Friday, July 26, 2024

మానుకోట కాంగ్రెస్ టికెట్ ఆయ‌న‌కేనా..?

Must Read
  • అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసేందుకు బెల్ల‌య్య‌నాయ‌క్ క‌స‌ర‌త్తు
  • నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌ట‌న‌లు
  • ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై నిరంత‌ర కార్యాచ‌ర‌ణ‌లు
  • కాంగ్రెస్ శ్రేణుల‌ను సమ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు
  • ప్ర‌జాసంఘాలు, ఇత‌ర‌వ‌ర్గాల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నం

అక్ష‌ర‌శ‌క్తి, మ‌హ‌బూబాబాద్ ప్ర‌తినిధి : వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మానుకోట‌పై కాంగ్రెస్ జెండా ఎగుర‌వేసేందుకు పార్టీ అధిష్ఠానం వ్యూహాత్మ‌కంగా ముందుకు వెళ్తోంది. నియోజ‌క‌వ‌ర్గంలో క్షేత్ర‌స్థాయిలో పార్టీకి బ‌ల‌మైన పునాది ఉన్నా.. నాయ‌క‌త్వ లోపంతో, గ్రూపు త‌గాదాల‌తో కొట్టుమిట్టాడుతున్న పార్టీకి పూర్వ వైభ‌వం తీసుకొచ్చే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. ప్ర‌జ‌లు, విద్యార్థులు, ప్ర‌జాసంఘాలు, మేధావివ‌ర్గాల‌తో మంచి సంబంధాలు ఉన్న బ‌ల‌మైన నేతగా బెల్ల‌య్య నాయ‌క్‌ను బ‌రిలోకి దించే యోచ‌న‌లో పార్టీ అగ్ర‌నేత‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈమేర‌కు సంకేతాలు కూడా అంద‌డంతో కొంత‌కాలంగా బెల్ల‌య్య‌నాయ‌క్ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. జ‌నంలోకి బ‌లంగా వెళ్తూ.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న‌ట్లు పార్టీవ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మానుకోట అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ రేసులో బెల్ల‌య్య‌నాయ‌క్‌తోపాటు మాజీ కేంద్ర మంత్రి బ‌ల‌రాంనాయ‌క్‌, ముర‌ళీనాయ‌క్‌, నూనావ‌త్ రాధ‌, ఒక ఎన్ఆర్ఐ కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన పునాది..
మానుకోట నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన పునాది ఉంది. ప్ర‌తీ గ్రామంలో, ప్ర‌తీ మారుమూల ప‌ల్లెలోనూ ఓటుబ్యాంకు ఉంది. ప్ర‌చారం చేసినా, చేయ‌క‌పోయినా, ఎవ‌రు బ‌రిలోకి నిలిచినా.. అన్నిప్రాంతాల నుంచి ఓట్లు వ‌స్తాయి. అయితే.. పార్టీలో గ్రూపు త‌గాదాల వ‌ల్ల న‌ష్టం జ‌రుగుతూ వ‌స్తోంది. రాష్ట్రంలో పార్టీకి బ‌ల‌మైన పునాది ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో మానుకోట కూడా ఒక‌ట‌ని, అంద‌రూ స‌మ‌న్వ‌యంతో, క‌లిసిక‌ట్టుగా ఉండి బ‌రిలోకి దిగితే గెలుపు ఖాయ‌మ‌న్న అంచ‌నాకు వ‌చ్చిన పార్టీ అధిష్టానం.. ఈసారి ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాల‌కు చెక్‌పెడుతూ.. ముందుకు న‌డిపంచేలా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప‌క్కా కార్యాచ‌ర‌ణ‌తో ఉన్న‌ట్లు పార్టీవ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 2018 ముంద‌స్తు ఎన్నిక‌ల్లో బలరాం నాయక్ ఎమ్మెల్యేగా పోటీచేసారు. టికెట్ రాలేదనే అక్కసుతో కాంగ్రెస్ పార్టీలోని ఓ లీడర్ హ్యాండ్ ఇయ్యడంతో బలరాం నాయక్ ఓటమి పాల‌య్యార‌నే టాక్ ఉంది. ఈ నేప‌థ్యంలో ఇలాంటి రిపీట్‌కాకుండా ప‌క్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లేందుకు అధిష్టానం మానుకోట‌పై స్పెష‌ల్ ఫోక‌స్ ఫెట్టిన‌ట్లు తెలుస్తోంది.

జ‌నంలోకి బెల్ల‌య్య‌నాయ‌క్‌…!
జాతీయ ఆదివాసీ కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడిగా, తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధిగా కొన‌సాగుతున్న బెల్ల‌య్య‌నాయ‌క్‌కు అగ్ర‌నేత‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. టికెట్ రేసులో ఉన్న ఆయ‌న‌.. కొంత‌కాలంగా నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు. అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌ధానంగా ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై నిరంత‌ర కార్యాచ‌ర‌ణ‌తో జ‌నంలో ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే కేసముద్రం నారాయణపురం రైతుల భూముల వివాదంలో రైతులతరుపున బెల్లయ్య నాయక్ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్, ఎమ్మార్పీఎస్‌, మాల మహానాడు, ఎల్ హెచ్ పి ఎస్ లంబాడా సేవా సంఘాలతో క‌లిసిక‌ట్టుగా న‌డిచి ఆ రైతులకు భరోసా ఇచ్చారు. అలాగే, దంతాల పెళ్లి క్రాస్ రోడ్ వద్ద గిరిజన భూములు కబ్జా కాకుండా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో పోరాడారు. మానుకోట మెడికల్ కాలేజీ కోసం ప్ర‌భుత్వం సేక‌రించిన గిరిజన భూముల విష‌యంలోనూ బాధితుల ప‌క్షాల కొట్లాడారు. మహిళా గిరిజ‌న రైతులను పోలీసులు అర్ధ‌రాత్రి అరెస్టు చేయ‌డాన్ని ఆయ‌న తీవ్రంగా ఖండించి, బెయిల్ వ‌చ్చేలా చేసి, అండ‌గా నిల‌బ‌డ్డారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక సన్నాహక సభ ను జిల్లా కేంద్రం లో నిర్వహించడం కాంగ్రెస్ శ్రేణులను ఒకింత బలం చేకూరలా చేసింది. ఇలా కొంత‌కాలంగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిత్య కార్యాచ‌ర‌ణ‌తో ఉంటూ టికెట్ ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

రాహుల్ స‌భ‌కు భారీ జ‌న స‌మీక‌ర‌ణ‌…
హ‌న్మ‌కొండ ఆర్ట్స్‌క‌ళాశాల మైదానంలో మే 6న నిర్వ‌హించ‌నున్న రైతు సంఘర్షణ స‌భ‌లో కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ పాల్గొన‌నున్నారు. పోరుగ‌డ్డ ఓరుగ‌ల్లు నుంచే కాంగ్రెస్ శ్రేణుల్లో నూత‌నొత్తేజం నింపాల‌ని చూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఈ స‌భ‌ను అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలోనే ఇప్ప‌టికే టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితోపాటు ప‌లువురు అగ్ర‌నేత‌లు స‌భా ఏర్పాట్ల‌ను క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. ఈ స‌భ‌కు మానుకోట జిల్లా న ఉంచి భారీ జ‌న స‌మీక‌ర‌ణ చేప‌ట్టేందుకు నాయ‌కులు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. టికెట్ రేసులో ఉన్న నేత‌లు జ‌న స‌మీక‌ర‌ణ‌తో బ‌లం చూపించుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ దిశ‌గా స‌న్నాహ‌క స‌మావేశాలు నిర్వ‌హించారు. స‌భ త‌ర్వాత టికెట్ల విష‌యంలో చాలావ‌ర‌కు క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img