టైటిల్: ఆచార్య
బ్యానర్: కొణిదెల ఎంటర్టైన్‌మెంట్ – మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్
నటీనటులు: చిరంజీవి, రామ్‌చరణ్, పూజా హెగ్డే, సోనూసుద్, తనికెళ్ల భరణి
సినిమాటోగ్రఫీ: తిరుణావక్కరుసు
ఫైట్స్ : రామ్ లక్ష్మణ్ – విజయ్
ఎడిటర్: నవీన్ నూలి
మ్యూజిక్: మణిశర్మ
నిర్మాతలు: నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొరటాల శివ
పీఆర్వో: వంశీ కాకా, నాని
సెన్సార్ రిపోర్ట్: యూ / ఏ
రిలీజ్ డేట్ : 29 ఏప్రిల్, 2022
రన్ టైం : 154 నిమిషాలు
ప్రి రిలీజ్ బిజినెస్ ( వరల్డ్ వైడ్): 133 కోట్లు
ఆచార్య పరిచయం:
సైరా నరసింహారెడ్డి తర్వాత మూడేళ్లకుపైగా గ్యాప్ తీసుకొని మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఆచార్య.
కరోనా కష్టాలను దాటుకుని.. వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది ఆచార్య. కెరీర్‌లోనే ఫస్ట్ టైం చిరంజీవి, తనయుడు రామ్‌చరణ్ కలిసి నటించడం.. ఇటు వరుస విజయాల దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయడం.. పూజా హెగ్డే లాంటి హీరోయిన్ ఉండడం… చిరు నక్సలైట్ పాత్రలో కనిపించడంతో పాటు టీజర్లు, ట్రైలర్లు ప్రామీసింగ్‌గా ఉండడంతో ఆచార్యపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ అంచనాలు ఆచార్య ఎంత వరకు అందుకుందో TL సమీక్షలో చూద్దాం.
ఆచార్య కథ:
శతాబ్దాల చరిత్ర ఉన్న ధర్మస్థలి పట్టణాన్ని మునిసిపల్ చైర్మన్ బసవ ( సోనూసుద్ ) తన ముఠాతో ఆక్రమించుకుంటాడు. ధర్మస్థలిలో అంతా అధర్మమమే రాజ్యమేలుతూ ఉంటుంది. పాదఘట్టం పక్కనే ఉన్న సిద్ధవటం అడవిపై మైనింగ్ మాఫియా కన్ను పడుతుంది. వాళ్లకు బసవ సాయం చేసేందుకు పాదఘట్టాన్ని నాశనం చేసే ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలోనే బసవ సాయంతో అక్కడ ఉన్న పాదఘట్టం ప్రజలపై లేనిపోని నిందలు మోపి వారిని అక్కడ నుంచి తరిమి కొడతారు. ఆచార్య ( చిరంజీవి ) ధర్మస్థలి, పాదఘట్టం ప్రజలకు ఎలా ? అండగా ఉన్నాడు… అలాగే ప్లాష్‌బ్యాక్‌లో సిద్ధ ( రామ్‌చరణ్ ) కు ఆచార్యకు ఉన్న లింక్ ఏంటి ? నీలాంబరి ( పూజా హెగ్డే) ఎవరు.. ఆచార్య, సిద్ధ కలిసి ఆ ధర్మస్థలి, పాదఘట్టం ప్రజలను ఎలా సేవ్ చేశారు ? అన్నదే ఈ సినిమా స్టోరీ.
ఆచార్య విశ్లేషణ :
కొరటాల శివ సినిమాలు అన్ని కూడా అసలు స్టార్టింగ్‌తోనే ఎంతో ఆసక్తితో ఉంటాయి. ఆచార్య స్టార్టింగే చాలా అనాసక్తితో స్టార్ట్ అవుతుంది. దాదాపు 20 నిమిషాల కథ సాగుతున్న తీరే నీరసంగా ఉంటుంది. ఆ తర్వాత చిరు ఎంట్రీ ఇచ్చినా కూడా కథలో మలుపులు ఉండవు. కొరటాల శివ కాలం చెల్లిన కథ తీసుకుని పరమ రొటీన్ కథనంతో ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. అసలు సినిమా స్టార్ట్ అయిన 45 నిమిషాల తర్వాత కూడా సినిమాపై ఎంత మాత్రం ఆసక్తి లేదంటే వీక్ కథకు, మరింత నీరసమైన కథనం ఎంత విసుగు తెప్పిచిందో అర్థం చేసుకోవచ్చు. సినిమా ఫస్టాఫ్‌లో హీరో ఎంట్రీయే సింపుల్‌గా ఉంటుంది. అసలు ఈ తరహా సినిమాలు 1980వ దశకంలో కోదండ రామిరెడ్డి తీసేశాడు.. మనం చూసేశాం. ఫస్టాఫ్‌లో సంగీతతో సాంగ్ రెజీనాతో ఐటెం సాంగ్ పెట్టేసి ఏదో మమ అనిపించేశారు తప్ప ఏం లేదు.
ఉన్నంతలో సెకండాఫ్లో బంజారా సాంగ్‌తో పాటు ఆ సాంగ్‌కు ముందు వచ్చే ఫైట్ సీన్… అప్పటికే నీరసంగా ఉన్న ప్రేక్షకులకు కాస్త బూస్ట్ ఇచ్చాయి. చిరు – చెర్రీ చేసే నక్సలైట్ ఫైట్‌సైతం ఆకట్టుకోలేదు. కనీసం ఫైట్ మాస్టర్లను కూడా మాస్‌ను మెప్పించేలా వాడుకోకపోవడం డైరెక్టర్ చేతకాని తనానికి నిదర్శనం. నటీనటుల్లో కూడా ఈ సినిమాను ఎవ్వరూ కాపాడే స్కోప్ లేకుండా చేశాడు కొరటాల. ఓవరాల్ గా రామ్ చరణ్ పాత్ర ఒక్కటే కాస్త హైలెట్ అయ్యింది. అసలు చిరంజీవితో సినిమా అంటే ఏ రేంజ్‌లో ఎలివేషన్ సీన్లు పండాలి.
చివరకు రీమేక్ సినిమా అయిన ఖైదీ నెంబర్150 తో పాటు సైరా నరసింహారెడ్డిలో కూడా వినాయక్, సురేందర్‌రెడ్డి ఇద్దరూ తిరుగులేని ఎలివేషన్లు ఇచ్చారు. వాటితో పోలిస్తే కొరటాల శివ 10 శాతం ఎలివేషన్ కూడా చిరంజీవికి ఇవ్వలేదు. ఇక పూజా హెగ్డే పాత్ర సెకండాఫ్‌లో నీలాంబరి పాత్ర మినహా చేసింది లేదు.. చెప్పుకునేది లేదు. అసలు సోనూసుద్‌ను సినిమాలో బకరాను చేసి పడేశారు. వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్ ఎనలైజింగ్ :
అసలు ఇటీవల కాలంలో ఓ మోస్తరు సినిమాకు కూడా టెక్నికల్ వాల్యూస్ అదిరిపోతున్నాయి. ఆచార్యలో సినిమాటోగ్రఫీతో పాటు కొన్ని చోట్ల ఆర్ట్ వర్క్ మినహా మిగిలిన టెక్నికల్ వాల్యూస్ అన్ని పేలవంగా ఉన్నాయి. ఆ ఆర్ట్ వర్క్‌లోనూ ధర్మస్థలి, పాదఘట్టం సెట్స్ చూడడానికి మరీ అంత రిచ్‌గా కూడా లేవు. మణిశర్మ నేపథ్య సంగీతం మరీ రాడ్‌గా ఉంది. బీజీఎం ఘోరం. అసలు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ చిరు స్వయంగా మణిశర్మను ఎంపిక చేయడమే పెద్ద రాంగ్. అక్కడే సినిమా సగం పోయినట్లయ్యింది.
ఇక తిరు సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. ధర్మస్థలి సెట్‌ను సరైన లైటింగ్ మూమెంట్స్‌తో బాగా ప్రజెంట్ చేశాడు. టెక్నికల్ వాల్యూస్‌లో ఉన్నంతలో దీనికే కాసిన్ని మంచి మార్కులు పడతాయి. ఇక రచనలో
అసలు పట్టుమని మూడు, నాలుగు డైలాగులు కూడా పవర్‌ఫుల్‌గా లేవు అంటే కొరటాల, అతడి రచయితల టీం ఎంతలా ఫెయిల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఎడిటర్ నవీన్ నూలిని తప్పు పట్టడానికేం లేదు. బలహీనమైన సీన్లు ఇచ్చినా ఉన్నంతలో న్యాయం చేయడమే అతడు చేసిన మంచిపని.
కొరటాల శివ డైరెక్షన్ కట్స్:
దర్శకుడు కొరటాల శివ ప్రతి సినిమాలోనూ మంచి మెసేజ్ ఉన్న కథ ఉంటుంది. అసలు ఆచార్యలో బలమైన కథ లేదు. అసలు 1990వ దశకానికి ముందు ఈ తరహాలో ఇంతకన్నా బలమైన కథలను మనం చాలానే చూశాం. కథే సరిగా లేదనుకుంటే. కథనం మరింత ఘోరంగా ఉంది. అసలు ఈ సినిమా డైరెక్షన్ చూస్తే కొరటాలే తీశాడా ? లేదా అసిస్టెంట్ డైరెక్టర్లతో లాగించేశాడా ? అన్న సందేహాలు కూడా చాలా చోట్ల కలిగాయి. అసలు ఓ మోస్తరు నాలెడ్జ్ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చిరంజీవికి ఇంత నీరసనమైన ఎలివేషన్లు ఇవ్వడనే అనిపించింది. చిరంజీవి స్థాయికి తగిన కథ ఇది కానే కాదు.
ఇప్పటి వరకు అపజయం ఎరుగని కొరటాల శివ నుంచి మెగాభిమానులు మాత్రమే కాదు..ప్రతి ఒక్కరు చాలా ఆశించారు. అసలు కథపై ఏ మాత్రం పట్టులేకుండా పరమ రొటీన్ కథలో ఇద్దరు స్టార్ హీరోలను ఇరికించేశాడు. కొరటాల సినిమాలన్ని స్లోగానే ఉంటాయి. ఇందులోనూ ఆ కంప్లెంట్ ఉన్నా అసలు ఎమోషన్లు పండలేదు.. టేకింగ్ చూస్తే తప్పు పట్టిపోయి ఉంది. కొరటాల డైరెక్టర్‌గానే కాదు.. రచయితగా కూడా ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. మెగాభిమానులకే అంతంత మాత్రంగా ఆచార్య నచ్చిందంటే… ఇక సగటు సినీ అభిమానికి ఏం నచ్చుతుందని అనుకోవాలి. శివ ట్రాక్ రికార్డు చూస్తే మినిమం గ్యారెంటీ సినిమా ఆశిస్తారు. ఇక్కడ మినిమం గ్యారెంటీ కాదు కదా… ఇంత నిరాశపరిచే సినిమా ఇస్తాడని ఎవ్వరూ కలలో కూడా అనుకోలేదు.
ప్లస్ పాయింట్స్ ( + ) :
రామ్‌చరణ్ క్యారెక్టర్
భలే భలే బంజారా సాంగ్, మాస్ ఐటెం సాంగ్‌లు
ఆర్ట్ వర్క్
మైనస్ పాయింట్స్ ( – ) :
కొరటాల శివ కెరీర్‌లోనే పరమ వీక్ స్టోరీ
బలహీనమైన చిరంజీవి క్యారెక్టర్
ఎంటర్టైన్‌మెంట్ నిల్
డైరెక్షన్
ఫూర్ వీఎఫ్ ఎక్స్
నెరేషన్
కథలో ఏ మాత్రం మలుపులు లేకపోవడం
ఫైనల్‌గా…
ఆచార్య గురించి ఫైనల్‌గా చెప్పాలంటే ఓ బలహీనమైన 1980వ దశకంలో మనం చూసేసిన రొటీన్ స్టోరీ. దీనికి కొరటాల శివ పరమ వీకెస్ట్ టేకింగ్, బలహీనమైన రచన తోడవ్వడంతో చిరు, చరణ్ లాంటి క్రేజీ హీరోలు చేసిన ఆచార్య, సిద్ధ పాత్రలకు ఎంత మాత్రం న్యాయం జరగలేదు. చివరకు ఈ బలహీనమైన కథను చిరు, రామ్‌చరణ్ తమ భుజాల మీద ఎంత మోసినా నావ నడిసంద్రలోనే మునిగిపోయేలా ఉంది.
బాటమ్ లైన్ : ఆచార్య విలన్లకు చెప్పిన గుణపాఠం కాదు.. కొరటాల కళ్లు తెరిచి నేర్చుకోవాల్సిన గుణపాఠం
ఆచార్య TL రేటింగ్ : 2 / 5