సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి
అక్షరశక్తి, హన్మకొండ : నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలం చెందారని సీపీఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి అన్నారు. ఎప్పుడు ఇళ్ల స్థలాలు ఇస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ హనుమకొండ మండల సమితి ఆధ్వర్యంలో మంగళవారం గుండ్ల సింగారం శివారులోని 174, 175 సర్వే నెంబర్లలో గల 24 ఎకరాల ప్రభుత్వ భూమిలో పార్టీ జెండా పాతి భూ పోరాటం నిర్వహించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కర్రె బిక్షపతి హాజరై మాట్లాడారు. పేదలకు సొంతింటి కలను నెరవేర్చడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయిందని, పేదలకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ విస్మరించారని అన్నారు.
పేదలు అనేక సంవత్సరాలుగా నగరంలో కిరాయి కట్టలేక దుర్భర జీవితం గడుపుతూ నానా అవస్థలు పడుతున్నారన్నారు. ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్స్ వచ్చేంత వరకూ భూ పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈక్రమంలోనే వందలాది మందితో గుండ్ల సింగారం ప్రభుత్వ భూమిలో ముళ్ళ పొదలు చదును చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు మద్దెల ఎల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యురాలు మంద సదాలక్ష్మి, రాములు, కర్రె లక్ష్మణ్, కొంటెపాక రవి, మునగాల బిక్షపతి, జగ్గు, రాజు గౌడ్, నిమ్మలం మనోహర్, సంధ్య, మమత, రాధిక, శైలజ, శివకుమార్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.