Saturday, May 18, 2024

ఝాన్సీరెడ్డి డౌటే..! బ‌రిలోకి కోడ‌లు?

Must Read
  • స‌కాలంలో భార‌తీయ పౌర‌స‌త్వం రాక‌పోవ‌డ‌మే కార‌ణం?
  • కోడ‌లిని రంగంలోకి దించేందుకు ప్ర‌య‌త్నాలు
  • వ్య‌తిరేకిస్తున్న సీనియ‌ర్ కాంగ్రెస్ క్యాడ‌ర్‌
  • పాల‌కుర్తి కాంగ్రెస్‌లో గంద‌ర‌గోళం
  • ఓసీఐతో ఇక్క‌డ రాజ‌కీయాలా..? అంటూ బీఆర్ఎస్‌ విమ‌ర్శ‌లు

అక్ష‌ర‌శ‌క్తి, ప్ర‌ధాన‌ప్ర‌తినిధి : ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా హ‌నుమాండ్ల ఝాన్సీరెడ్డి బ‌రిలోకి దిగడం క‌ష్ట‌మేనా..? ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆమెకు భారతీయ పౌర‌స‌త్వం వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదా..? ఎలాగైనా పోటీ చేయాల‌న్న వ్యూహాత్మ‌క అడుగులు క‌లిసిరావ‌డంలేదా..? ఈ నేప‌థ్యంలోనే ఆమె కోడ‌లు డాక్ట‌ర్‌ య‌శ‌శ్వినిని రంగంలోకి దించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారా..? అంటే.. నియోజ‌క‌వ‌ర్గంలో కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న ప‌రిణామాలు ఔన‌నే అంటున్నాయి. అమెరికాలో స్థిర‌ప‌డిన హ‌నుమాండ్ల ఝాన్సీరెడ్డికి కేవ‌లం ఓసీఐ( ఓవ‌ర్సీస్ సిటిజ‌న్‌షిప్ ఆఫ్ ఇండియా ) కార్డు మాత్ర‌మే ఉంది. తీరా ఎన్నిక‌ల ముంగిట పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగాల‌న్న ల‌క్ష్యంతో ఇక్క‌డికి వ‌చ్చారు. కానీ.. ఇక్క‌డి ప‌రిణామాలు ఆమెకు ఏమాత్ర‌మూ క‌లిసివ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డంలేదు. ప్ర‌ధానంగా భార‌తీయ పౌర‌స‌త్వం పొంద‌డం ప్ర‌ధాన అడ్డంకిగా మారిపోతోంది. ఓ వైపు అక్టోబ‌ర్ మొద‌టి వారంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చే అవ‌కాశాలు ఉండ‌గా.. మ‌రోవైపు ఆమెకు మాత్రం భార‌తీయ పౌర‌స‌త్వం స‌కాలంలో అందే అవ‌కాశాలే క‌నిపించ‌డంలేద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో కొంత ఒత్తిడికి లోన‌వుతున్న ఝాన్సీరెడ్డి.. తాజాగా.. ఆమె కోడ‌లిని బ‌రిలోకి దించేంద‌కు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఉత్సాహంగా పాల‌కుర్తిలోకి అడుగుపెట్టినా..!
వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థే క‌ర‌వు అంటూ ప్ర‌చారం జ‌రుగుతున్న క్ర‌మంలో ఒక్క‌సారిగా హ‌నుమాండ్ల ఝాన్సీరెడ్డి పేరు తెర‌పైకి వ‌చ్చింది. అంతేవేగంగా, ఉత్సాహంగా.. మొద‌టి రోజు పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోకి భారీ కాన్వాయ్‌తో అడుగుపెట్టారు. కానీ.. రోజులు గ‌డిచే కొద్దీ ప‌రిస్థితులు అత్యంత ప్ర‌తికూలంగా మారిపోతున్నాయి. ఓవైపు సొంత‌పార్టీలోనే గ్రూపులు.. పార్టీ సినియ‌ర్ క్యాడ‌ర్ నుంచి క‌నీస మ‌ద్ద‌తు ద‌క్క‌క‌పోవ‌డం.. మ‌రోవైపు.. భార‌తీయ పౌర‌స‌త్వం పొంద‌డం క‌ష్టంగా మార‌డం.. ఇలా అనేక ప‌రిణామాలు ఆమెను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయ‌నే టాక్ బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లంద‌రూ ఒక్క‌టిగా ముందుకు వెళ్లే ప‌రిస్థితులు మాత్రం ద‌రిదాపుల్లోనూ క‌నిపించ‌డం లేదు. ప్ర‌ధానంగా సీనియ‌ర్ క్యాడ‌ర్‌, హ‌నుమాండ్ల ఝాన్సీరెడ్డి, తిరుప‌తిరెడ్డి వ‌ర్గంగా పార్టీ మూడుముక్కలుగా విడిపోయింది. ఇందులో ఏ ఒక్క‌రూ మ‌రొక‌రికి స‌హ‌క‌రించే వాతావ‌ర‌ణం లేదు. ఝాన్సీరెడ్డి, తిరుప‌తిరెడ్డి ప‌ర‌స్ప‌రం తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకున్నారు. ఒకానొక ద‌శ‌లో ఇరువ‌ర్గాల అనుచ‌రుల‌ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం కూడా నెల‌కొంది. చివ‌ర‌కు.. ఝాన్సీరెడ్డి, తిరుప‌తిరెడ్డి తీరుతో స్థానిక క్యాడ‌ర్ తీవ్ర అసంతృప్తికి లోన‌వుతోంది. అస‌లు.. విదేశాల్లో స్థిర‌ప‌డిన ఈ నేత‌లు.. తీరా ఎన్నిక‌లు ముంగిట ఇక్క‌డికి వ‌చ్చి.. మ‌న‌పై పెత్త‌నం చేయ‌డం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

రంగంలోకి కోడ‌లు య‌శ‌శ్వ‌ని
భార‌తీయ పౌర‌స‌త్వ స‌మ‌స్య కార‌ణంగా హ‌నుమాండ్ల ఝాన్సీరెడ్డి ముందునుంచీ వ్యూహాత్మ‌కంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. స‌కాలంలో భార‌తీయ పౌర‌స‌త్వం వ‌స్తుందో రాదోన‌న్న సందేహంతో ఉన్న ఆమె.. ఇటీవ‌ల టీపీసీసీలో పాల‌కుర్తి కాంగ్రెస్ టికెట్ కోసం కోడ‌లు డాక్ట‌ర్ య‌శ‌శ్విని పేరుతో కూడా ద‌ర‌ఖాస్తు చేసినట్లు తెలిసింది. తాజాగా.. అక్టోబ‌ర్‌లోనే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వచ్చే అవ‌కాశాలు ఉండ‌డంతో అప్ర‌మ‌త్త‌మైన ఝాన్సీరెడ్డి.. పాల‌కుర్తి కాంగ్రెస్ టికెట్‌ను త‌న కోడ‌లు య‌శ‌శ్వినికి ఇప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మూడేళ్ల కింద‌టే ఝాన్సీరెడ్డి కుమారుడితో వివాహ‌మైన య‌శ‌శ్వ‌ని ప్ర‌స్తుతం అమెరికాలో ఉన్నట్లు స‌మాచారం. భార‌తీయ పౌర‌స‌త్వం క‌లిగిన య‌శ‌శ్వ‌నికి టికెట్ ఇచ్చేందుకు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కూడా సానుకూలంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల త‌న‌కే టికెట్ ఇవ్వాలంటూ క‌లిసిన ఓ నేతకు కూడా రేవంత్‌రెడ్డి ఇదే విష‌యం స్ప‌ష్టం చేసిన‌ట్లు అత్యంత విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ నేప‌థ్యంలో పాల‌కుర్తి కాంగ్రెస్‌లో అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దాదాపుగా ఝాన్సీరెడ్డి కోడ‌లికే టికెట్ వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో సీనియ‌ర్ కాంగ్రెస్ క్యాడ‌ర్ నుంచి కూడా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

పౌర‌స‌త్వం లేకుండా ఇక్క‌డ రాజ‌కీయాలా..?
ఓవ‌ర్సీస్ సిటిజ‌న్‌షిప్ ఆఫ్ ఇండియా కార్డు క‌లిగిన హ‌నుమాండ్ల ఝాన్సీరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. అస‌లు భార‌తీయ పౌర‌స‌త్వం లేని వారు.. ఇక్క‌డి ప్ర‌భుత్వంపై, ప‌థ‌కాల‌పై, మంత్రుల‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఆమె తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. భార‌త ప్ర‌భుత్వ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు చేస్తున్న ఆమెపై చ‌ట్ట‌ప‌ర‌మైన‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. అంతేగాకుండా, ఇటీవ‌ల ఆమె తొర్రూరు మండ‌లం గుర్తూరులో సుమారు 32 ఎక‌రాల వ్య‌వ‌సాయ భూమిని కొనుగోలు చేసిన‌ట్లు తెలిసింది. అయితే, భార‌తీయ పౌర‌స‌త్వంలేని వారు.. ఇక్క‌డి వ్య‌వ‌సాయ భూమిని కొనుగోలు చేసే హ‌క్కులేద‌ని చ‌ట్టంలో ఉన్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ విష‌యంపై కూడా మ‌హ‌బూబాబాద్ జిల్లా అధికారులు విచార‌ణ చేప‌ట్టడానికి దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ప్ర‌స్తుతం హ‌నుమాండ్ల ఝాన్సీరెడ్డి తీవ్ర ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
Latest News
- Advertisement -spot_img

More Articles Like This

- Advertisement -spot_img