– బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు..
– తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అక్షరశక్తి, హైదరాబాద్ : బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు.. అలా తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ పైన, విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలి. లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. అని కేటీఆర్ హెచ్చరించారు. 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది. ఇవన్నీ దాటుకొని 24 ఏండ్ల పాటు నిబద్ధతతో, పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్. సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిపాం.. అని కేటీఆర్ తెలిపారు. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది. ఎప్పటిలానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది.. పోరాడుతుంది. ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను, దుష్ప్రచారాలను మానుకోవాలి. పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం… కానీ తలవంచం.. ఎన్నటికైనా ఎప్పటికైనా.. అని కేటీఆర్ అన్నారు.