Tuesday, June 18, 2024

సంచుల్లో ముంచారు

Must Read
  • ఏనుమాముల మార్కెట్లో మాయ
  • రైతాంగానికి అంద‌ని ఖాళీ గ‌న్నీబ‌స్తాల‌ డ‌బ్బులు
  • ఏనుమాముల మార్కెట్లో కొన్నేళ్లుగా తీర‌ని అన్యాయం
  • ప్ర‌తీరోజు ల‌క్ష‌ల రూపాయ‌లు న‌ష్ట‌పోతున్న రైతాంగం
  • సౌండ్ బ‌స్తాల‌కే ఇస్తామంటున్న వ్యాపారులు
  • అన్ని బ‌స్తాల‌కూ ఇవ్వాల‌ని రైతులు, సంఘాల డిమాండ్‌
  • ఇటీవ‌ల వ్యాపారులు, రైతు సంఘాల నేత‌ల‌తో అధికారుల చ‌ర్చ‌లు
    కొలిక్కిరాని స‌మ‌స్య‌

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : వ‌రంగ‌ల్ ఏనుమాముల వ్య‌వ‌సాయ‌ మార్కెట్లో రైతాంగానికి తీర‌ని అన్యాయం జ‌రుగుతోంది. వ్యాపార‌వ‌ర్గాల నుంచి రైతుల‌కు అందాల్సిన ఖాళీ గ‌న్నీబ‌స్తాల డ‌బ్బులు కొన్నేళ్లుగా అంద‌డం లేదు. నిబంధ‌న‌లు ప‌క్కాగా అమలు చేయాల్సిన సంబంధిత అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో రైతుల‌కు తీవ్ర న‌ష్టం జ‌రుగుతోంది. రైతులు సౌండ్ బ‌స్తా(అతుకులేని గ‌న్నీసంచి)ల్లో స‌రుకు తీసుకొస్తేనే బ‌స్తా ఖ‌రీదు డ‌బ్బులు క‌ట్టిస్తామ‌ని, అన్‌సౌండ్‌( అతుకు ఉన్న గ‌న్నీ సంచి) బ‌స్తాల్లో తీసుకొస్తే.. ఆ బ‌స్తాల‌కు డ‌బ్బులు ఇవ్వ‌బోమ‌ని వ్యాపారులు తెగేసి చెబుతున్నారు. ఏ బ‌స్తాల్లో తీసుకొచ్చినా.. రైతుల‌కు ఖాళీ బ‌స్తాల‌ డ‌బ్బులు ఇవ్వాల్సిందేన‌ని రైతులు, రైతు సంఘాల నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. ఖ‌మ్మం వ్య‌వ‌సాయ మార్కెట్‌లో ఖాళీ బ‌స్తాల‌కు అక్క‌డి వ్యాపారులు డ‌బ్బులు ఇస్తున్నార‌ని, వ‌రంగ‌ల్‌లో ఎందుకు ఇవ్వ‌రంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ఇటీవ‌ల వ‌రంగ‌ల్ క‌లెక్ట‌రేట్‌లో వ్యాపారులు, రైతుల సంఘాల నాయ‌కుల‌తో ఉన్న‌తాధికారులు స‌మావేశం నిర్వ‌హించి, చ‌ర్చించినా.. స‌మ‌స్య కొలిక్కిరాన‌ట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా… ఆరుగాలం క‌ష్టించి పంట పండించిన త‌మ‌కు అడుగ‌డుగునా అన్యాయం జ‌రుగుతోంద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

 

సుమారు 95శాతం ఆ బ‌స్తాలే…

వ‌రంగ‌ల్ ఏనుమాముల వ్య‌వ‌సాయ మార్కెట్‌కు అనేక ప్రాంతాల నుంచి రైతులు మిర్చి, ప‌త్తిని బ‌స్తాల్లో తీసుకొని వ‌స్తుంటారు. ఇలా ప్ర‌తీ రోజు కొన్నివేల బ‌స్తాలు మార్కెట్‌కు వ‌స్తాయి. అయితే… సుమారు 95శాతం అన్‌సౌండ్ బ‌స్తాల్లోనే రైతులు ప‌త్తి, మిర్చిని తీసుకొని వ‌స్తున్నార‌ని, కేవ‌లం 5శాతానికి అటుఇటుగా సౌండ్ బ‌స్తాల్లో తీసుకొస్తున్నార‌ని రైతు సంఘాల నాయ‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం అన్‌సౌండ్ బ‌స్తా ఖ‌రీదు సుమారు రూ.50పైగా ఉంద‌ని, ఇక సౌండ్ బ‌స్తా ఖ‌రీదు సుమారు రూ.70పైగానే ఉంద‌ని అంటున్నారు. రైతులు తీసుకొచ్చే బ‌స్తాలు ఏవైనా.. అవి వ్యాపారుల‌కు ఏదోఒక రకంగా రీయూజ్ అవుతున్నాయ‌ని, ఈ నేప‌థ్యంలో రైతుల‌కు వ్యాపారులు బ‌స్తా ఖ‌రీదులో స‌గ‌మైనా ఇవ్వాల్సిందేన‌ని రైతులు, రైతు సంఘాల నాయ‌కులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో… 2018లో సౌండ్ బ‌స్తాల‌కు మాత్ర‌మే డ‌బ్బులు ఇవ్వాల‌ని గెజిట్ వ‌చ్చింద‌ని, మిగ‌తా బ‌స్తాల‌కు ఇవ్వాల‌ని అందులో లేద‌ని.. వ్యాపార‌వ‌ర్గాలు వాదిస్తున్నాయి.

కొలిక్కిరాని చ‌ర్చ‌లు

వ‌రంగ‌ల్ క‌లెక్ట‌రేట్‌లో ఇటీవ‌ల రైతు సంఘాల నాయ‌కులు, చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్ర‌తినిధుల‌తో ఉన్న‌తాధికారులు స‌మావేశం ఏర్పాటు చేసి.. చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. ఈ స‌మావేశంలో ఎవ‌రివాద‌న వారు వినిపించినా.. చివ‌ర‌కు స‌మ‌స్య కొలిక్కిరాన‌ట్లు స‌మాచారం. మ‌రోసారి స‌మావేశం ఏర్పాటు చేసి, ఖాళీ గ‌న్నీ సంచుల డ‌బ్బుల విష‌యంలో ఉన్న‌తాధికారులు ఓ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్ర‌తీ రోజు మార్కెట్‌కు కొన్నివేల బ‌స్తాల స‌రుకు వ‌స్తుంద‌ని, ఒక ఖాళీ బ‌స్తాకు సుమారు రూ.30 ఇవ్వాల్సి వ‌చ్చినా.. ఒక‌రోజుకే రైతాంగానికి ల‌క్ష‌ల రూపాయ‌ల న‌ష్టం జ‌రుగుతుంది. అయితే.. ఇంత‌పెద్ద మొత్తంలో రైతాంగం న‌ష్ట‌పోతున్నా.. అధికారులు చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. రైతుల‌కు న్యాయం జ‌రిగేలా వ్యాపార‌వ‌ర్గాల ప‌ట్ల నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేయాల‌నే వాద‌న రైతు సంఘాల నుంచి బ‌లంగా వినిపిస్తోంది.

 

ఖ‌మ్మంలో ఇస్తున్నారుగా..

ఖ‌మ్మం వ్య‌వ‌సాయ మార్కెట్లో రైతాంగానికి ఖ‌ళీ బ‌స్తాల డ‌బ్బుల‌ను వ్యాపారులు ఇస్తున్నారు. 2012 నుంచి ఒక ఖాళీ బ‌స్తాకు రూ.25 రైతుల‌కు చెల్లిస్తున్నారు. మిర్చి, కాట‌న్ బ‌స్తాల‌కు డ‌బ్బులు ఇస్తున్నారు. కానీ.. వ‌రంగ‌ల్ ఏనుమాముల వ్య‌వ‌సాయ మార్కెట్‌లో మాత్రం ఖాళీ బ‌స్తాల‌కు వ్యాపారులు డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంలో ఉన్న ఆంత‌ర్యం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. మార్కెట్ అధికారులు, క‌మిటీల నిర్ల‌క్ష్యం వ‌ల్లే ఇక్క‌డి వ్యాపారులు రైతుల‌కు ఖాళీ బ‌స్తాల డ‌బ్బులు ఇవ్వ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. ఒక‌రోజుకు రైతాంగం ల‌క్ష‌లాది రూపాయ‌లు కోల్పోతున్నా… ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ప్ర‌శ్నలు రైతులు, రైతు సంఘాల నుంచి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికైనా అధికారులు స్పందించి, ఖాళీ బ‌స్తాల డ‌బ్బులు ఇచ్చేలా చూడాల‌ని రైతులు కోరుతున్నారు.

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img