Tuesday, June 25, 2024

స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

Must Read
  • దేశంలో 18ల‌క్ష‌ల మంది రైల్వే పెన్ష‌న‌ర్లు ఉన్నారు
  • 80ఏళ్లు దాటిన వారికి ఇంటికి మందులు పంపించాలి
  • ఆస్ప‌త్రుల్లో ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించాలి
  • నిలిపివేసిన 18నెల‌ల డీఏ విడుద‌ల చేయాలి
  • ఏఐఆర్ఆర్ఎఫ్ సికింద్రాబాద్ జోన‌ల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ర్ర యాద‌వ‌రెడ్డి

దేశంలో సుమారు 18ల‌క్ష‌ల మంది రైల్వే పెన్ష‌న‌ర్లు ఉన్నారు. వారంద‌రూ అనేక స‌మ‌స్య‌ల‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ప్ర‌ధానంగా క‌రోనా స‌మ‌యంలో నిలిపివేసిన 18నెల‌ల డీఏను వెంట‌నే చెల్లించాలి. 80ఏళ్ల వ‌య‌స్సు దాటిన పెన్ష‌న‌ర్ల‌కు ఇంటికే మందులు పంపించాలి. ఆస్ప‌త్రుల‌కు వెళ్లిన‌ప్పుడు ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించి, వైద్యం అందించాలి.. అని అంటున్నారు ఏఐఆర్ఆర్ఎఫ్‌( ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్స్ ఫెడ‌రేష‌న్‌) సికింద్రాబాద్ జోన‌ల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ర్ర యాద‌వ‌రెడ్డి. ఇటీవ‌ల సికింద్రాబాద్‌లో నిర్వ‌హించిన ఏఐఆర్ఆర్ఎఫ్ 57వ జాతీయ మ‌హాస‌భ‌లు విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో అక్ష‌ర‌శ‌క్తితో ఆయ‌న ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. పెన్ష‌న‌ర్ల స‌మ‌స్య‌లు, మ‌హాస‌భ‌ల్లో చ‌ర్చించిన అంశాల‌పై ఆయ‌న మాట్లాడారు. – అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి

ప్ర‌శ్న‌: రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లేమిటి..?
జ‌వాబు: భార‌త‌దేశ వ్యాప్తంగా ఈనాటికి సుమారు 18ల‌క్ష‌ల మంది రైల్వే పెన్ష‌న‌ర్లు ఉన్నారు. స‌ర్వీసులో ఉన్న కార్మికుల సంఖ్య 10ల‌క్ష‌ల‌. ఇంకా రెండున్న‌ర ల‌క్ష‌ల ఖాళీలు ఉన్నాయి. భార‌త‌దేశంలో ఏఐఆర్ఆర్ఎఫ్‌( ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్స్ ఫెడ‌రేష‌న్‌) 1959లో ఏర్ప‌డింది. ఓల్డెస్ట్, లార్జెస్ట్ ఆర్గ‌నైజేష‌న్ ఇది. ప్ర‌స్తుతం రైల్వే పెన్ష‌న‌ర్లు అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. మొద‌టిగా క‌రోనా స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం 18 నెల‌ల డీఏలు ఆపింది. ఆపిన డీఏను వెంట‌నే విడుద‌ల చేయాలి. 80ఏళ్లు దాటిన పెన్ష‌న‌ర్లు ఆస్ప‌త్రుల‌కు వెళ్ల‌లేక తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వారంద‌రికీ వైద్యం నిమిత్తం ఇంటికే మందులు స‌ప్ల‌య్ చేయాలి. భార‌త‌దేశ వ్యాప్తంగా వందేళ్ల వ‌య‌స్సు దాటిన ఆరువేల మంది పెన్ష‌న‌ర్లు ఉన్నారు. వ‌య‌స్సు రీత్యా వారు క‌ద‌ల్లేరు క‌నుక సుప్రీం కోర్టు ఆదేశాల ప్ర‌కారం ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి సీనియ‌ర్ సిటిజ‌న్ల‌ను గౌర‌వ‌ప్ర‌దంగా చూడాలి. ఆస్ప‌త్రుల‌కు వెళ్లిన‌ప్పుడు..ప్ర‌త్యేక స‌దుపాయాలు క‌ల్పించాలి. పెన్ష‌న్ ఆదాల‌త్‌లు షెడ్యూల్ ప్ర‌కారంగా నిర్వ‌హించి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అధికారులు కృషి చేయాలి.

ప్ర‌శ్న : ఇటీవ‌ల నిర్వ‌హించిన జాతీయ మ‌హాస‌భ‌ల్లో ఎలా జ‌రిగాయి..?
జ‌వాబు : సికింద్రాబాద్‌లోని రైల్ క‌ళారంగ్‌లో రెండు రోజుల‌పాటు నిర్వ‌హించిన 57వ జాతీయ మ‌హాస‌భ‌లు( Annual General Body Meeting ) విజ‌య‌వంతం అయ్యాయి. దేశం నలుమూల‌ల నుంచి అంటే 18జోన్లు, 70 డివిజ‌న్ల నుంచి ప్ర‌తినిధులు సుమారు రెండువేల మంది హాజ‌ర‌య్యారు. ఈ స‌భ‌లు ఏఐఆర్ఆర్ఎఫ్ జాతీయ అధ్య‌క్షులు ఎస్ శ్రీ‌ధ‌ర్ అధ్య‌క్ష‌త కొన‌సాగాయి. మొద‌టి రోజు ఈ మ‌హాస‌భ‌ల్లో తెలంగాణ ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు బోయిన‌పెల్లి వినోద్‌కుమార్ పాల్గొని మాట్లాడారు. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌ను ఈ స‌మాజం గౌర‌వ ప్ర‌దంగా చూడాల‌ని, ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సూచిస్తూ రైల్వేరంగం చాలా ప్ర‌తిష్టాక‌ర‌మైన సేవ‌లు అందిస్తున్న సంస్థ అని, ఈ సంస్థ‌ను కాపాడుకోవాల‌ని, అప్పుడు మాత్ర‌మే ఎస్సీ, ఎస్టీల‌కు రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పారు. ఆయ‌న మాట‌లు స‌భ‌కు చైత‌న్య స్ఫూర్తిని నింపాయి. ఈ స‌భ‌ల్లో సౌత్ సెంట్ర‌ల్ రైల్వే మ‌జ్దూర్ యూనియ‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సీహెచ్ శంక‌ర్‌రావు పాల్గొని మాట్లాడారు. కార్మికులంద‌రికీ సంఘీభావం తెలిపారు. అలాగే, హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్ ద‌త్తాత్రేయ పాల్గొని పెన్ష‌న‌ర్ల‌ను ఉద్దేశించి మాట్లాడారు. గ‌తంలో తాను కార్మిక శాఖ మంత్రిగా రైల్వేశాఖ మంత్రిగా ప‌నిచేశాన‌ని, కార్మికుల క‌ష్టాలు తెలిసిన వాడిగా స‌మ‌స్య‌ల ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి, రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్క‌రించ‌డానికి కృషి చేస్తాన‌ని ఆయ‌న చెప్ప‌డం స‌భ‌కు ఉత్సాహాన్ని ఇచ్చింది.

ప్ర‌శ్న‌: కేంద్ర ప్ర‌భుత్వం, రైల్వే బోర్డు ముందు మీ డిమాండ్స్‌..?
జ‌వాబు : దీర్ఘ‌కాలికంగా పెండింగ్‌లో ఉన్న క‌నీస‌ పింఛ‌న్ 3.6 ఫార్ములా అమ‌లు చేయాలి. క‌రోనా స‌మ‌యంలో ఆపిన‌ 18 నెల‌ల డీఏను వెంట‌నే చెల్లించాలి. హాస్పిట‌ల్ మేనేజ్‌మెంట్ ఇన్‌ఫ‌ర్మెష‌న్ సిస్ట‌మ్‌ను మెరుగుప‌ర్చి, పెన్ష‌న‌ర్ల‌కు అందుబాటులోకి తీసుకురావాలి. సెకండ‌రీ ఫ్యామిలీ పింఛ‌న్ కేసుల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాలి. మెడిక‌ల్ అల‌వెన్స్ రూ.వెయ్యి నుంచి రూ.3వేల‌కు పెంచాలి. పెన్ష‌న‌ర్లకు వ‌యోభారంతో వ‌స్తున్న వైద్య అవ‌స‌రాల రీత్యా ఆరు నెల‌ల‌కు ఒక‌సారి మెడిక‌ల్ క్యాంపులు నిర్వ‌హించాలి. 18ల‌క్ష‌ల మందికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఏఐఆర్ఆర్ఎఫ్‌కు బ్రాంచ్‌, డివిజ‌న్, జోన‌ల్ స్థాయిల్లో ఆఫీస్ అకామ్డేష‌న్ ఏర్పాటు చేయాలి. పెరుగుతున్న ఖ‌ర్చుల రీత్యా పెన్ష‌న‌ర్ల‌కు కూడా ఇంటి అద్దె అల‌వెన్స్ ఇవ్వాలి. ప్ర‌తీ ఐదేళ్ల‌కోసారి చ‌ట్ట‌ప్ర‌కారం పింఛ‌న్ పెంచాలి. ఆప‌ద్కాల స‌మ‌యంలో, ప్రాణ‌ప్రాయ స్థితిలో క్రానిక్ జ‌బ్బుల‌తో బాధ‌ప‌డుతున్న వారికి రైల్వే రిక‌గ్నైజ్డ్ ఆస్ప‌త్రుల్లో వెంట‌నే చికిత్స అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. సుమారు 17 తీర్మానాల‌ను మ‌హాస‌భ‌ల్లో ఏక‌గ్రీవంగా ఆమోదించి, ప్ర‌భుత్వానికి, రైల్వే బోర్డుకు నివేదించ‌డానికి తీర్మానం చేశాం. ఈ మ‌హాస‌భ‌ల్లో ఏఐఆర్ఆర్ఎఫ్ అధ్య‌క్షుడిగా ఎస్ శ్రీ‌ధ‌ర్‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నాం. జాతీయ కార్య‌వ‌ర్గాన్ని కూడా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నాం.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img