- బీసీ వర్గాలకే కేటాయించే అవకాశాలు
- రేసులో ప్రముఖ న్యాయవాది అల్లం నాగరాజు
- సీరియస్‌గా పరిశీలిస్తున్న అధిష్ఠానం
- ఉత్కంఠగా పార్టీ శ్రేణుల ఎదురుచూపు
అక్షరశక్తి, వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ టికెట్ కేటాయింపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్థి ఎంపికపై పార్టీ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు పలువురు నాయకుల మధ్య పోటాపోటీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకే దాదాపు టికెట్ ఖాయమంటూ మొదటి నుంచీ ప్రచారం జరుగుతున్నా.. బీసీ ఎజెండాగా పార్టీ ముందుకు రావడం.. ఇదే సమయంలో మేమెంతో.. మాకంతా వాటా.. అంటూ బీసీ నినాదం బలంగా వినిపిస్తుండడంతో అధిష్ఠానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో మొదటి నుంచీ పార్టీలో కొనసాగుతున్న బలమైన బీసీ నేతను బరిలోకి దించాలన్న వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా స్థానికుడు, ప్రముఖ న్యాయవాది, బీసీ సామాజికవర్గానికి చెందిన పార్టీ నాయకుడు అల్లం నాగరాజు పేరును పార్టీ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. విద్యార్థి దశ నుంచే హిందూధర్మ పరిరక్షకుడిగా, తెలంగాణలోనే అతిపెద్ద గోశాల నిర్వాహకుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా.. అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ బీసీ సామాజికవర్గం నుంచి ఎదిగిన నేతగా గుర్తింపు ఉన్న అల్లం నాగరాజుకు కీలక నాయకులు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రదీప్‌రావును బుజ్జగించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం.
బలంగా బీసీ నినాదం..
ఈ ఎన్నికల్లో బీసీ నినాదం బలంగా వినిపిస్తోంది. మేమెంతో.. మాకంతా వాటా.. అంటూ సమావేశాలు, సభలతో బీసీ నాయకులు గళమెత్తుతూ ప్రధాన రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ కూడా బీసీ ఎజెండాగానే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీసీ వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇటీవల వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల కమిటీ కన్వీనర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అధ్యక్షతన పార్టీలకతీతంగా కుల సంఘాల అధ్యక్షులను, విద్యార్థి సంఘాల నాయకులను, ప్రజాసంఘాల నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీలకు రాజ్యాధికారం అనే నినాదంపై భారీ సదస్సు నిర్వహించారు. ఇందులో అల్లం నాగరాజు కీలక పాత్ర పోషించారు. అంతేగాకుండా, తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదిగా అల్లం నాగరాజు అత్యంత కీలక పాత్ర పోషించారు. పోలీసు లాఠీదెబ్బలు తిన్నారు. జైలుకు వెళ్లినా.. వెనకడుగు వేయకుండా ఉద్యమంలో ముందుకు కదిలారు. ఉమ్మడి హైకోర్టు విభజన కోసం ఉద్యమించి జైలుకు కూడా వెళ్లారు. విద్యార్థులపై అక్రమంగా నమోదు అయిన కేసులను వాదించేందుకు న్యాయవాద బృందంగా ఏర్పడి ఉచితంగా సేవలు అందించారు.
విద్యార్థి దశ నుంచే హిందూధర్మ పరిరక్షకుడిగా..
అల్లం నాగరాజు విద్యార్థి దశ నుంచే హిందూధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారు. ఏబీవీపీ విద్యార్థి నేతగా కొనసాగుతూనే… హిందూధర్మ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం, రాష్ట్రంలోనే అతిపెద్ద గోశాలను నాగరాజు నిర్వహిస్తున్నారు. వశిష్టిసూర్య పేరుతో గోశాలను పంథిని-కక్కిరాలపల్లిలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రతీనెల రెండుసార్లు యాగం నిర్వహిస్తున్నారు. దేశం నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు ఈ గోశాలను సందర్శించి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూ అనుబంధ ధార్మిక సంస్థలు కూడా నాగరాజుకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థి ఎంపికపై పార్టీ పెద్దలు సీరియస్‌గా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఒకటిరెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.