Friday, September 13, 2024

ఇదేం పేషీ!

Must Read
  • స‌చివాల‌యంలో కొలిక్కిరాని అధికారుల కేటాయింపు
  • యాభై రోజులు గ‌డుస్తున్నా తాత్కాలిక పోస్టింగ్‌లే..
  • సిబ్బంది లేక‌పోవ‌డంతో పూర్తిస్థాయిలో ప‌నిచేయ‌ని వైనం

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం కొలువుదీరి 50 రోజులు గడుస్తోంది. ముఖ్య‌మంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచే పాల‌న‌లో స‌మూల మార్పుల‌కు శ్రీకారం చుట్టారు. పాల‌నా సౌల‌భ్యం కోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బ‌దిలీలు చేప‌డుతూనే మ‌రోప‌క్క రాష్ట్ర‌స్థాయి కీల‌క పోస్టుల‌ను క్ర‌మంగా భ‌ర్తీ చేస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన త‌ప్పిదాలు పున‌రావృతం కాకుండా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. అయితే.. ప్ర‌భుత్వ పాల‌న‌కు గుండెకాయ లాంటి సచివాలయంలో మాత్రం అధికారుల కేటాయింపు నేటికీ పూర్తికావ‌డంలేదు. మంత్రులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నా, ఆయా శాఖల అధికారులతో సమన్వయం చేయాలన్నా మంత్రుల పేషీలు అత్యంత కీలకం. ఈ పేషీల్లో పీఎస్, అడిషనల్ పీఎస్, ఓఎస్డీ, పీఏల‌తోపాటు కంప్యూటర్ ఆపరేటర్లు ఉండాల్సిందే. కానీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కార్యాలయం, కొందరు మంత్రుల దగ్గర మినహా మిగతా ఏ మంత్రి పేషీలోనూ పూర్తిస్థాయిలో అధికారులను, సిబ్బందిని కేటాయించలేదు. ప్రస్తుతానికి పేషీల్లో కొంతమంది సిబ్బంది కనిపిస్తున్నా వారంతా తాత్కాలికమేన‌ని చెబుతున్నారు. దీంతో అధికారులు, సిబ్బంది లేక‌పోవ‌డంతో పేషీలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. అయితే త్వ‌ర‌లోనే అన్ని పేషీల్లో ప్ర‌భుత్వం పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బందిని కేటాయించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్ర‌భుత్వం ఆచితూచి అనేక నిబంధనలు పాటిస్తున్నట్టు తెలుస్తోంది. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పని చేయని వారికి, బీఆర్ఎస్‌తో ఎలాంటి సంబంధంలేని వారికి, తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులకే పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమ‌కు నమ్మకస్తులైన వాళ్లను అమాత్యుల కార్యాలయాల్లో నియమించే ప్రక్రియ చేపట్టినట్లు స‌మాచారం. దీంతో కొందరు మంత్రులు తమకు కావలసిన వ్యక్తుల జాబితాను ఇప్ప‌టికే సీఎంవోకు అందజేసినట్లు సమాచారం. ఈమేర‌కు కొందరు అధికారులు, సిబ్బంది జాబితాను రూపొందించారని, ఇంటెలీజెన్స్ సిబ్బందితో వారి సమగ్ర వివరాలను పరిశీలించారని తెలుస్తోంది. ఇందులో నుంచి తుది జాబితా సిద్ధమైందని, త్వ‌ర‌లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదముద్ర వేయ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆ తర్వాత శాఖలకు సిబ్బంది కేటాయింపు పూర్తవుతుందని విశ్వసనీయంగా తెలిసింది.

 

 

 

 

 

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img