Tuesday, June 25, 2024

పూలింగ్‌లో మిస్సింగ్ !

Must Read
  • కుడా ల్యాండ్ పూలింగ్‌లో కొత్త‌కోణం
  • నోటిఫికేష‌న్‌లో కొన్ని స‌ర్వేనంబ‌ర్లు లేక‌పోవ‌డంపై అనుమానాలు
  • ర‌హ‌స్య స‌ర్వే స‌మ‌యంలోనే ప‌క్కా ప్లాన్ ?
  • నేత‌లు, బినామీలు, అధికార అండ‌దండ‌లున్న వారి భూముల‌ను త‌ప్పించిన‌ట్లు ఆరోప‌ణ‌లు
  • వారి భూములెందుకులేవంటూ రైతుల ప్ర‌శ్న‌ల‌వ‌ర్షం
  • స‌మాధానం చెప్ప‌లేక చేతులెత్తేసిన అధికారులు

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : కుడా ( కాక‌తీయ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ) ఆధ్వ‌ర్యంలో చేప‌డుతున్న ల్యాండ్ పూలింగ్‌లో కొత్త‌కోణాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. అంతా మా ఇష్టం.. అడిగేవారెవ్వ‌రు..? అన్న రీతిలో కుడా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. రైతుల‌కు తెలియ‌కుండా, సీక్రెట్‌గా భూముల‌ స‌ర్వే చేయ‌డంలో ఉన్న ఆంత‌ర్యం ఏమిటో ఇప్పుడిప్పుడు బ‌ట్ట‌బ‌య‌లు అవుతోంది. కుడా విడుద‌ల చేసిన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేష‌న్లో కొన్ని స‌ర్వే నంబ‌ర్లు మిస్ కావ‌డంపై అనేక అనుమానాలు రైతుల నుంచి వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొంద‌రు నేత‌లు, వారి బినామీలు, అధికార అండ‌దండ‌లు, ప‌లుకుబ‌డి ఉన్న‌వాళ్ల భూములను త‌ప్పించి, మిగ‌తా వాళ్ల భూముల‌ను ల్యాండ్ పూలింగ్ నోటిఫికేష‌న్లో పెట్టార‌నే ఆరోప‌ణ‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. త‌మ భూములు తీసుకుంటున్నారుగానీ.. మ‌రి ఆ భూములెందుకు తీసుకోవ‌డం లేదంటూ రైతులు అధికారుల‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. హనుమకొండ, వరంగల్‌, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాల్లో ఔటర్‌రింగ్‌ రోడ్డును ఆనుకొని ఉన్న 21,510.02 ఎకరాల భూమి సమీకరణకు కుడా ఇటీవ‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే.


ల్యాండ్ పూలింగ్ గ్రామాలు ఇవే…
‘కుడా’ ల్యాండ్‌పూలింగ్‌ కింద సమీకరించతలపెట్టిన భూముల్లో గీసుకొండ మండలం గొర్రెకుంటలో 884.11 ఎకరాలు, పోతరాజుపల్లిలో 464.11 ఎకరాలు, ధర్మారంలో 1230.33 ఎకరాలు, దూపకుంటలో 183.12 ఎకరాలు, మొగిలిచెర్లలో 1287.16 ఎకరాలు, ఖిలా వరంగల్‌ మండలం వసంతాపూర్‌లో 887.14 ఎకరాలు, గీసుకొండ మండలం వంచనగిరిలో 323.18 ఎకరాలు, ఖిలావరంగల్‌ మండలం గాడిపెల్లిలో 918.15 ఎకరాలు, సంగెం మంలం వెంకటాపూర్‌ హవేలిలో 216.39 ఎకరాలు, ఖిలా వరంగల్‌ మండలం బొల్లికుంటలో 1141.39 ఎకరాలు, సంగెం మండలం కాపులకనపర్తిలో 1032.35 ఎకరాలు, వర్దన్నపేట మండలం చెన్నారంలో 245.20 ఎకరాలు, ఐనవోలు మండలం పంథినిలో 697.01 ఎకరాలు, పున్నేలులో 1819.32 ఎకరాలు, దామెర మండలంలోని దామెరలో 22.14 ఎకరాలు, ఐనవోలు మండలం గరిమిళ్లపల్లిలో 78.07 ఎకరాలు, జఫర్‌గడ్‌ మండలం కూనూరులో 325.37 ఎకరాలు, ఐనవోలు మండలం వెంకటాపూర్‌లో 1607.12 ఎకరాలు, ధర్మసాగర్‌ మండలం ధర్మారంలో 1355.27 ఎకరాలు, ఐనవోలు మండలం కక్కిరాలపల్లిలో 243.10 ఎకరాలు, ధర్మసాగర్‌ మండలం పెదపెండ్యాలలో 167.06 ఎకరాలు, జఫర్‌గడ్‌ మండలం రఘునాథపల్లెలో 1175.14 ఎకరాలు, కాజీపేట మండలం రాంపూర్‌లో 384.26 ఎకరాలు, ఐనవోలులో 2179.14 ఎకరాలు, వరంగల్‌ మండలంలోని కొత్తపేటలో 1056.19 ఎకరాలు, వరంగల్‌ మండలం పైడిపెల్లిలో 544 ఎకరాలు ఉన్నాయి.
వంద‌ల ఎక‌రాల్లో వెంచ‌ర్లు, భూములు
వ‌రంగ‌ల్ మ‌హాన‌గ‌ర శివారులో వంద‌ల ఎక‌రాల్లో ప్రైవేట్ వెంచ‌ర్లు వెలుస్తున్నాయి. ఇందులో ఆ పార్టీ.. ఈ పార్టీ అనే సంబంధం లేకుండా.. అనేక మంది నేత‌ల‌కు భూములున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా అధికార పార్టీకి చెందిన కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు బినామీల పేర్ల‌పై భారీ స్థాయిలో భూములున్న‌ట్లు స‌మాచారం. అనేక వెంచ‌ర్లు కూడా కొంద‌రు బ‌డా నేత‌లు బినామీల‌తో న‌డిపిస్తున్న‌ట్లు స‌మాచారం. అంతేగాకుండా, రాజ‌కీయ నాయ‌కుల‌తోపాటు పెట్టుబ‌డిదారులు భారీ స్థాయిలో రైతుల నుంచి సాగుభూముల‌ను కొనుగోలు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే.. కుడా ర‌హ‌స్యంగా చేప‌ట్టిన స‌ర్వే స‌మ‌యంలోనే వారి వారి భూముల‌ను త‌ప్పించి, ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం ముందుకు వెళ్లిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అందుకే కుడా విడుద‌ల చేసిన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేష‌న్‌లో కొన్ని స‌ర్వే నంబ‌ర్లు లేక‌పోవ‌డంపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతేగాకుండా, భ‌విష్య‌త్‌లో కొంద‌రు బ‌డా బాబుల భూముల విలువ పెరిగేలా కుడా అధికారులు ల్యాండ్ పూలింగ్ స‌ర్వే చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే, రైతుల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌ల‌కు కుడా అధికారులు.. ఒక్కోసారి మిస్ అవుతుంటాయ‌ని స‌మాధానం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img