస్థితి చేయి దాటిపోతోంది. ముందుగానే గుర్తిస్తే దాని బారిన నుంచి త్వరగా బయటపడే ఛాన్స్ ఉంది. క్యాన్సర్ సోకిన తర్వాత స్టేజ్-1, స్టేజ్-2 లలో గుర్తిస్తే.. దాన్ని నయం చేసే వైద్యం అందుబాటులో ఉంది. ఈ రెండు స్టేజ్‌లలో గుర్తించి ట్రీట్‌ మెంట్‌ తీసుకుంటే దాదాపు 90 శాతం నయమయ్యే అవకాశముంది. స్టేజ్‌-4 లో గుర్తిస్తే.. వ్యాధి 22 శాతం నయమయ్యే అవ‌కాశం ఉంటుంది. వ్యాధి తీవ్రత పెరిగిన వారితో పోల్చితే త్వరగా గుర్తించిన వారికి జీవించే అవకాశం ఎక్కువ. వ్యాధి తీవ్రత తగ్గడంతో పాటు క్వాలిటీ లైఫ్‌ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. మ‌న వ‌రంగ‌ల్ న‌గ‌రంలోనూ క్యాన్స‌ర్‌కు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. న‌గ‌రంలోని ఒమేగా బ‌న్ను ద‌వాఖాన‌లో క్యాన్స‌ర్ పేషెంట్ల‌కు అత్యాధునిక వైద్య సేవ‌లు అందిస్తున్నాం.

క్యాన్సర్‌కు దారి తీసే అంశాలేంటి…?

జన్యు మార్పులే కాదు, జన్యు వ్యక్తీకరణను దెబ్బతీసేవన్ని క్యాన్సర్ కారకాలుగా పరిణమిస్తాయి. ఇందులో మన జీవనశైలే కీలక పాత్ర పోషిస్తుంది. మూడింట రెండొంతుల క్యాన్స‌ర్లు మ‌న గతి తప్పిన ఆహార నియమాలు, పరిసరాల ప్రభావంతో ముడిపడినవే.

అధిక బ‌రువు

అధిక బరువు గల వారిలో నిరంతరం క‌ణ స్థాయిలో స్వల్పంగా వాపు ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే రక్తంలో ఇన్సులిన్, ఇన్సులిన్ మాదిరి గ్రోత్ హార్మోన్ల మోతాదులు ఎక్కువగానే ఉంటాయి. అంతేకాదు కొవ్వు మూలంగా ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇవన్నీ పెద్ద పేగు, రొమ్ము, గర్భాశయ, అన్నాశయ, క్లోమ‌, కాలేయ, అన్నవాహిక, కిడ్నీ, ప్రోస్ట్రేట్, పిత్తాశయం క్యాన్సర్ల ముప్పు పెరిగేలా చేస్తాయి. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌డం, అధికంగా పెరుగుతున్న‌యితే త‌గ్గించుకోవ‌డం మంచిది.

Human Cancer Cell

పొగాకు వాడకం

పొగాకులో సుమారు 7 వేల రకాల విషతుల్య రసాయనాలు ఉంటాయి. వీటిల్లో 400 రకాలు క్యాన్సర్‌కు దారి తీసేవే. మొత్తం క్యాన్సర్లలో 22 శాతం పొగాకు మూలంగా తలెత్తుతున్నవే. పొగాకుతో నోరు, ఊపిరితిత్తుల క్యాన్స‌ర్లే కాదు, మెడ, గొంతు, ఆహారవాహిక, జీర్ణాశయం, క్లోమం, కిడ్నీ, మూత్రాశ‌య క్యాన్స‌ర్ల ముప్పు పొంచి ఉంటుంది. సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటివి కాల్చకపోవడం, ఇతరులు వదిలిన పొగను పీల్చకపోవడం, గుట్కా, జ‌ర్దా వంటివి నమ‌ల‌కపోవడం వంటి జాగ్రత్తలతో వీటిని నివారించవచ్చు.

మద్యం తాగడం

మద్యం ఒంట్లోకి చేరుకున్నాక అసిట‌ల్ డీహైడ్‌గా మారుతుంది. ఇది డీఎన్ఏను, క‌ణాల మరమత్తు ప్రక్రియను దెబ్బతీస్తుంది. మద్యం తాగడం వల్ల నోరు, మధ్య గొంతులోని కణాలు దెబ్బతిని క్యాన్సర్ కారకాలు తేలికగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. మద్యంతో నోరు, గొంతు, స్వరపేటిక, అన్నవాహక, పెద్దపేగు, కాలేయం, రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. మద్యం జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ఒకవేళ మద్యం అలవాటు ఉంటే మితిమీరకుండా చూసుకోవాలి.

వైరల్ ఇన్ఫెక్షన్లు

హెపటైటిస్ బీ, హెపటైటిస్ సీ ఇన్ఫెక్షన్లు కాలేయ‌ క్యాన్సర్ల‌కు దారి తీయవచ్చు. హెచ్‌పీవీ వైరస్‌తో గర్భాశయ ముఖ ద్వార‌ క్యాన్సర్ రావచ్చు. ఇది జననాంగ‌, మల‌ద్వార‌, నోరు, గొంతు క్యాన్సర్లకు కారణం అవుతుంది.

ఆహార అలవాట్లు

మాంసాహారం, కొవ్వు పదార్థాలు అతిగా తింటే క్యాన్సర్లు తలెత్తే ప్రమాదం ఉంది. శాఖాహారుల్లో ప్రతి వెయ్యి మందిలో 15 నుంచి 35 మందికి… శాఖాహారం, మాంసాహారం రెండూ తినే వారిలో 35 నుంచి 75 మందికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉంది. పూర్తిగా మాంసాహారమే తినే వారిలో 195 నుంచి 210 మందికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంద‌ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొవ్వు, ఉప్పు, చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే పదార్థాలు కూడా క్యాన్సర్ ముప్పును పెరిగేలా చేస్తాయి.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img