- ఆడమగ అన్న తేడాతో మమ్మల్ని పెంచలేదు..
- ఆశయం కోసం 9 నెలల పాపకు దూరంగా ఉన్నా
- అమ్మానాన్న, భర్త, కుటుంబ సభ్యులు ఎంతో ప్రోత్సహించారు
- మొదటి ప్రయత్నంలోనే ఎస్సై ఉద్యోగం సాధించగలిగాను
- యువత ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి
- నెక్కొండ ఎస్సై సీమ ఫర్హీన్
- అక్షరశక్తికి ప్రత్యేక ఇంటర్వ్యూ
అక్షర శక్తి,నెక్కొండ: నేను పోలీస్ వృత్తిలోకి రావడానికి మా నాన్నే స్ఫూర్తి. నాన్న ఏఎస్సైగా పనిచేస్తున్నారు. నాకు చిన్నతనం నుంచే పోలీస్ కావాలని అనుకున్నాను. నా ఆశయం కోసం తొమ్మిది నెలల కూతురు కూడా దూరంగా ఉండి చదువుకున్నాను. అమ్మానాన్న, భర్త, కుటుంబ సభ్యుల సహకారం, ప్రోత్సాహంతోనే ఎస్సైగా ఉద్యోగం సాధించగలిగాను.. అని అంటున్నారు నెక్కొండ ఎస్సై సీమఫర్హీన్. ఇటీవల గీసుగొండ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై నెక్కొండకు వచ్చారు. వివాహం అయిన తర్వాత కూడా పట్టుదలతో చదువుకుని సమాజంలో ఎంతో గౌరవప్రదమైన పోలీస్ వృత్తిలోకి అడుగుపెట్టిన తీరు నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ నేపథ్యంలో ఎస్సై సీమ ఫర్హీన్‌ను అక్షరశక్తి పలకరించగా.. చదువు, కుటుంబం, ఆశయం, వృత్తికి సంబంధించిన అనేక విషయాలను ఆమె పంచుకున్నారు.
ప్రశ్న : మేడమ్.. మీ కుటుంబ నేపథ్యం..?
సీమ ఫర్హీన్ : మాది వ్యవసాయ నేపథ్యంగల కుటుంబం. అమ్మానాన్న మహ్మద్ చాంద్ పాషా, జహానా బేగం. నాన్న ఏఎస్సైగా పనిచేస్తున్నారు. అమ్మ హౌస్ వైఫ్. ఇద్దరు తమ్ముళ్లు. ఒకరు ప్రైవేట్ టీచర్. మరొకరు పోలీస్ కానిస్టేబుల్. మా ఆయన జహంగీర్ పాషా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. మాకు ఒక పాప అలీజ సంరీన్. నాన్న పోలీస్ కావడంతో తరుచూ బదిలీలు అయ్యేవి. అందుకే నా చదువు వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. పదో తరగతి హుస్నాబాద్, ఇంటర్జ మ్మికుంట, బీటెక్ పెద్దపల్లి, ఎంటెక్ కరీంనగర్లో పూర్తి చేశారు. నాన్న ఎక్కడికి బదిలీ అయితే అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో స్నేహితులకు దూరం కావాల్సి వచ్చేది. కానీ.. ఎన్నడు కూడా చదువును నిర్లక్ష్యం చేయలేదు.
ప్రశ్న : పోలీస్ వృత్తిలోకి రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు..?
సీమ ఫర్హీన్ : మా నాన్నే నాకు స్ఫూర్తి. నాన్న మమ్మల్ని ఆడ, మగ అన్న తేడా లేకుండా పెంచారు. అలాగే చదివించారు. ఎంతో బాధ్యతాయుతంగా ఉంటారు. అందుకే నాకు చిన్నతనం నుంచే పోలీసు కావాలని అనుకునేదానిని. ఎంటెక్ చదివినా ఆ రంగంలోకి వెళ్లకుండా పోలీస్ వృత్తిలోకి వచ్చాను. నా భర్త , కుటుంబ సభ్యులందరు కూడా నన్నెంతో ప్రోత్సహించారు. వారి అండదండలు, సహకారంతోనే నా తొమ్మిది నెలల పాపకు దూరంగా ఉండి ఆరు నెలలు ట్రైనింగ్‌కు వెళ్లగలిగాను. అందరి ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే 2020 బ్యాచ్‌లో ఎస్సైగా ఉద్యోగం సాధించాను. ఆ సమయంలో మావాళ్లందరూ ఎంతో సంతోషించారు. మొదటి పోస్టింగ్ వరంగల్ జిల్లా గీసుకొండ పోలీస్ స్టేషన్.
ప్రశ్న : నేటి యువతకు మీరేం చెప్పాలనుకుంటున్నారు..?
సీమ ఫర్హీన్: పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతారు. వారు కడుపునిండా తిన్నాతినకున్నా కన్నబిడ్డలు సమాజంలో మంచిస్థాయికి ఎదగాలని, మంచి ఉద్యోగం సాధించాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. వారి కన్నబిడ్డలుగా ఆ కష్టాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా పట్టుదలతో, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలి. అమ్మానాన్నల కలల్ని నిజం చేయాలి. అందుకే నేను చెబుతున్నా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి.. అవకాశాలు వాటంతర అవే వస్తూనే ఉంటాయి. నిజానికి.. నేటి యువత చేతుల్లో అద్భుతమైన ప్రతిభ ఉంది. దానిని గుర్తెరిగి ఉండాలి. ఓపికతో ముందడుగు వేయాలి. కానీ..చెడు మార్గంలో వెళ్లొద్దు. అది కుటుంబం మొత్తాన్ని ఛిన్నాభిన్నం చేస్తుంది.
ప్రశ్న : మహిళలపట్ల ఇప్పటికీ వివక్ష కొనసాగుతోంది.. దీనిపై మీ కామెంట్?
సీమ ఫర్హీన్ : ముందుగా తల్లిదండ్రులు పిల్లలను ఆడమగ అన్న తేడాతో చూడొద్దు. ఇద్దరినీ సమానంగా పెంచాలి. ఇక నేడు ప్రతీ రంగంలో పురుషులతో సమానంగా స్త్రీలు పని చేస్తున్నారు. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తేనే కుటుంబం గడిచే రోజులి. మహిళలని చిన్న చూపు చూసే వారికి బుద్ధి చెప్పక తప్పదు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదు. ఎవరికైనా సమస్యలు ఉంటే నేరుగా కలవొచ్చు. మండలంలో ద్విచక్ర వాహనాల మీద స్పీడ్ గా వెళ్లే ఆకతాయిలు కనబడితే మాత్రం ఊరుకునేది లేదు. తల్లితండ్రులు కూడా తమ పిల్లలకు బైక్, కారు ఇచ్చి రోడ్లు మీదికి పంపొద్దు.
నా పై అధికారుల సలహాలు, సూచనలు మేరకు పని చేస్తా. శాంతిభద్రతల పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలి.