మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
అక్షరశక్తి, జనగామ, ఏప్రిల్ 05: బాబూ జగ్జీవన్ రామ్115 వ జయంతి సందర్భంగా జనగామలో ఆయన విగ్రహానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాబా సాహెబ్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ ల స్ఫూర్తి తోనే తెలంగాణ పాలన కొనసాగుతోందని అన్నారు.
దళితుల కోసం తమ జీవితాలనే ధార పోశారని, వారి జీవితాలు భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. వారి స్ఫూర్తిని నింపుకొన్న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దళితుల ఆత్మ బంధువుగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. దళితులు సీఎం కెసిఆర్ ను కాపాడుకోవాలని సూచించారు. తెలంగాణ రైతాంగం పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్షను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.