అందరూ చూస్తుండగానే తల్లీకొడుకుల హత్య
మంత్రాల నెపంతో రాడ్డుతో కొట్టిచంపిన నిందితుడు
అక్షరశక్తి, గూడూరు : మహబూబాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మంత్రాల నెపంతో తల్లి, కుమారుడిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాదకర ఘటన గూడూరు మండలం కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… గూడూరు మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన తల్లి ఆలకుంట్ల సమ్మక్క (50), ఆమె కుమారుడు ఆలకుంట్ల సమ్మయ్య(35)లను ఇదే గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి కుటుంబం మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. తమ కుటుంబ సభ్యులపై మంత్రాలు చేస్తున్నారంటూ వారిపై శివరాత్రి కుమారస్వామి కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం గూడూరు మండల కేంద్రంలో అందరూ చూస్తుండగానే.. తల్లి సమ్మక్కను, ఆమె కొడుకు సమ్మయ్యను కుమార స్వామి రాడ్డుతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సమ్మయ్యకు భార్య జ్యోతి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.