హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరి సహకారంతో హనుమకొండ జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని నూతన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. గురువారం ఉదయం భద్రకాళి దేవాలయాన్ని సందర్శించిన అనంతరం నేరుగా కలెక్టరేట్‌కు చేరుకున్న ఆమెకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు కలెక్టర్, అదనపు కలెక్టర్ సంధ్యా రాణితో కలసి జిల్లా ఉన్నతిధికారులతో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా నూతన కలెక్టర్ మాట్లాడు తూ .. జిల్లాలో పనిచేసేందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ ప్రాధాన్య పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని, అందరి సహకారంతో జిల్లాను ముందుకు నడిపిస్తానని తెలిపారు. తాను హనుమకొండ జిల్లాకు కొత్త అయినప్పటికీ, త్వరలోనే జిల్లా గురించి పూర్తిగా తెలుసుకొని గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్ల మాదిరిగానే అధికారులు, ప్రజా ప్రతినిధులసహకారం, సమన్వయంతో జిల్లాను ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు లబ్దిదారులకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు ఫలితాలు సాధించాలి అని అన్నారు.
తాను ఎల్లప్పుడూ అధికారులకు, ప్రజలకు అందుబాటులో ఉంటాను అని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల ఫలాలు కిందిస్థాయి వరకు చేరాలంటే విస్తృతంగా క్షేత్ర పర్యటనలు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం సీపీ రంగనాథ్‌ను, సాయంత్రం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కృష్ణమూర్తిని మర్యాద పూర్వకంగా కలిశారు. సాయంత్రం 6 గంటలకు వరంగల్ కలెక్టర్ గోపీ, మున్సిపల్ కమీషనర్ ప్రావీణ్య కలిసి కలెక్టర్ ఛాంబర్ లో కలిసి అభినందించారు.