Tuesday, September 10, 2024

వరంగల్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Must Read

– ఈ నెలలోనే నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తాం..
– ఆగమ శాస్త్ర ప్రకారం భద్రకాళీ దేవస్థానం అభివృద్ధి
– టెక్స్టైల్ పార్కులో కంపెనీల ఏర్పాటు, ఉద్యోగ కల్పనపై సమీక్ష
– మారుమూల ప్రాంతాలలో వైద్య సేవలు
– వరంగల్ జిల్లా నగర అభివృద్ధిపై మంత్రి పొంగులేటి స‌మీక్ష‌

అక్ష‌ర‌శ‌క్తి, హైద‌రాబాద్‌ : వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో మంగళవారం వరంగల్ నగర అభివృద్ధిపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సమీక్ష నిర్వహించారు. సుధీర్ఘంగా నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ, భద్రకాళి దేవస్థానం, మెగా టెక్స్ టైల్ పార్కు, వరంగల్ ఎయిర్ పోర్టు, నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, సమీకృత రెసిడెన్షియల్ స్కూల్స్ తదితర అంశాలపై చర్చించారు. అంశాలవారీగా అభివృద్ధి పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ ను అభివృద్ధి పరచాలన్న కృతనిశ్చయంతో వరంగల్ నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల అమలులో వేగం పెంచాలని, ప్రజలకు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల ఎంపికలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలకు అనుగుణంగానే పనులను చేపట్టాలని అధికారులకు సూచించారు. నాణ్యత ప్రమాణాల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని అన్నారు. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్ ల కోసం రైతు సంతృప్తి చెందేలా మానవీయ కోణంలో భూసేకరణను చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎయిర్ పోర్ట్ భూసేకరణ కోసం ఎయిర్ పోర్ట్ అథారిటి, ఆర్ అండ్ బీ అధికారులతో సమావేశం కావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద చేపట్టిన పనులను ఈ యేడాది డిసెంబర్ 31వ తేదీలోగా పూర్తి చేసేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని అధికారులకు సూచించారు. కాళోజీ కళాక్షేత్రం పనులను ఈ నెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని వచ్చే నెలలో ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. చారిత్రాత్మక భద్రకాళీ దేవస్థానం అభివృద్ధి పనులను ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మాడవీధుల నిర్మాణంతో పాటు ఆలయం చుట్టూ రాతి బేస్మెంట్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ టెక్స్ టైల్ పార్కులో ఇప్పటివరకు ఎంతమంది పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు, ఎన్ని కంపెనీలకు ఎంత భూములను కేటాయించారు, ఎన్ని పరిశ్రమలు ప్రారంభయ్యాయి, ఎంతమందికి ఉపాధి కల్పించారు వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనిపై పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి తో సమావేశం ఏర్పాటు చేసి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు.

నర్సంపేట మెడికల్ కాలేజిలో అడ్మిషన్స్ ను ఈ ఏడాది నుంచే ప్రారంభించేలా చర్యలు తీసుకున్న వైద్య శాఖ అధికారులను మంత్రిగారు అభినందించారు. ముఖ్యమంత్రి సమయం తీసుకుని ఈ నెల మూడవ వారంలో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మారుమూల ప్రాంతాలలో పేదప్రజలకు వైద్య సేవలు అందేలా డాక్టర్లను అందుబాటులో ఉంచాలని ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్ట‌ర్ క్రిస్టినా చొంగ్తును ఆదేశించారు. ఈ విషయంలో వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖమ్మం, వరంగల్ మధ్యలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ఇందుకు అవసరమైన భూమిని సేకరించాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో వరంగల్ జిల్లా ప్రజా ప్రతినిధులు వరంగల్ జిల్లా శాసన సభ్యులు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, కె.నాగరాజు, శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజు సారయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ శాఖ కార్యదర్శి దాన కిశోర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి డా. క్రిస్టినా చొంగ్తు, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, సీడీఎంఏ వి.పి. గౌతమ్ తో పాటు వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారదా, పి. ప్రావీణ్య, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాఖేడే, సంబంధిత శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img