- అనేక ఏళ్లుగా విధుల్లో 30మంది
- మూడు నెలలుగా అందని వేతనాలు
- కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించని తెలంగాణ ప్రభుత్వం
- కనీసం అమలుకు నోచుకుని ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ
- ఇక థర్డ్‌పార్టీకి దిక్కే లేదు..
- అందని ప్రభుత్వ బెనిఫిట్స్
- తీవ్ర ఇబ్బందుల్లో కుటుంబాలు
అక్షరశక్తి, వరంగల్ తూర్పు: వాళ్లు కాంట్రాక్టు ఉద్యోగులు కాదు.. ఔట్‌సోర్సింగ్ సిబ్బందీ కాదు.. కనీసం థర్డ్‌పార్టీ కింద పనిచేస్తున్న వాళ్లు కూడా కానేకాదు.. చేస్తున్నది అత్యంత విలువైన పని.. కానీ.. గుర్తింపు మాత్రం అనామక సిబ్బంది. ఏదోఒక రోజు తమకూ మంచికాలం వస్తుందని, ప్రభుత్వం గుర్తిస్తుందన్న నమ్మకంతో వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో అనేక ఏళ్లుగా వెట్టిచాకిరి చేస్తున్నారు. స్వరాష్ట్రంలోనైనా తమ బతుకులు బాగుపడుతాయని కలలకన్నారు. కానీ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది ఏళ్లు కావొస్తున్నా.. వారిని పట్టించుకున్న వారే లేరు. వారికష్టసుఖాలు తెలుసుకున్న నాథుడే లేడు. పై అధికారుల, ఉద్యోగుల పెత్తనాన్ని భరిస్తూ.. గజగజ వణుకుతూ పనిచేసుకుంటూ వెళ్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఇస్తారో తెలియన దయనీయ పరిస్థితిని వారు ఎదుర్కొంటున్నారు.
30 మంది సిబ్బంది…
వరంగల్ సీకేఎం ప్రసూతి ఆస్పత్రిలో కొన్నేళ్ల కిందట కంప్యూటర్ ఆపరేటర్లు, ల్యాబ్‌టెక్నీషియన్లు, దోబీలు, ఓటీ సిబ్బంది కొరత ఏర్పడడంతో అప్పటి సూపరింటెండెంట్ తాత్కాలికంగా అతితక్కువ నెలవారీ వేతనంతో ప్రైవేట్ సిబ్బందిని తీసుకున్నారు. ప్రస్తుతం 30మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో పదిమంది కంప్యూటర్ ఆపరేటర్లు, ఎనిమిది మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఐదుగురు థియేటర్ బాయ్స్, ముగ్గురు దోబీలు పనిచేస్తున్నారు. వీరిలో కొంతమంది పదేళ్లకుపైగా పనిచేస్తూ వస్తున్నారు. వీరికి వేతనాలు చెల్లించేందుకు మొదట ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన వారి నుంచి సుమారు రూ.50 వసూలు చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆస్పత్రి డెవలప్‌మెంట్ నిధుల నుంచి సూపరింటెండెంట్ నెలవారీ వేతనాలు చెల్లించేవారు. అయితే.. ఆస్పత్రి అభివృద్ధి నిధుల నుంచి ప్రైవేట్ సిబ్బందికి జీతాలు ఇవ్వడం సరికాదని ఉన్నతాధికారులు చెప్పడంతో కొంతకాలంగా ఆరోగ్య శ్రీ నిధుల నుంచి వేతనాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇవ్వడం కూడా సరికాదనే టాక్ వినిపిస్తోంది.
ప్రగతి వెల్ఫేర్ సొసైటీ పేరుతో…
ఎలాంటి గుర్తింపు లేకుండా పనిచేస్తున్న నేపథ్యంలో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసి, ఆ సొసైటీ కింద ఆస్పత్రిలో ఈ సిబ్బంది పనిచేస్తున్నట్లు చూపిస్తున్నారు. ఇన్నేళ్లుగా పనిచేస్తున్నా.. కనీసం ఔట్‌సోర్సింగ్ కాదుకదా.. థర్డ్‌పార్టీ కింద కూడా లేకుండా పనిచేస్తున్నారు. దీంతో వారికి ప్రభుత్వం నుంచి అందే ఎలాంటి ప్రయోజనాలు అందకుండా పోతున్నాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి వేతనాలు కూడా పెంచడం లేదు. ఇప్పటికీ ల్యాబ్‌టెక్నీషియన్లకు, కంప్యూటర్ ఆపరేటర్లకు సుమారు రూ.6వేల నుంచి రూ.7వేల మధ్యలో వేతనాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా సిబ్బందికి మరింత తక్కువగా వేతనాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కొద్దిపాటి వేతనమైనా నెలనెలా ఇవ్వకపోవడం గమనార్హం. ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని గందరగోళ పరిస్థితులు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉన్న ధరలతో ఎలా బతకాలని ఆ సిబ్బంది లోలోపల తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. స్వరాష్ట్రంలో కూడా ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేయాల్సి రావడంపై సర్వత్రా విమర్శలు వచ్చిపడుతున్నాయి.