అక్షరశక్తి డెస్క: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మరో కంపెనీతో అవగాహన కుదుర్చుకుంది. అసెట్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ సర్వీసెస్, అడ్వాన్స్‌డ్ డేటా ఆపరేషన్స్‌లో ప్రముఖ కంపెనీ ఆర్సీజియం, హైదరాబాద్‌లోని తమ కంపెనీని విస్తరించడానికి అంగీకరించింది. ఆర్సీజియం సీఈఓ గౌరవ్ సూరి, ఇతర ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బృందం జరిపిన చర్చల్లో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఆర్సీజియం అంతర్జాతీయంగా బయటి దేశాల్లో మొదటి శాఖను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసింది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అందిస్తున్న సహకారంతో తమ సేవలను మరింతగా విస్తరిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో కావలసిన సదుపాయాలకు అనుగుణంగా హైదరాబాద్‌లోని గొప్ప టాలెంట్ ఫోర్స్, సహజ రీతిలో ఉండే లొకేషన్, నైపుణ్యం కలిగిన స్థానిక ఉద్యోగుల లభ్యత కారణంగా అంకితభావంతో హైదరాబాద్‌లో డాటా సొల్యూషన్ సర్వీసులను అభివృద్ధి పరుస్తున్నామని గౌరవ్ సూరి తెలిపారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. డీఈ షా గ్రూప్, బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజ్‌మెంట్ మద్దతుతో ఆర్సీజియం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. ఆర్సీజియం తన సేవలను విస్తరణ చేపడుతున్నందుకు ముఖ్యమంత్రి కంపెనీ ప్రతినిధులను అభినందించారు. కంపెనీకి తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. తెలంగాణలో ఐటీ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.