- మ్యూజిక్ మేస్ట్రోకి బీజేపీ రాజ్యసభ సీటు !
- ఇటీవలే ప్రధానిని పొగిడిన సంగీత దిగ్గజం
తమిళనాడులో బలపడేందుకు విశ్వప్రయత్నం చేస్తోన్న బీజేపీ కొత్త ఎత్తుగడలు అనుసరిస్తున్నది. జయలలిత మరణం, శశికళ దూరం, అన్నాడీఎంకే పతనం తర్వాత రాష్ట్రంలో చోటు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. తమిళనాట సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుంది కనుక సినీ సెలబ్రెటీలను తమ పార్టీలోకి లాగేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది.
కేరళలో సురేశ్ గోపి లాంటి ప్రముఖులను పార్టీలోకి చేర్చుకున్నరీతిలోనే తమిళనాడులోనూ సెలబ్రిటీలపై బీజేపీ ఫోకస్ పెంచింది. ఈనేపథ్యంలోనే తమిళనాట పుట్టి ప్రపంచ ఖ్యాతి పొందిన దిగ్గజ సంగీత దర్శకుడు, మెస్ట్రో ఇళయరాజాను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రపంచ ప్రఖ్యాత సంగీతకారుడు, భారతీయ సినీ సంగీత దర్శకుడు మెస్ట్రో ఇళయరాజాను రాజ్యసభకు నామినేట్ చేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. రాజాను నేరుగా పార్టీలోకి చేర్చుకోకుండా రాజ్యసభకు పంపడం ద్వారా ఆయన అభిమానుల ఆదరణ పొందొచ్చనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇళయరాజాను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. సంగీత, సాహిత్య, వైజ్ఞానికత, ఆర్ధిక రంగాలకు చెందిన ప్రముఖులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే విషయం తెలిసిందే. రాష్ట్రపతి కోటాలనే ఆరేళ్ల కింద మోదీ ప్రభుత్వం సుబ్రమణ్యస్వామిని రాజ్యసభకు పంపింది. సొంతపార్టీకి కొరకరాని కొయ్యగా మారి, ప్రధాని మోదీపైనా విమర్శలు గుప్పిస్తోన్న సుబ్రమణ్యస్వామి పదవీకాలం త్వరలోనే ముగియనుంది.
ఆ స్థానంలోనే ఇళయరాజాను రాజ్యసభకు పంపాలని బీజేపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో హోరెత్తుతున్నది. అయితే కేంద్రంగానీ, రాష్ట్రపతి కార్యాలయంగానీ ఇప్పటిదాకా అధికారిక ప్రకటనైతే చేయలేదు. ప్రధాని మోదీని బాహాటంగా పొడిగిన కొద్ది రోజులకే ఇళయరాజాకు ఈ ఆఫర్ రావడం గమనార్హం.