అక్షరశక్తి, డెస్క్ : రాజ్యసభలో ఖాళీ అయిన 12 స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. 9 రాష్ట్రాల్లో 12 స్థానాలకు సెప్టెంబర్ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అస్సాం, బీహార్, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర రాష్ట్రాల నుంచి 10 మంది సభ్యులు లోక్‌సభకు ఎన్నిక అయ్యారు. ఇక తెలంగాణ, ఒడిశా నుంచి ఒక్కొక్కరు తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. కే కేశవరావు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఆగస్టు 14న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఆగస్టు 21. అస్సాం, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీలోపు, బీహార్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు 27వ తేదీలోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.