అక్షర శక్తి,హసన్ పర్తి: పల్లెల రూపురేఖలు మార్చేలా స్వచ్ఛదనం, పచ్చదనం అనే ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై విజయవంతం చేయాలని హసన్ పర్తి ఎంపీవో కట్ల కర్ణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హసన్ పర్తి మండలం నాగారం,పెంబర్తిలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ నా గ్రామం.. నా గౌరవం నినాదంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం లాంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. వనమహోత్సవంలో భాగంగా గ్రామపంచాయతీ, పట్టణాలలోని అన్ని ఖాళీ స్థలాలలో మొక్కలు నాటాలని తెలిపారు. గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి, కార్యదర్శి, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో అన్ని ప్రభుత్వ స్థలాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, తదితర ప్రాంతాలలో శుభ్రం చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మల్లారెడ్డిపల్లి , కొత్తపల్లి గ్రామాల్లో…
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మండలంలోని మల్లారెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాలలో మండల ప్రత్యేక అధికారి మేన శ్రీను పాల్గొని పరిశీలించారు. మల్లారెడ్డిపల్లి గ్రామంలో మంచినీ ట్యాంకులను శుభ్రం చేసి పిచ్చి మొక్కలను తొలగించారు, వాన నీటి సంరక్షణ కోసం నిర్మాణ పనులకి మార్కింగ్ ఇచ్చారు. ఈ సందర్బంగా మేన శ్రీను మాట్లాడుతూ గ్రామాలలో పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రవీణ్ ఏపీవో విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.