Saturday, May 18, 2024

ఔరా! సైల‌స్

Must Read
  • కెన్యాలో స‌త్తాచాటుతున్న సీతంపేట బాలుడు
  • చ‌దువుతోపాటు క్రీడ‌ల్లోనూ సైల‌స్ రాణింపు
  • స్పీడ్ స్కేటింగ్‌, ర‌న్నింగ్‌, స్విమ్మింగ్‌లో అద్భుత ప్ర‌తిభ‌
  • రాష్ట్ర‌, జాతీయ స్థాయిలో బంగారు, కాంస్య‌ ప‌త‌కాలు
  • అథ్లెటిక్స్‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ‌

అక్ష‌ర‌శ‌క్తి, హ‌న్మ‌కొండ‌ : కెన్యాలో ఓరుగ‌ల్లు బాలుడు స‌త్తాచాటుతున్నాడు. చ‌దువుతోపాటు క్రీడ‌ల్లోనూ ప‌త‌కాల పంట పండిస్తున్నాడు. చిన్న వ‌య‌స్సులోనే స్పీడ్ స్కేటింగ్‌, ర‌న్నింగ్‌, స్విమ్మింగ్‌లో అత్యంత నైపుణ్యం సాధించి ఆదేశ రాష్ట్ర‌, జాతీయ స్థాయిలో మెరుస్తున్నాడు. ఆ బాలుడి ప్ర‌తిభ‌కు అబ్బుర‌ప‌డిన పాఠ‌శాల యాజ‌మాన్యం అథ్లెటిక్స్‌లో ప్ర‌త్యేక శిక్ష‌ణ ఇప్పిస్తోంది. ఆ బాలుడు మ‌రెవ‌రో కాదు హ‌న్మ‌కొండ జిల్లా హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లం సీతంపేట గ్రామానికి చెందిన గిన్నార‌పు దేవేంద‌ర్ – మేన‌క దంప‌తుల కుమారుడు సైల‌స్‌. దేవేంద‌ర్ సుమారు 15ఏళ్ల కింద‌ట కెన్యాకు వెళ్లి అక్క‌డే స్థిర‌ప‌డ్డారు. కెన్యా రాజ‌ధాని నైరోబిలో ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. దేవేంద‌ర్ – మేన‌క దంప‌తుల‌కు కుమారుడు సైల‌స్‌, కూతురు స‌ర్‌యూ ఉన్నారు. కుమారుడు సైల‌స్ నైరోబీలోని ఓశ్వాల్ పాఠ‌శాల‌లో ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు.

సైల‌స్ నాలుగేళ్ల వ‌య‌స్సు నుంచే స్పీడ్ స్కేటింగ్‌లో శిక్ష‌ణ పొందుతున్నాడు. గురువు మారియో వ‌ద్ద సైల‌స్ శిక్ష‌ణ పొందుతున్నాడు. ఈ క్ర‌మంలో అతి త‌క్కువ కాలంలోనే సైల‌స్ స్పీడ్ స్కేటింగ్‌లో మంచి నైపుణ్యం సాధించాడు. ఈ క్ర‌మంలో ఆ దేశంలో వివిధ స్థాయిల్లో జ‌రిగిన పోటీల్లో స‌త్తాచాటాడు. రాష్ట్రస్థాయిలో ఇప్ప‌టికే ఐదు బంగారు ప‌త‌కాలు, ఒక‌టి సిల్వ‌ర్‌, కాంస్య ప‌త‌కం సాధించాడు. ఇటీవ‌ల జ‌రిగిన జాతీయ పోటీల్లో అండ‌ర్ -11 విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించి ఔరా అనిపించాడు. కెన్యాలో జాతీయ స్థాయిలో కాంస్య ప‌త‌కం సాధించిన భార‌తీయ బాలుడిగా గుర్తింపు పొందాడు. ఈ సంద‌ర్భంగా కోచ్ మారియో మాట్లాడుతూ.. సైల‌స్‌ను జాతీయ క్రీడాకారుడిగా చూడాల‌న్న త‌న కోరిక నెర‌వేరింద‌ని, భ‌విష్య‌త్‌లో గొప్ప‌స్థాయికి చేరుకోవాల‌ని ఆకాంక్షించారు. అంతేగాకుండా, చ‌దువులోనూ సైల‌స్ అత్యంత ప్ర‌తిభ చూపిస్తున్నాడు. గ‌ణితంలో గ‌త ఏడాది పాఠ‌శాల స్థాయిలో బంగారు ప‌త‌కం సాధించి అంద‌రి ప్ర‌శంస‌లు పొందాడు. ప్ర‌స్తుతం ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న సైల‌స్ స్విమ్మింగ్‌, ప‌రుగు పందెంలోనూ త‌న స‌త్తా చాటుతున్నాడు. స్విమ్మింగ్‌లో ఇంట‌ర్‌స్కూల్ సిల్వ‌ర్ ప‌త‌కం, ర‌న్నింగ్‌లో బంగారు ప‌త‌కం సాధించాడు. ఈ క్ర‌మంలో స్వ‌చ్ఛందంగా పాఠ‌శాల యాజ‌మాన్య‌మే సైల‌స్‌కు ప్ర‌త్యేకంగా అథ్లెటిక్స్‌లో శిక్ష‌ణ ఇప్పిస్తున్నారు. ఇలా, కెన్యాలో అతిచిన్న వ‌య‌స్సులో స‌త్తాచాటుతున్న వ‌రంగ‌ల్ కుర్రోడిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. సొంత గ్రామం సీతంపేట‌లో కుటుంబ స‌భ్యులు, బంధువులు, గ్రామ‌స్తులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img