అక్షరశక్తి, హన్మకొండ : తెలంగాణ రాష్ట్ర 9వ ఫెడరేషన్ కప్ అండర్ -20 జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు హన్మకొండలోని జేఎన్ఎస్ స్టేడియంలో శనివారం లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అథ్లెటిక్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, షైన్ విద్యాసంస్థల అధినేత మూగల కుమార్ యాదవ్, సెక్రటరీ యుగేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఈ క్రీడోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి డీసీపీ కరుణాకర్, ఎన్ఎస్ఆర్ అధినేత సంపత్‌రావు, రామప్ప అకాడమీ చైర్మన్ ఐలు చంద్రమోహన్ గౌడ్, సారంగపాణి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ పోటీల్లో విజేతలైన క్రీడాకారులు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు తమిళనాడులో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. తెలంగాణలో అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారని, వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించామని షైన్ కుమార్, రామప్ప అకాడమీ చైర్మన్ ఐలు చంద్రమోహన్ గౌడ్ వెల్లడించారు.