- మెడికో డాక్టర్ ధారావత్ ప్రీతి
ఆత్మహత్య ఉదంతంలో అనేక చిక్కుముడులు - తమ కూతురిది ముమ్మాటికి
హత్యేనంటున్న కుటుంబ సభ్యులు - సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ డిమాండ్
- డాక్టర్ నాగార్జునరెడ్డిపై ప్రభుత్వం తొలి వేటు..
- భూపాలపల్లికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు
- కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్,
ఎంజీఎం ఇన్‌చార్జి డాక్టర్ చంద్రశేఖర్‌పైనా
చర్యలు తీసుకోవాలంటున్న ప్రజా సంఘాలు - రెండో రోజు నిందితుడు సైఫ్‌ను విచారించిన పోలీసులు
కాకతీయ వైద్య కళాశాల మొదటి సంవత్సరం పీజీ విద్యార్థిని డాక్టర్ ధారావత్ ప్రీతి అనుమానాస్పద మృతిపై మిస్టరీ వీడటంలేదు. డాక్టర్ ప్రీతి మృతి ఘటనలో ఇప్పటి వరకు అటు పోలీసులు, ఇటు వైద్యులు అనేక కోణాల్లో విచారణ చేపట్టినప్పటికీ ఈ మొత్తం సంఘటనలో అనేక సందేహాలకు సమాధానం దొరకడం లేదు. ఫిబ్రవరి 22న ఎంజీఎం ఆసుపత్రిలో డాక్టర్ ప్రీతి హానికరమైన ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు యత్నించిందని పోలీసులు అనుమానించారు. మరోవైపు వైద్యులు మాత్రం ప్రీతికి పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అందుకే ఆమె తీవ్ర అస్వస్థతకు గురైనట్లు అదే రోజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తర్వాత అటు పోలీసులు, ఇటు వైద్యులు సీనియర్ సైఫ్ వేధించడం వాస్తవమని నిర్ధారించారు. చివరికి ఆరోగ్యం క్షీణించి ఫిబ్రవరి 26న ప్రీతి చనిపోయింది. ఆమె ఏ ఇంజక్షన్ తీసుకోవడం వల్ల పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయిందనే విషయం టాక్స్ నివేదికలో వెల్లడి కావలసి ఉంది. కానీ, ఈ నివేదికలో ఏం తేలింది అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఈ క్రమంలోనే ఎంజీఎం ఆస్పత్రి అనస్థీషియా విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జునరెడ్డిపై ప్రభుత్వం తొలి వేటు వేసింది. ఆయన్ను భూపాలపల్లి ప్రభుత్వ వైద్యకళాశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా బావిస్తున్న సైఫ్‌ను మట్టెవాడలో రెండో రోజు పోలీసులు విచారిస్తున్నారు.
డాక్టర్ నాగార్జునరెడ్డిపై తొలి వేటు
మెడికో ప్రీతి ఆత్మహత్య ఉదంతంలో ఎంజీఎం అనస్థీషియా విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జునరెడ్డిపై ప్రభుత్వం తొలి వేటు వేసింది. నాగార్జునరెడ్డిని భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు పీజీ విద్యార్థుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడంలో విభాగం అధిపతి డాక్టర్ కే నాగార్జునరెడ్డి ఉదాసీనంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. మొదటి నుంచి ఆయనపై ప్రీతి తల్లిదండ్రులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హెచ్ ఓడీ నిర్లక్ష్యం వల్లనే సీనియర్ విద్యార్థి సైఫ్ తమ కూతురుని లక్ష్యంగా చేసుకుని వేధించాడని ఆరోపి స్తున్నారు. నాగార్జునరెడ్డిని బదిలీ చేసి విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ప్రీతి న్యాయ పోరాట కమిటీ నాయకులు, ఎల్‌హెచ్పీఎస్ నాయకులు మండిపడుతున్నారు. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, ఎంజీఎం ఇన్‌చార్జి డాక్టర్ చంద్రశేఖర్ పైనా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
సైఫ్‌ను విచారిస్తున్న పోలీసులు
డాక్టర్ ప్రీతి మృతి కేసులో నిందితుడు సైఫ్‌ను పోలీసులు రెండో రోజు విచారిస్తున్నారు. కోర్టు అనుమతితో గురువారం సైఫ్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం జైలు నుంచి వరంగల్‌కు తీసుకువచ్చిన పోలీసులు మట్టెవాడ పోలీస్‌స్టేషన్‌లో ఆయన్ను విచారిస్తున్నారు. ప్రీతితో ఉన్న గొడవలు, ఆమెను వేధింపులకు గురి చేయడానికి గల కారణాలను, చార్జ్‌షీట్‌లో పేర్కొన్న అంశాలు, టెక్నికల్ ఎవిడెన్స్‌పై లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం. కోర్టు అనుమతితో నాలుగు రోజులపాటు సైఫ్‌ను పోలీసులు విచారించనున్నారు. ఈ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ముమ్మాటికీ హత్యే… సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
ఎల్‌హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జైసింగ్ రాథోడ్
డాక్టర్ ప్రీతిది ముమ్మాటికీ హత్యే. నాగార్జునరెడ్డిని బదిలీ చేసి ప్రభుత్వం కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, ఎంజీఎం ఇన్‌చార్జి డాక్టర్ చంద్రశేఖర్ తోపాటు కేసుతో సంబంధం ఉన్నవారందరినీ విచారించాలి. దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించాలి. ప్రీతి మృతి కేసుపై సిట్టింగ్ జడ్జితో న్యాయం విచారణ జరిపితేనే నిజానిజాలు బయటకు వస్తాయి. అప్పుడే ప్రీతి కుటుంబానికి న్యాయం జరుగుతుంది. తెలంగాణలో ప్రభుత్వం కులాలను బట్టే చట్టాలను ప్రయోగిస్తున్నది. డాక్టర్ ప్రీతి కేసులో ఈ విషయం స్పష్టంగా అర్థమవుతున్నది.