వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక
పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారులపై కొరడా ఝలిపించేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు రెడీ అవుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పేరుకుపోయిన ఈ-చలాన్లను క్లియర్ చేసేందుకు ఓ అవకాశాన్ని ఇచ్చారు. క్యాటగిరీ ప్రకారం రాయితీ ఇచ్చి, సుమారు 45 రోజులు గడువు ఇచ్చారు. ఈ ఐడియా పోలీసులకు బాగానే వర్కవుట్ అయినప్పటికి కేవలం 70 శాతం పెండింగ్ చలాన్లు మాత్రమే క్లియర్ అయ్యాయి. అంటే ట్రాఫిక్ నిబంధలు ఉల్లంఘించిన మరో 30 శాతం మంది వాహనదారులు చలాన్లు కట్టకుండా వదిలేశారు. దీంతో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికీ పెండింగ్ చలాన్లు చెల్లించని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు. చలాన్లు చెల్లించకుండా తిరుగుతున్న వారు పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేయబోతున్నారు. అంతే కాదు నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వాహనదారులకు ఇచ్చిన అవకాశాన్ని నూటికి నూరు శాతం ఉపయోగించుకోకపోవడం వల్లే పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు వాహనదారులారా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోండి లేదంటే వాహనాలతో పాటు మీరు కటకటాల వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు.