వసంతాన ప్రకృతమ్మ చిగురాకు రుచి జూసిన కోకిల మధురగానం రాగాల్లో..
మొగులు చల్లి అక్షింతల జల్లుకు పురివిప్పి చిందేసిన ఆంగికనర్తనం చరణాల్లో…
పిల్లకాలువల ధారలు తల్లి కాలువలుజేరంగ అవని అందెలరవళి శబ్దాల్లో
పాలపొదుగుకు లేగదూడ దూదిమెత్తని స్పర్శకు పరవశించిన అరుపు సాకిల్లో..
ముసలవ్వ మూలుగుల్లో వనికి తొణికిసలాడిన గాత్రంలో..
అయ్య గద్దరిపుగొంతు వెనుక వేలాడిన అనురాగాల ఉయ్యాలూగు లేతవూతల పసిపాప పెదవిరుపు ఏడుపు నాదాల్లోంచి.. కలం హలమెంట విత్తిన విత్తనం మొలకెత్తగా కొంగొత్త పత్రహరితం పురుడోసుకొని ఉద్భవింనట్టు అనుకోని పల్లె కోకిల గంగలా పల్లెపాదాల జానపద మహావృక్షపై వాలింది రేలారె గంగ.
ఒడిదుడుకులు లేని బాటవుండదు.
ఆటుపోట్లు లేని సంద్రముండదు.
మలుపులు లేని మార్గముండదు.
సుఖదుఃఖాలు లేని బతుకులుండవు.
ఇవి ఎంతసాధారణమో
వాటితో పోరాడటం ఓటమిని గెలుపుని
చవిచూస్తూ అనుభవగ్రంథాలజ్ఞాన్ని
అధ్యయనం చేస్తూ సామాజిక రుగ్మతల కఠినపరీక్షలకు
పాట సంస్కరణగా.. పాట చైతన్యంగా.. పాట లోకజ్ఞతగా
పాట అప్రకటిత అభ్యుదయంగా.. భావించి పాటను ఆయుధంగా మలుచుకుని పోటీపోరాటంలో నిలిచి గెలిచిన రేలారె గంగక్క.. నిజామాబాగ్ జిల్లా, డిచ్ పల్లి మండలం సాయమ్మ, మల్లయ్యలకు జన్మించి ఊరిపేరు తల్లిదండ్రుల పేరునిలబెట్టిన స్వరధీరురాలు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా మొక్కవోని ధైర్యం తో ముందుకు సాగుతూ కుటుంబబాధ్యతను తండ్రిలా మోస్తూ.. జీవితకష్టాలను చదువుతూ సమాజవిలువలను పరిరక్షించడానికి తనకు తల్లినేర్పిన కళనే ఉపాధిరెక్కలుగా మలుచుకొని కళాపిపాసియ్యై తన కళా ప్రస్తనం ప్రారంభించింది గంగ.
పల్లెనుండి పట్నం వరకు వయస్సుతో నిమిత్తం లేకుండా ప్రజలందరు ఉత్సాహంగా ఆస్వాదించి ఉల్లాసాన్ని పొందేలా పాటలు పాడింది. అక్కడితో ఆగకుండా జానపద పాటలు, గేయాల సేకరణ ప్రారంభించి విశ్వవిద్యాలయాల్లో జానపద సాహిత్యంలో జరగాల్సినంత పనిని ఓ సామాజిక బాధ్యతకలిగిన పరిశోధకురాలు వలె అనేక జానపద బాణీలను, పాటలను, పదాలను, పలుకుబడులను సజీవంగా బ్రతికించనీకి తెచ్చిన సంజీవినైంది. అలా తనప్రయాణంలో నిలిచి సాధించుకున్న ఓ గొప్ప అవకాశం తెలంగాణ ఉద్యమంలో రసమయి బాలకిషన్ అన్న పాటకు కాలిగజ్జెకట్టి దుంకి ఆడటమే కాదు ఆ బృధంలో తాను భాగస్వామి అయింది. అలాగే పాటల సెలక్షన్ సమయానికి చేరుకోకున్నా…కేవలం ఒక అవకాశమీయమని బ్రతిమిలాడి మెప్పించి తన స్వరం సత్తువతో న్యాయనిర్ణేతలతో శభాష్ అనిపించుకొని పొందిన మరో గొప్ప అవకాశం. మా టీవిలో మొదలైన రేలారె రేలా జానపదాల పాటల కార్యక్రమంలో పల్లెకోకిలై స్వరం వినిపించడంతో సుద్దాల అశోక్ తేజ, గోరేటి వెంకన్న, ప్రజాయుద్దనౌక గద్ధర్, యాంకర్ ఉదయభాను.. ఎంతోమంది ప్రముఖుల ప్రశంశలు పొందింది గంగ. ప్రజాదరణపెరిగి సామాజిక ప్రజా చైతన్యంతో ముందుకుసాగింది
దాదాపు రెండు దశాబ్ధాల కాలం పాటు తెలంగాణ పల్లెపాటే తన ఆస్తిలా భావించి భావితరాల వారికి కల్తీలేని జానపద సంపదను అందించడమే లక్ష్యంగా గంగ దాదాపు 500 లకు పైచిలుకు పాటలు పాడింది అంగులో గంగ అనే పేరువినగానే యాదికొచ్చే పల్లె జానపదాలు మనకు డీజే పాటలై ఎప్పటికీ మర్చిపోకుండా చేసేపాటలు “పలుగు రాళ్ల పాడుల దిబ్బష, “పుట్టమీద పాలపిట్టా జాజి మొగ్గ లాలిష ,
బతుకమ్మ పాటల్లో పున్నపు వలలో పూసీ కాయంగా.. వెన్నెలకీ వచ్చినయూ జొన్నల బండ్లు.. వంటి పాటలు పూర్తిగా స్వచ్ఛమైన కల్తీలేని జుానపదాలు. తరతరాల జానపద కళాసంపదను రికార్డు చేసిన గొప్పతనం గంగకు చెందుతుంది.
అసలు జానపదం అంటే జానపదం? పాటంటే?.. జానపదులు అంటే పల్లె ప్రజలు. వారు పాడేదే జానపదం.
స్ఫూర్తి – ఆర్తిగల గంగ
కష్టాలను అనుభవించి.. కన్నీళ్లు పెట్టిన రోజులే ఎక్కువ. తనజీవితంలో ఆ కన్నీళ్ల విలవ తెలుసు. తనకు అందుకే తోటివాళ్లకు సాటివాళ్ళకష్టాలు కలగకూడదని తాపత్రయపడుతుంటది. ఇబ్బందులు, బాధలు పడి అవమానాలు ఎదుర్కొని ఒక స్థాయికి చేరిన తను.. తనలా ఎవ్వరూ ఇబ్బందులు పడకూడదనుకునే మనస్సు తనది. అలా వుండటంలో ప్రవర్తించటంలో స్ఫూర్తి – ఆర్తి రెండూ కలిసివుంటాయి. తల్లిదండ్రి వున్నా నేటి ఆడపిల్లలు వాళ్ల సామర్థ్యాలు, ప్రతిభావిశేషాలు కనీసం గడపదాటనీయని పరిస్థితి. అలాంటిది పుట్టిన పది రోజులకే తన తండ్రి చనిపోయినప్పుడు తనకేమీ తెలియదు కాబోలు.. కానీ తనకు మాటలు వచ్చే వయస్సుకి తాను పిలవలేని పేరు నాన్న. తండ్రివాత్సల్యాన్ని చవిచూడని కూతురు ఆవేదనను భరించిన హృదయం గంగది.
చదువుపై ఇష్టమున్నా కానీ తన తల్లికి చేదోడు వాదోడుగావుంటూ ఇల్లు గడవడంకోసం చిన్న వయస్సులో అనేక కష్టాలనుభవించింది. అక్క పెళ్లి బాధ్యతను మోసింది. తన కుటుంబానికి సంబంధించిన మూడు ఎకరాలభూమిని గ్రామస్తులు అత్యంత అగ్వకు కేవలం 70వేలకు మోసగించి రాసుకున్న ఎతలు తన జీవితంలో వున్నాయి. ఇప్పుడదే ఊరికి పేరుతీసుకొచ్చింది గంగ. 2016 లో గౌరవ ముఖ్యమంత్రిగారి చేతులమీదుగా రాష్ట్ర ఉత్తమ గాయినిగా పురస్కారం అందుకున్నది. తను పుట్టిన ఊరి పేరున దాదాపు 12, 13 దేశాల్లొ తిరిగే అవకాశం వచ్చింది కేవలం తన పట్టుదల కృషి వల్లనే.
తన పాటలు పల్లెప్రజలను ఉత్సాహపరిచి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.. తన స్వరం జనహృదయాల్లో స్థానం సంపాదిస్తుంటది… తన పాట ఉద్యమాల లక్ష్యమై తెగింపునిస్తది.. తన పాట తనతో పాటు వర్థమాన కళాకారులకు చేయుతైనిలుస్తది.. తన పాట పల్లెభావగీతమై అనుభూతిని కలిగిస్తది.. తన పాట పల్లెతల్లి అనుబంధాలని బలపరుస్తది. జానపద సాహిత్యంలో అన్ని రకాలపాటల కంటే …
బావా మరదండ్ల సరసం ప్రత్యకమైంది. చెరువు కట్టపొంటి, చెనుకాడ పొలం గట్లెంట, వ్యవసాయ పనులల్లో, పండగసందర్బాల్లో ఎంతో ప్రత్యేకమైనది. అలాంటివి జానపద సాహిత్యంలో చాలానే వున్నయి
కానీ వ్యవసాయంతో రైతు సంతోషంగా బ్రతికిన కాలాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ జానపద సాహిత్యంలో
ఉయ్యాల పాటలకున్న గొప్పతనాన్ని రెట్టింపుచేసి చూపించే పాటను చిట్యాల విజేందర్ (సీ వి ఆర్ బౌద్ధ తో రాయించి తానే స్వయంగా పాడిన పాట అక్టోబర్ 29 రోజు ప్రోమో విడుదలై పూర్తి పాటను నవంబర్ 6 వ తేదీ గంగ య్యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసిన కొద్దిరోజుల్లోనే ఎక్కువ మందికి చేరువైంది పాట. ఒడ్డు మీద గుడ్డీ కొంగ ఉయ్యాలో ఉయ్యాల అని ప్రారంభమైన పాట రైతు ఈ దేశం కడుపుకు మెతుకు అనే వాక్యంతో ముగింపు వుంటది. ఆ పాటలో విజేందర్ రైతుని ఓ గొప్పమాటతో గౌరవిస్తూ సెమటల ముత్యాలరాజు ఉయ్యాలో ఉయ్యాల అనే అభివ్యక్తి గంగ స్వరంలో విన్నపుడు నిజంగా దేశానికి రాజు రైతన్న మాట గుర్తుకొస్తది. ఇలాంటి పాటలు గంగ ఛానల్ నుంచి మరిన్ని రావాలని, గాయినిగా తనప్రయాణం ఇంకా ఉన్నతస్థాయికి చేరుకోవాలని, జానపదపాటల కోకిలగా కోట్లాది ప్రజలఆధరణ పొందాలని అక్షరశక్తి పక్షాన శుభాకాంక్షలు రేలారె గంగ .
డాక్టర్ మహేందర్ కట్కూరి
9618447209