అక్షరశక్తి, హన్మకొండ : విన్న దానికన్నా చూసినది, చూసిన దానికన్నా చేసినది, అనుభవించినది.. ఎక్కువ కాలం మదిలో నిలిచిపోతుందని చెబుతారు మానసిక విశ్లేషకులు. విద్యావేత్తలు గట్టిగా నమ్మి ఈ సూత్రాన్ని పాటిస్తూ… అందుబాటులో ఉంటూ అధిక విజ్ఞానాన్ని, అవసరమైన పరిజ్ఞానాన్ని అందించే ఆకాశవాణి సాధనంతో 60 కార్యక్రమాలు రూపొందించి 28 సంవత్సరాలుగా తన విద్యా క్షేత్రంలో అనే కానేక మంది విద్యార్థులను “బాల కళాకారులుగా” తీర్చిదిద్దారు.. దిద్దుతున్నారు.. ఔత్సాహిక ఉపాధ్యాయులు సుతారి మురళీధర్. స్వతహాగా బాల సాహిత్య కారులైన వీరు బడి పాటలు, అక్షర స్వరాలు, దోమల పాటలు, ఓటరు చైతన్య గీతాలు, జెండా పాటలు, జానపద గీతాలు, సాంప్రదాయ గీతాల వంటి బాల సాహిత్య పుస్తకాలను రచించి నాటి జిల్లా కలెక్టర్లచే ఆవిష్కరింప చేశారు.
విభిన్న రీతిలో…
విద్యార్థులు చిన్ననాటి నుండి సున్నిత అంశాలను, సామాజిక అంశాలను, ముఖ్యంగా విషయపరమైన అంశాలను మూస పద్ధతిలో కాకుండా విభిన్న రీతిలో వింటే, అంటే, పాల్గొంటే తత్ విజ్ఞానం వారి స్మృతి పథంలో పది కాలాల పాటు పదిలంగా ఉండిపోతుంది. సత్ఫలాలను అందజేస్తుంది అనేది సుతారి మురళీధర్ ఆలోచన. అదే ఆలోచనను అక్షరాల అమలు పరచడానికి వీరు రూపకాలు, ఆత్మకథలు, శ్లోకాలు, పద్యాలు, ప్రసంగాలు, కోలాటాలు, ద్విపాత్రలు, ఏకపాత్రలు, హితోక్తులు, చలోక్తులు, నాటికలు, నానీలు, సంభాషణలు, కవితలు, కథానికలు, ఆత్మకథలు, చైతన్య గీతాలు, బాల కార్మిక, పర్యావరణ, కాలుష్య, విషయపరిజ్ఞాన, ఆరోగ్య, పల్స్ పోలియో, వయోజన విద్య, నీటి వినియోగం, శ్రామిక, ఓటరు, చైతన్య గీతాలు లాంటివి ఎన్నో సాహిత్య కళారూపాలను ఎన్నుకొని సులభమైన రీతిలో రేడియోస్క్రిప్టులను తయారు చేశారు. తదనంతరం విద్యార్థులకు కోలలు, కంజీర, గజ్జలు, డప్పు, డోలక్… లాంటి సాంప్రదాయ వాయిద్యాలతో ఈ స్క్రిప్ట్ అంశాలను శిక్షణ ఇస్తూ, కడు రమ్యంగా కదంబ కార్యక్రమాలను రూపొందించడం వీరి ప్రత్యేకత. విద్యార్థులచే సింగిల్ టేక్ లో కార్యక్రమాలు పూర్తిచేసి రేడియో కార్యనిర్వాహకులచే ప్రశంసలు పొందిన అనుభవాలు వీరికి ఉన్నాయి.
బాల్య దశలోనే
బాల్య దశలోనే ఇలాంటి సాహిత్య కళారూపాలతో మమేకమై, శిక్షణ పొందుతూ..”కళా ప్రదర్శనలు” ఆకాశవాణి లో ప్రదర్శించడం వల్ల వారిలో… శుచి, శుభ్రత, గౌరవ మర్యాదలు, సమాజంపై ప్రేమ, దేశభక్తి, ఆత్మవిశ్వాసం, ఆత్మసంతృప్తి, పౌరనీతి, రసానుభూతి, క్రమశిక్షణ, భూత దయ, పరిసర విజ్ఞానం, పని సంస్కృతి, శ్రమ విలువ, ఆరోగ్య, ఆహార నియమాలు, సున్నితత్వం, సృజనాత్మకత, అంటు వ్యాధులపై అవగాహన, సామాజిక బాధ్యత, సకాల స్పందన, తమ వంతు వచ్చేవరకు ఓర్పుతో ఆగడం, ఉత్తమ పౌరత్వం, మానవత్వం…వంటి ఎన్నో సుగుణాలు, ఎంతో విలువైన, వెలకట్టలేని “విలువలు” విద్యార్థులకు అలవడ తాయని, భవిష్యత్తుకు చక్కని దిశా నిర్దేశం పొందగలుగుతారని వివరించారు మురళీధర్.
రాష్ట్రస్థాయిలో ప్రశంసలు..
వందలాది నీతి పద్యాలు కథలు విషయ పరిజ్ఞానాన్ని పొందే బాల గీతాలు…ఇట్టే నే ర్చుకొని ఆకాశవాణిలో ప్రదర్శించిన వీరి శిష్యులు మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో అనే కానేక బహుమతులను, బంగారు పతకాన్ని, పొందారు. అలాగే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి విద్యాధికారులచే లండన్ బృందం చే ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాల ద్వారా పెంపొంది జ్ఞాపక శక్తి, ధారణ, విషయవగహనతో…. నవోదయ టి.ఎస్. రెసిడెన్షియల్ లాంటి పోటీ పరీక్షల్లో రాణించి సుమారు 70 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఈ మారుతున్న వేదవంతమైన కాలంలో విజ్ఞానం, విషయ జ్ఞానం, సామాజిక పరిజ్ఞానం, మౌల్య విద్యను ఆసక్తిగా విద్యార్థులకు అందించేందుకు “వరంగల్ ఆకాశవాణి “వారి సహకారంతో ఈ 60 కార్యక్రమాలను రూపొందించి విద్యార్థి లోకానికి సేవ చేసే లభించిందని చెబుతున్నారు మురళీధర్. వీరి భిన్న రీతి ఆలోచన, విభిన్న రీతి ప్రయోగం, మరింత గొప్పగా సాగి విద్యార్థి సమాజానికి ఉపయుక్తం కావాలని, వీరి కలం నుండి మరెన్నో సాహిత్య రచనలు జాలువారాలని కోరుకుందాం.