అక్షరశక్తి, హన్మకొండ : మరణించాక మట్టిలో కలిసిపోయే మన శరీరం వైద్య విద్యార్థుల ప్రయోజనార్ధం దానం చేయడం గొప్ప విషయమని హనుమకొండ జాయింట్ కలెక్టర్ వెంకట్ రెడ్డి అన్నారు. ఇండియన్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ నేత్ర అవయవ శరీర దాతల అసోసియేషన్ వరంగల్ అధ్యక్షులు మల్లారెడ్డి నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని అవగాహన బ్యానర్ ఆవిష్కరించి మాట్లాడారు. తొలుత అసోసియేషన్ సభ్యులు వరంగల్ జిల్లాలో మొదటిసారిగా మరణానంతరం తన శరీరాన్ని దానం చేసిన ప్రజాకవి కాళోజి విగ్రహం ముందు అవయవ దాన విశిష్టతను ప్రజలకు వివరించి ప్లాకార్ట్స్ ప్రదర్శించారు. ఇప్పటివరకు అసోసియేషన్ ఆధ్వర్యంలో 300నేత్రదానాలు122 పార్దివ శరీరాలు రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలలకు దానం చేసినట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి శంకర్ రావు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెండ్లి ఉపేందర్ రెడ్డి, సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, పద్మ, కేదారి, కృష్ణమూర్తి, సంపత్, శ్రీలత, నరసింహా రాములు తదితరులు పాల్గొన్నారు.