- తండాలను జీపీలుగా మార్చేందుకు మూలం
- 2009 ఆగస్టు 28న సందర్శించిన కేసీఆర్
- గురిజాలలో పల్లెనిద్ర.. గ్రామంలోనే 20 గంటలు బస
- పండ్లపుల్ల వేసుకొని, లుంగీతో కలియతిరిగిన ఉద్యమనేత
- రేపు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
అక్షరశక్తి, ప్రధాన ప్రతినిధి : ఆంధ్ర వలస పాలనలో ఆగమైన బతుకులను, ధ్వంసమైన పల్లెలను, తెలంగాణ ధీన స్థితులను తెలుసుకునేందుకు ఉద్యమనేత కేసీఆర్ నాడు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఆయన ప్రతి పర్యటనలో గుర్తించిన సమస్యలకు పరిష్కారంగా ఒక్కో పథకాన్ని తెరపైకి తెచ్చారు. వీటిలో ఒకటి గురిజాల పర్యటన.. తండాలు ప్రత్యేక పంచాయతీలుగా మారేందుకు గురిజాల పల్లెనిద్రే స్ఫూర్తినిచ్చింది. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తలపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని కౌంటర్ చేస్తూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో పల్లెనిద్రకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా 2009 ఆగస్టు 28వ తేదీన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాలను సందర్శించారు. సాయంత్రం గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్.. నర్సంపేట మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నామాల కృష్ణమూర్తి ఇంట్లో రాత్రి బస చేశారు.
కాలినడకన కలియతిరుగుతూ..
29న ఉదయం గురిజాలలోని నామాల కృష్ణమూర్తి ఇంటి వద్ద కాలకృత్యాలు తీర్చుకున్నాడు. పండ్ల పుల్ల వేసుకుని లుంగీపైనే స్థానికులను కలిసేందుకు కృష్ణమూర్తి ఇంటి నుంచి బయలుదేరారు. కాలినడకన గురిజాలలోని బీసీలు, యాదవ కులస్తులు, ఎస్సీలతో వేర్వేరుగా కలిసి మాట్లాడారు. ఆప్యాయంగా వారిని పలకరించి సమస్యలను అడిగితెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై వారు చెప్పేది ఓపిగ్గా విన్నారు. తర్వాత కేసీఆర్ కాలినడకన సమీపంలోని గుంటూరుపల్లెను, ఆ తర్వాత గుంటూరపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని భీమ్లా తండాకు చేరుకున్నారు. అక్కడ గిరిజనులు ఎదుర్కుంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించారు.
నాటి మాట నేడు నిజమైంది
భీమ్లాతండాలోని గిరిజన మహిళ బానోత్ సరోజన ఇంటి ముందు నేలపై పరదాలో కూర్చుని ఉదయం సరోజన అందించిన జొన్న రొట్టెలు తిన్నాడు. తండాలో రోడ్లు సరిగా లేవని, సమస్యలతో సతమతమవుతున్నామని , సాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని, బోర్లపై ఆదారపడటం వల్లే వ్యవసాయంలో నష్టం వస్తోందని గిరిజనులు కేసీఆర్ దృష్టికి తెచ్చారు. సమస్యలన్నింటినీ ఓపిగ్గా విన్న కేసీఆర్.. తెలంగాణ వస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, తప్పకుండా రాష్ట్రం వచ్చి తీరుతుందని, స్వరాష్ట్రంలో తండాలన్నీ గ్రామపంచాయతీలుగా మారుతాయని అన్నారు. అనంతరం భీమ్లాతండా నుంచి తిరిగి కృష్ణమూర్తి ఇంటికి చేరుకున్న కేసీఆర్ అక్కడే అల్పాహారం చేసి వెళ్లిపోయారు. పర్యటన ముగిసే వరకూ ప్రస్తుత నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కేసీఆర్ వెంటే ఉన్నారు. అయితే.. నాడు ఉద్యమనేతగా కేసీఆర్ చెప్పిన మాట నేడు నిజమైందని తండావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రేపు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు.