Saturday, May 4, 2024

ప్ర‌కృతి వైద్యానికి ప్రాణం ఆచార్య రామేశ్వ‌రం

Must Read
  • అంత‌రించిపోతున్న అరుదైన విజ్ఞానానికి
    ఊపిరిలూదుతున్న కేయూ రిటైర్డ్ ప్రొఫెస‌ర్‌
  • దేశీయ వైద్యానికి కేరాఫ్‌గా సామాజిక శాస్త్ర‌వేత్త‌
  • మూడున్న‌ర ద‌శాబ్ధాలుగా పుస్త‌కాల సేక‌ర‌ణ‌
  • సొంతింట్లోనే ఉన్నతమైన లైబ్రరీ ఏర్పాటు
  • ప్రపంచంలోనే తొలి పరిశోధనా కేంద్రం
  • వేలకొద్ది పుస్తకాల స‌మాహారం
  • ప్ర‌భుత్వాలు చేయాల్సిన ప‌నిని ఒక్క‌రే చేసిచూపిన జిజ్ఞాసి
  • జూలై 24న ప్ర‌కృతి వైద్య గ్రంథాల‌య వార్షికోత్స‌వం
    సంద‌ర్భంగా అక్ష‌ర‌శ‌క్తి ప్ర‌త్యేక క‌థ‌నం

ప్రకృతి వైద్యానికి ఆ ఆచార్యుడు ప్రాణం పోస్తున్నారు. అవిరాల కృషి, అవిశ్రాంత శ్రమతో దేశీయ వైద్యానికి పెద్దపీట వేస్తున్నారు. దేశ విదేశాల ప్రకృతి విజ్ఞాన సంపదను ప్రోదిచేసిన కృషివలుడాయన. ఆయనే ఆచార్య గజ్జల రామేశ్వరం. కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు. తాను రిటైర్మెంట్ అయినా తన అభిరుచికి విరమణ లేదంటూ అత్యంత విలువైన ప్రకృతి వైద్య విద్యా భాండాగారాన్ని తన సొంత ఖర్చులతో తన ఇంటిలోనే నెలకొల్పారు. ప్ర‌పంచంలోనే తొలిసారిగా హ‌న్మ‌కొండ‌లో అంత‌ర్జాతీయస్థాయి ప‌రిశోధ‌నా కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌బోతున్నారు. నిరాద‌ర‌ణ‌కు గురైన ప్రకృతి వైద్య విధానానికి ఊపిరులూదుతూ.. ప్రకృతి వైద్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు త‌న జీవితాన్ని అంకితం చేశారు రామేశ్వరం. తన తండ్రి అందించిన పాదముద్రలతో తనదైన ముద్రను కొనసాగిస్తున్నారు. జూలై 24 ప్ర‌కృతి వైద్య గ్రంధాల‌యం వార్షికోత్స‌వం సంద‌ర్భంగా అక్ష‌ర‌శ‌క్తి ప్ర‌త్యేక క‌థ‌నం..

తొమ్మిది భాష‌ల పుస్త‌కాలు..

ప్రకృతి వైద్యానికి సంబంధించి ఆ ఇల్లే ఓ లైబ్ర‌రీ.. అక్క‌డ దొర‌క‌ని పుస్తకం లేదు. ఆ అరల్లో కనిపించని పరిశోధన పత్రం ఉండదు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, ఉర్దూ, అరబ్బీ, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇంగ్లిష్‌ మొదలైన భాషల పుస్తకాల‌న్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రతి పుస్తకం విలువైందే.. ప్రతి కాగితం అమూల్యమే. ప్రతి అరలో అపార విజ్ఞాన‌మే. వేలకొద్ది పుస్తకాలు, వందలాది పరిశోధన పత్రాలు. అం తర్జాతీయ సదస్సుల్లో వెలువరించినవి కొన్ని.. పాత పుస్తకాల మార్కెట్‌లోనూ దొరకని ప్రాచీన గ్రంథాలు మరికొన్ని. కేయూ విశ్రాంత ఆచార్యులు గజ్జల రామేశ్వరం జీవితకాల కృషి ఫలితం ఈ ప్రకృతి విజ్ఞాన సంపద. 1989 నుంచి త‌న నిర్విరామ కృషితో ఈ ఘ‌న‌త సాధించారు గ‌జ్జ‌ల రామేశ్వ‌రం. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేయాల్సిన ప‌నిని త‌న ఆస‌క్తి, అభిరుచి మేర‌కు ఒంట‌రిగా చేశారు. ప్రకృతి వైద్యంపై అంతర్జాతీయస్థాయి సాహిత్యాన్ని సేకరించారు.

వ్య‌క్తే వ్య‌వ‌స్థ‌గా మారి..

మహబూబాబాద్‌ జిల్లా కురవి మండ‌ల కేంద్రం గజ్జల రామేశ్వరం స్వగ్రామం. 1956 సెప్టెంబ‌ర్ 5న గ‌జ్జ‌ల బాల‌య్య‌- నాగ‌మ్మ దంప‌తుల‌కు జ‌న్మించారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టి, క‌న్నీళ్లు, క‌ష్టాల మ‌ధ్యే అంచెలంచెలుగా ఎదిగారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేష‌న్‌లో పీజీ పూర్తి చేసిన ఆయ‌న కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, ఆరోగ్యపాలనపై పీహెచ్‌డీ చేశారు. ఆ సమయంలోనే ప్రకృతి వైద్య విధానం వివ‌క్ష‌కు గుర‌వుతున్న విషయాన్ని గ్రహించారు. ఓ వెలుగు వెలిగిన సంప్రదాయ విధానానికి ఆ దుస్థితి దాపురించడం రామేశ్వరాన్ని ఆలోచింప‌జేసింది. క్రమంగా ప్రకృతి వైద్య విధానంపై ఆసక్తి పెంచుకున్నారు. దానికి సంబంధించిన పుస్తకాలను సేకరించడం మొద‌లుపెట్టారు. ఈక్ర‌మంలోనే 1989 నుంచి ప్రకృతి వైద్యంపై వెలువడిన దాదాపు అన్ని పుస్తకాలనూ, జ‌ర్న‌ల్స్ సేకరించారు. అందుకోసం జీతంలో కొంత డబ్బు పక్కనపెట్టారు. ఇప్పుడు కూడా తాను తీసుకునే పింఛన్‌లో కొంత శాతాన్ని ప్రకృతి వైద్య సాహిత్యానికి కేటాయిస్తున్నారు.

జాతీయస్థాయి నేచురోప‌తి లైబ్ర‌రీ

ఒక‌ప్పుడు రాడిక‌ల్ ఉద్య‌మానికి, త‌ర్వాత ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మానికి వేదికైన కాక‌తీయ యూనివ‌ర్సిటీ నుంచి ఆచార్య గజ్జెల రామేశ్వ‌రం మ‌రో నిరౌషధ‌ వైద్య సాహిత్య ఉద్య‌మానికి సిద్ధ‌మ‌య్యారు. సామాజిక శాస్త్రవేత్త అయిన రామేశ్వ‌రం.. దేశీయ వైద్యానికి కేరాఫ్‌గా మారారు. ప్ర‌పంచ ప్ర‌కృతి వైద్య సాహిత్య పున‌రుజ్జీవ‌న ఉద్య‌మానికి క‌దిలారు. డాక్ట‌ర్ కాని డాక్ట‌ర్‌గా అవ‌త‌రించారు. ఈక్ర‌మంలోనే హనుమకొండలోని తన ఇంట్లోనే ప్రత్యేకంగా గదులను నిర్మించి 2018 జూలై 24న జాతీయస్థాయి నేచురోపతి లైబ్రరీ ప్రారంభించారు. ఆ త‌ర్వాత 2021 నుంచి ఈ లైబ్ర‌రీని అంతర్జాతీయ గ్రంధాల‌యంగా తీర్చిదిద్దారు. 2024 నుంచి అంత‌ర్జాతీయ ప‌రిశోధ‌నా కేంద్రంగా విస్త‌రించబోతున్నారు. ఈసంద‌ర్భంగా త‌న ప‌రిశోధ‌నా గ్రంధాన్ని ఆవిష్క‌రించ‌నున్నారు రామేశ్వ‌రం. లైబ్రరీని చూసేందుకు వచ్చే వారి కోసం ఇంటిపై రెండు గదులు ఏర్పాటుచేశారు. ఈ లైబ్రరీలో సమాచారం కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచేగాక విదేశీ పరిశోధకులూ సైతం హ‌న్మ‌కొండ‌కు వస్తుండ‌టం గ‌మ‌నార్హం. 1790 నుంచి ప్ర‌పంచ దేశాల్లోని పుస్త‌కాల‌న్నింటినీ సేక‌రించి భద్ర‌ప‌ర్చారు రామేశ్వ‌రం. దాదాపు 3 వేల పుస్త‌కాలు, 4 వేల సంచిక‌లను అందుబాటులో ఉంచారు. ప్ర‌భుత్వాల‌కే తెలియ‌ని జాతీయ‌, అంత‌ర్జాతీయ ప‌త్రిక‌లు, ప్ర‌కృతి వైద్య సాహిత్యాన్ని అణ్వేషించి, సేక‌రించారు.

తండ్రి స్ఫూర్తితో..

గ‌జ్జ‌ల రామేశ్వరం తండ్రి బాల‌య్య కురవి ప్ర‌భుత్వ పాఠశాలలో అటెండర్‌గా ప‌నిచేసేవారు. ఆ ఊళ్లో మొదటి ప్రభుత్వ ఉద్యోగి ఈయనే. 1930 నుంచి 1971 వ‌ర‌కు (41 సంవ‌త్స‌రాలు) ఒకే పాఠ‌శాల‌లో నిరాటంకంగా చ‌ప్రాసీగా ప‌నిచేశారు. ఆ కాలంలో బాల‌య్య వేలాది మంది విద్యార్థుల‌ను బ‌డిబాట ప‌ట్టించారు. వంద‌లాది మంది జీవితాల్లో విద్యావెలుగులు నింపారు. విద్యార్థుల‌తోపాటు ఉపాధ్యాయులు, ప్ర‌ధానోపాధ్యాయులు సైతం బాల‌య్య‌ను చ‌ప్రాసీ సార్ అని పిలిచేవారంటే ఆయ‌న వృత్తి నిబ‌ద్ధ‌త‌ను అర్థం చేసుకోవ‌చ్చు. తండ్రి స్ఫూర్తితోనే రామేశ్వ‌రం ఉన్నత విద్యను అభ్య‌సించారు. రామేశ్వరం భార్య ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే ఆయన ప్రకృతి వైద్య లైబ్రరీ ఏర్పాటు చేశారు. ప్రకృతి వైద్యంపై ఐదు పుస్తకాలు రాశారు. దేశీయ వైద్య విధానాలపై 20 జాతీయ, అంత‌ర్జాతీయ సెమినార్ల‌లో ప్ర‌సంగించారు. ప్రకృతి వైద్యంపై తొలి నిఘంటువు రూపొందించారు. ‘ఆరోగ్య సాధనం’ అనే పత్రికనూ నడుపుతున్నారు. పుస్తకాల సేకరణ, రచనతోపాటు అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో ప్రకృతి వైద్యంపై పరిశోధన పత్రాలను సమర్పించారు. ఈక్ర‌మంలోనే త‌న త‌ల్లిద్రండులైన బాల‌య్య‌-నాగ‌మ్మ జ్ఞాప‌కార్థం వారి పేరున కాక‌తీయ యూనివ‌ర్సిటీ సైకాల‌జీ డిపార్ట్‌మెంట్‌లో మెరిట్ స్టూడెంట్‌కు ప్ర‌తి సంవ‌త్సరం గోల్డ్ మెడ‌ల్ అందిస్తున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img