అక్షరశక్తి, మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న డిమాండ్ తో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ దశల వారి ఆందోళనకు పిలుపునిచ్చిందని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాప్రంథా మహబూబాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ముఖ్యమైన 6 గ్యారంటీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యాన్ని వహిస్తుందని అన్నారు. రైతు రుణమాఫీలో అనేక లోపాలు ఉండి రెండు విడతలలో కూడా అర్హులైన వారికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. పెట్టుబడి సహాయం వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. డిమాండ్ల పరిష్కారానికి ఆగస్టు 8న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి, ఆగస్టు 21న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామని దీనిలో ఆయా వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ మహబూబాబాద్ డివిజన్ సహాయ కార్యదర్శి బిల్లా కంటి సూర్యం, కేసముద్రం సంయుక్త మండలాల కార్యదర్శి భాస్కర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైండ్ల యాకయ్య, పివైఎల్ నాయకులు సురేందర్ రెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు.