టాలివుడ్‌లో విషాదం.. సీనియర్ నటుడు శరత్‌బాబు కన్నుమూత
టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు (71) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. శరత్ బాబు మరణ వార్తతో టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలక్రితం శరత్ బాబు ఆరోగ్యం విషమంగా మారడంతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అయితే ఆరోగ్య పరిస్థితి కొంచెం విషమించడంతో బెంగళూరు నుంచి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఇవాళ మధ్యాహ్నం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో కన్నుమూశారు.
శరత్ బాబు అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. శరత్ బాబు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లాలోని, ఆముదాలవలస. అతనికి తొమ్మిది మంది అన్నదమ్ములు. శరత్ బాబుకి అగ్ర నటులు అయిన శివాజీ గణేశన్, కమల్ హాసన్, రజనీకాంత్, చిరంజీవి, శరత్ కుమార్ ఫ్యామిలీలతో మంచి అనుబంధం ఉంది.
1973లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శరత్ బాబు.. రామరాజ్యం అనే మూవీతో తొలిసారి ప్రేక్షకుల ముందుకుకొచ్చారు. నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగారు. మూడుముళ్ల బంధం, సీతాకోక చిలుక, సంసారం ఒక చదరంగం, అన్నయ్య, ఆపద్భాందవుడు లాంటి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. తెలుగులోనే కాకుండా దక్షిణాది ఇతర భాషా చిత్రాల్లో కూడా నటించి తన మార్క్ చూపించారు శరత్ బాబు. తమిళ, కన్నడ మలయాళ సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్స్ చేసి అక్కడ కూడా అభిమాన వర్గాన్ని ఏర్పరచుకున్నారు.
Must Read