కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్
అక్షరశక్తి, కాజీపేట: సమ సమాజాన్ని స్థాపించడమే జగ్జీవన్ రామ్‌కు నిజమైన నివాళి అని కేవీపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ అన్నారు. జగ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా సిద్ధార్థ నగర్‌లోని ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సభలో మంద సంపత్ మాట్లాడారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమకారుడు, రాజకీయవేత్త, సంఘ సంస్కర్త బీహార్ రాష్ట్రంలో జన్మించిన బడుగు, బలహీన వర్గాల ఆశాదీపం జగ్జీవన్ రామ్ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం అన్నారు. భారత పార్లమెంటులో 40 సంవత్సరాలపాటు వివిధ పదవుల్లో కొనసాగిన బాబూజీ అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి నిర్వహించిన తొలి వ్యక్తిగా, ఉప ప్రధానిగా పనిచేసిన తొలి దళిత బిడ్డగా ఖ్యాతి గడించారని కొనియాడారు. 1935లో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమై ఆలిండియా డిప్రెసెడ్ క్లాసెస్ లీగ్ సంస్థను స్థాపించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. 1937 లోనే బీహార్ శాసనసభకు ఎన్నికై గ్రామీణ కార్మిక ఉద్యమాన్ని నిర్వహించారన్నారు. భారత రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిగా పేరు గడించారన్నారు. దళితులకు ఓటు హక్కు కోసం ఉద్యమించిన తొలి తరం నాయకుడన్నారు. అంతరాలు లేని సమాజాన్ని నిర్మించడం కోసం, సమ సమాజ స్థాపన కోసం తన జీవితాంతం పని చేసిన గొప్ప యోధుడు అన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు అర్శాం రాంకి, తిక్క సాంబయ్య, అనిల్, మల్లయ్య, దయాకర్, సతీష్, రమేష్ పాల్గొన్నారు.