- పోలీస్ కొలువే లక్ష్యంగా సాధన
- నచ్చలేదని వచ్చిన ఉద్యోగాన్ని వదులుకున్న వైనం
- తనలాంటి వారిని డిపార్ట్‌మెంట్లోకి పంపాలని నిర్ణయం
- రామప్ప పేరుతో హన్మకొండలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు
- వందలాది మంది యువకులను
పోలీసులుగా తీర్చిదిద్దుతున్న అయిలి చంద్రమోహన్ గౌడ్ - వందలాది మందికి ఉపాధి.. వేలాదిమందికి ఆదర్శం
- అక్షరశక్తితో చంద్రమోహన్ గౌడ్ ముఖాముఖి
పోలీస్ కొలువు సాధించాలనేది ఆయన కల.. ఇందుకోసం హైదరాబాద్‌లో పేరుమోసిన ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందాడు. రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ఉద్యోగమైతే వచ్చింది కానీ, కోరుకున్న కొలువు మాత్రం దక్కలేదు.. దీంతో నచ్చలేదని వచ్చిన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. మరో ప్రయత్నం చేద్దామంటే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పరిస్థితులు అనుకూలించలేదు. ఈ ప్రతికూల పరిస్థితుల మధ్యే విభిన్నమైన ఆలోచన చేశాడు. తాను పోలీస్ కాకపోయినప్పటికీ తనలాంటి వాళ్లను ఎంతోమందిని పోలీస్‌లుగా తయారు చేయాలనుకున్నాడు. పోలీస్ ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌కే పరిమితమైన కోచింగ్ సెంటర్‌ను వరంగల్ లో ఏర్పాటు చేశారు. సక్సెస్ అయ్యారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప పేరుతో హన్మకొండలో కోచింగ్ సెంటర్ స్థాపించారు. అనేక మంది యువకులను కానిస్టేబుళ్లుగా, ఎస్సైలుగా తీర్చిదిద్దుతున్నారు. వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన మరెవరోకాదు రామప్ప కోచింగ్ సెంటర్ అధినేత ఐలు చంద్రమోహన్ గౌడ్.. ఇవాళ పోలీస్ ఉద్యోగం రావాలంటే… రామప్ప ఇన్‌స్టిట్యూట్‌కు పోవాలె.. అనే అంతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. ఉత్తర తెలంగాణలో ఏ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా తన శిష్యులొక్కరైనా పోలీస్ ఉంటారని గర్వంగా చెబుతున్న చంద్రమోహన్ గౌడ్‌తో అక్షరశక్తి ముఖాముఖి ఆయన మాటల్లోనే..
నాన్నగారి ఆలోచన మేరకు ..
మాది ములుగు జిల్లా వెంకటాపూర్.. నాన్న నాగేశ్వర్‌రావు రిటైర్డ్ హైస్కూల్ హెడ్‌మాస్టర్, అమ్మ లీలావతి.. ఇద్దరు తమ్ముళ్లు.. భార్యపేరు నీరజ.. ములుగు కాకతీయ పబ్లిక్ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివా. అక్కడే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ కంప్లీట్ అయింది. హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో 2001లో డిగ్రీ పూర్తి చేశా. ఎస్సై కావాలనే పట్టుదలతో 2004లో హైదరాబాద్ వెళ్లా. నాతోపాటు ప్రస్తుతం కామేపల్లిలో సీఐగా చేస్తున్న అన్నం కిరణ్, కరీంనగ్‌లో సీఐగా చేస్తున్న సంపత్ ముగ్గురం కలిసి రూం అద్దెకు తీసుకుని సక్సెస్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యాం… చాలా కష్టపడి చదివాం.. 32 పోస్టులకుగాను నాకు ఢిల్లీ సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది. అయితే.. ఆ జాబ్ ఇష్టంలేక వదులుకున్నా. ఎలాగైనా స్టేట్ పోస్టు కొట్టాలనే గట్టిగా ప్రయత్నించా.. కుదరకపోవడంతో ఇక ప్రయత్నం విరమించుకున్నా. సక్సెస్ ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుంటున్నప్పుడే ఫిజికల్ ఫ్యాకల్టీగా పనిచేశా. ఆ అనుభవంతోనే నాన్నగారి ఆలోచన మేరకు స్వంతంగా హన్మకొండలో 2006లో కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశా.
కట్నం పైసలతోనే కోచింగ్ సెంటర్ ..
2006లో అప్పటి ములుగు ఎమ్మెల్యే పోదెం వీరయ్య హన్మకొండలో రామప్ప కోచింగ్ సెంటర్‌ను ప్రారంభించడం ఎప్పటికీ మర్చిపోలేను. పెట్టుబడి కోసం నా భార్య నీరజ కట్నం పైసలు రూ. 20వేలతో ఇన్‌స్టిట్యూట్‌ను స్టార్ట్ చేశా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప ఆలయం ఉన్న పాలంపేట గ్రామంలో మా నాన్న హెచ్‌ఎంగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన సూచన మేరకే మా కోచింగ్ సెంటర్‌కు రామప్ప పేరుపెట్టాం. వరంగల్‌లో ఫస్ట్ టైం పోలీస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడంతో మమ్మల్ని ఎవరూ నమ్మలేదు. దీన్నే సవాల్ తీసుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇన్‌స్టిట్యూట్‌ను నిలబెట్టాం. ఇవాళ పోలీస్ ఉద్యోగం రావాలంటే…రామప్ప ఇన్‌స్టిట్యూట్‌కు పోవాలె.. అనే అంతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాం.. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలకు చెందిన వందలాది మంది యువతీ, యువకులకు శిక్షణ ఇచ్చి కానిస్టేబుళ్లుగా, ఎస్సైలుగా తయారుచేశాం. తెలంగాణలో పనిచేస్తున్న సీఐలు, పలువురు డీఎస్పీలు కూడా మా ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నవారే కావడం గర్వంగా ఉంది. రామప్ప కోచింగ్ సెంటర్ నిలదొక్కుకోవడంతో దానికి అనుబంధంగా అదే పేరున జూనియర్, డిగ్రీ కళాశాలను హన్మకొండలో ఏర్పాటు చేశాం. ప్రస్తుతం మా విద్యాసంస్థల్లో వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాం.
నిపుణులైన అధ్యాపకులతో శిక్షణ..
పోలీస్ ఉద్యోగార్థుల కోసం వరంగల్‌లో రామప్ప కోచింగ్ సెంటర్ తప్ప మరో ఇన్‌స్టిట్యూట్ లేదు. హైదరాబాద్‌కు వెళ్లలేని వారందరికీ మా కోచింగ్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. నిపుణులైన అధ్యాపకులతో అభ్యర్థులకు శిక్షణ ఇప్పించడం వల్లే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం. ఆర్సీ రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాకల్టీను హన్మకొండకు రప్పించి తరగతులు నిర్వహిస్తున్నాం. ఇందుకోసం డిమాండ్ ఉన్న లెక్చరర్స్‌కు లక్షల్లో జీతాలు ఇస్తున్నాం. నెలకు రూ. 1,50, 000 జీతం తీసుకునే ఫ్యాకల్టీ కూడా రామప్ప ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నారు. అందుకే అత్యత్తమ ఫలితాలు సాధిస్తున్నాం.
మొదటి ప్రయత్నంలోనే విజయం..
మొదటి ప్రయత్నంలోనే నూటికి నూరు శాతం సక్సెస్ సాధించడం సంతోషంగా, గర్వంగా ఉంటుంది. 2006లో రామప్ప కోచింగ్ సెంటర్‌లో తొలిసారి 11 మంది జాయిన్ అయ్యారు. నిపుణులైన అధ్యాపకులు, ప్రణాళికాబద్ధమైన శిక్షణకు తోడు యువకుల కష్టం ఫలించి.. మొత్తం 11 మంది కానిస్టేబుల్ కొలువులు సాధించడంతో కోచింగ్ సెంటర్‌కు మంచి పేరొచ్చింది కానీ, ఆర్థిక ఇబ్బందులు మాత్రం తీరలేదు. 2009-10 మధ్య కాలంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నా.. అయినప్పటికీ నిలదొక్కుకున్నా.. 2011 నుంచి ఇక వెనుతిరిగి చూడలేదు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వేలాది మంది యువతీ, యువకులు మా కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. ఇందులో వందలాది మంది ఉద్యోగాలు సాధించారు. పోలీస్ ఉద్యోగాన్ని కోల్పోయిన నాకు ఇలా కోచింగ్ సెంటర్ ద్వారా వందలాది మందిని డిపార్ట్‌మెంట్‌కు పంపే అవకాశం దక్కడం గర్వంగా ఉంటుంది.