- మేడారం జాతర కొత్త సారధిగా కొర్నిబెల్లి విష్ణు పటేల్ !
- బ్లాక్ కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శికే పగ్గాలు !
- కొర్నిబెల్లి బుచ్చయ్య వంశంలో నాలుగో తరం..
- మరోమారు కామారాన్ని వరించనున్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి
- ఈసారి కూడా ఏకగ్రీవానికే ప్రభుత్వం మొగ్గు
- ఇప్పటికే మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటిని కలిసిన విష్ణు
- సానుకూలంగా స్పందించిన నేతలు.. త్వరలోనే ప్రకటన!
అక్షరశక్తి, వరంగల్: కోట్లాది భక్తుల కొంగుబంగారం సమ్మక్క-సారలమ్మ ట్రస్ట్ బోర్డుకు కొత్త సారధి రాబోతున్నారా..? కొర్నిబెల్లి బచ్చయ్య వంశంలో నాలుగో తరం వారసుడికే పగ్గాలు దక్కనున్నాయా..? తెలంగాణ మహా కుంభమేళా మేడారం జాతర చైర్మన్ పదవి కొర్నిబెల్లి విష్ణు పటేల్‌ను వరించనుందా..? అంటే ఔననే సమాధానమే వస్తుంది. తాడ్వాయి మండలం కామారం గ్రామానికి చెందిన కొర్నిబెల్లి విష్ణు పటేల్ పేరు మేడారం జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. చైర్మన్ పదవి కోసం ముగ్గురు పోటీపడుతున్నప్పటికీ.. ఒప్పందం ప్రకారం కొర్నిబెల్లి విష్ణు పటేల్‌కు పదవి దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఉన్నత విద్యావంతుడిగా, కొర్నిబెల్లి బచ్చయ్య వారసుడిగా, కాంగ్రెస్ పార్టీలో చురుకైన నేతగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న విష్ణు పటేల్ మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆశీస్సులతో చైర్మన్ పీఠాన్ని అధిష్టించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనుందనే ప్రచారం జరుగుతోంది. చైర్మన్ పదవి కోసం అర్రెం లచ్చుపటేల్, శర్ప రవీందర్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది త్వరలోనే తేలనుంది.
నిబంధల ప్రకారం..
తాడ్వాయి మండలం కామారం గ్రామానికి చెందిన కొర్నిబెల్లి విష్ణు పటేల్ మేడారం జాతరకు ఆధ్యుడిగా పేరున్న కొర్నిబెల్లి బచ్చయ్యకు ముని మనవడు. 2009 నుంచి బీఆర్ఎస్‌లో ఉన్న ఆయన ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీతక్క గెలుపు కోసం ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించారు. ఈక్రమంలోనే బ్లాక్ కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శిగా (తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట) నియమితులయ్యారు. జాతర నిర్వహణ ఒప్పందం ప్రకారం బచ్చయ్య వారసులకే శాశ్వత చైర్మన్ పదవి ఇవ్వాల్సి ఉంది. 1945లో సమ్మక్క- సారక్క జాతర ప్రైవేటీకరణ కాకుండా, ఆదివాసీ పూజారుల నుండి చేజారకుండా సాయుధ పోరాటంతో కొర్నిపెల్లి బుచ్చయ్య నాయకత్వంలో మేడారం జాతరను కాపాడారు. అందుకుగాను అప్పటి మేడారం పూజారులు, కాల్వపల్లి వడ్డెలు, బయ్యక్కపేట తలపతులు లిఖితపూర్వకంగా ఒప్పందపత్రం చేసుకున్నారు. 1929లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం దూత ఎమండరస్ సమక్షంలోనే ఒప్పందం కుదిరింది. ఆ రోజు నుంచి మేడారం సమ్మక్క – సారక్క దేవస్థానం శాశ్వత చైర్మన్‌గా కొర్నిబెల్లి బుచ్చయ్య పటేల్ వారసులకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. అయితే 2004 లో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి నేటి దాక అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులకే చైర్మన్ గిరితోపాటు డైరెక్టర్ పదవులు కట్టబెడుతున్నారని కొర్నిబెల్లి వంశస్తులు ఆరోపిస్తున్నారు. పూజారులు, వడ్డెలు, తలపతులు చేసుకున్న ఒప్పందం ప్రకారమే ఈసారి నియామకం చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
అవకాశం కల్పించండి..
2024 మహాజాతర సందర్బంగా రాజకీయాలకు అతీతంగా కొర్నిబెల్లి వంశస్తులకే మేడారం జాతర శాశ్వత చైర్మన్ పదవి ఇవ్వాలని కొర్నిబెల్లి విష్ణు పటేల్ డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ఆయన హైకోర్టులో పిటిషన్ వేయడంతోపాటు రాష్ట్ర గవర్నర్‌ను కలిసి విన్నవించారు. హైకోర్టు కూడా కొర్నిపల్లి బుచ్చయ్య పటేల్ వారసులకే ఈసారి సమ్మక్క – సారక్క జాతర చైర్మన్ పదవి ఇవ్వాలని సూచించింది. ఆదివాసీ సంఘాలు, ప్రజాసంఘాలు, పూజారులు, వడ్డేలు, తలపతులంతా ఏకాభిప్రాయంతో కొర్నిబెల్లి విష్ణుపటేల్‌కే మేడారం ట్రస్టు బోర్డు చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈక్రమంలోనే తనకు అవకాశం కల్పించాలని కోరుతూ విష్ణు పటేల్ ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు. ఇటీవల రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటిని కలిసి విన్నవించారు. దీంతో వారు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మేడారం జాతర అభివృద్ధికి పాటుపడతానని, తనకు అవకాశం కల్పించాలని విష్ణు పటేల్ కోరుతున్నారు. గతంలో జాతరకు నెలన్నర ముందే కమిటీని ప్రకటించేవారని, జాతర సమీపిస్తున్న వేళ ఇప్పటికైనా త్వరగా మేడారం జాతర చైర్మన్‌ను నియమిస్తే అభివృద్ధి పనులు మరింత వేగంగా కొనసాగుతాయని భక్తులు కోరుతున్నారు.