- టీ పీసీసీ ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్య
- కేయూలో బాబూజీ విగ్రహానికి ఘన నివాళి
అక్షరశక్తి, హన్మకొండ: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత దొమ్మటి సాంబయ్య అన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ 117వ జయంతిని పురస్కరించుకొని కాకతీయ యూనివర్సిటీలో గల బాబూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా జగ్జీవన్ రామ్ సేవలను సాంబయ్య స్మరించుకున్నారు. అత్యంత పేదరికంలో జన్మించినజగ్జీవన్ రామ్ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని పేర్కొన్నారు. జాతీయోద్యమంలో పాల్గొన్న ఆయన రాజ్యాంగ పరిషత్ సభ్యునిగానూ సేవలందించారని, స్వాతంత్య్రానంతరం తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మంత్రివర్గంలో తొలి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కార్మిక సంక్షేమానికి పాటుపడ్డారన్నారు. కార్మిక పక్షపాతిగా గుర్తింపు పొందిన బాబూజీ రెండు దఫాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగానూ సేవలు అందించారని తెలిపారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, విద్యార్థి నేతలు తదితరులు ఉన్నారు.
మాదిగలకే ఎంపీ టికెట్ కేటాయించాలంటూ వినతి
వరంగల్ పార్లమెంట్ స్థానాన్ని మాదిగలకు కేటాయించి సామాజిక న్యాయం చేయాలని బహుజన విద్యార్థి సంఘాల నాయకులు కోరారు. బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కాకతీయ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బహుజన విద్యార్థి నాయకుడు దూడపాక అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ స్వాతంత్రానంతరం ఉప ప్రధానిగా బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. వరంగల్ పార్లమెంటు స్థానాన్ని మాదిగలకు కేటాయించి సామాజిక న్యాయం చేయాలని కోరారు. ఈమేరకు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ ఏబీఎస్ఎఫ్ అధ్యక్షులు మచ్చ పవన్ కళ్యాణ్, పరకాల ఎస్ సి సెల్ సలహా దారులు పురెళ్ళ సిద్దు, అజయ్, పృథ్వీరాజ్, సాయి, మల్లికార్జున, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.