Friday, July 26, 2024

కౌశిక్‌రెడ్డికి కేసీఆర్ కీలక బాధ్యతలు.. ఆ ఫార్ములా వర్కౌట్ అయ్యేనా.. ?

Must Read

ఏదేమైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో హుజురాబాద్‌లో గెలిచి… ఈట‌ల రాజేంద‌ర్‌కు చెక్ పెట్టాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అందుకు తగ్గట్టు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టూరిజంశాఖ బాధ్యతలు అప్పగించి.. పాడి కౌశిక్ రెడ్డికి లైన్ క్లియర్ చేసింది. ఈ నేప‌థ్యంలోనే కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌ రెడ్డిని నియమించింది. హుజురాబాద్‌లో ప్రత్యర్థిగా ఈటెల రాజేందర్ లాంటి బలమైన నేత ఉన్న కారణంగా అతడికి సరైన వ్య‌క్తి కౌశిక్ రెడ్డి అని భావించిన కేసీఆర్… ఆయనకు కీల‌క బాధ్యతలు అప్పగించిన‌ట్లు తెలుస్తోంది.

బీఆర్ఎస్ అప్పటి (టీఆర్ఎస్) లో ఉన్న ఈట‌ల రాజేందర్ కొన్ని కారణాలతో ఆపార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందారు. ఈ ఉపఎన్నికలో బీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోటీచేసి ఓడిపోయారు. దీంతో ఈసారి జరగబోయే ఎన్నికల్లో హుజురాబాద్ లో గులాబీ జెండా ఎగురవేయాలని తహతహలాడుతున్న బీఆర్ఎస్ ఇప్పటి నుంచే ఫోకస్ పెంచింది. అలాగే ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని.. మరింత అభివృద్ధి చేస్తామని కేటీఆర్ తెలిపారు. దీంతో హుజురాబాద్ బరిలో కౌశిక్ రెడ్డి ఉండే అవకాశాలు ఎక్కువున్నాయనే ప్రచారం జోరుగా సాగింది.

మరోవైపు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అంటే ఈసారి హుజురాబాద్ సీటు ఇచ్చేది కష్టమే అని భావించిన అధిష్టానం ముందుగానే అలెర్ట్ అయింది. ఈ క్రమంలో పాడి కౌశిక్ రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇస్తూ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయంతో అటు ఈట‌ల రాజేందర్ కు ఇటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు చెక్ పెట్టినట్లైంది. మరికొన్ని నెలల్లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ బాధ్యతలు అప్పగించడం హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో హాట్ టాపిక్ అయింది. అయితే ఎన్నికల్లో ఈట‌ల రాజేందర్ ను కౌశిక్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కొంటారు. ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు?ఒకవేళ గెల్లు టికెట్ ఆశిస్తే అధిష్టానం ఏం చేస్తుంది ? ఈ నిర్ణయాలతో పార్టీ అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయా? ఈట‌లను ఎదుర్కోవడంలో పాడి సక్సెస్ అవుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img